Share News

ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డుకు రూ.3 వేలు డిమాండ్‌

ABN , Publish Date - Jan 28 , 2025 | 04:03 AM

ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు మంజూరు కోసం లంచం తీసుకుంటూ మునిసిపల్‌ వార్డు ఆఫీసర్‌ ఏసీబీకి దొరికిపోయిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీలో జరిగింది.

ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డుకు రూ.3 వేలు డిమాండ్‌

  • 2500 తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు ఆఫీసర్‌

  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీలో ఘటన

  • మెదక్‌ జిల్లాలో 20 వేలు తీసుకుంటూ దొరికిపోయిన ఏఈ

సత్తుపల్లి రూరల్‌/మనోహరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డు మంజూరు కోసం లంచం తీసుకుంటూ మునిసిపల్‌ వార్డు ఆఫీసర్‌ ఏసీబీకి దొరికిపోయిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీలో జరిగింది. మునిసిపాలిటీ వార్డు ఆఫీసర్‌ రూ.2500 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఘటన వివరాలిలా ఉన్నాయి.. సత్తుపల్లి మునిసిపాలిటీలో 18వ వార్డుకు చెందిన ఓ మహిళ ప్రజాపాలన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డుకోసం దరఖాస్తు చేసుకుంది. 23న గ్రామసభ ముగియగా ఈ పథకాల లబ్ధిదారుల జాబితాలో ఆమె పేరు రావాలంటే రూ.3 వేలు లంచం ఇవ్వాలని వార్డు ఆఫీసర్‌ నల్లంటి వినోద్‌ 24నడిమాండ్‌ చేశాడు. ఆ మహిళ తొలి విడతగా రూ.2,500 ఇచ్చేందుకు అంగీకరించి, ఏసీబీ అధికారులను సంప్రదించింది.


సోమవారం సత్తుపల్లి పాత సెంటర్‌లోని డీసీబీ బ్యాంక్‌ పక్కన వార్డు ఆఫీసర్‌కు రూ.2500 లంచం ఇస్తుండగా ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. నిందితుడ్ని వరంగల్‌ సెషన్స్‌ కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, త్రీ ఫేజ్‌ విద్యుత్తు సరఫరా కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో చోటుచేసుకుంది. మండలంలోని ఓ పరిశ్రమకు 3 ఫేజ్‌ విద్యుత్తు సరఫరా కోసం ఏఈ కృష్ణ రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. పరిశ్రమ యజమానులు రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 17న రూ.10 వేలు ఏఈకి ఇచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మిగిలిన రూ.20 వేలను సోమవారం ఏఈ కాళ్లకల్‌ విద్యుత్తు శాఖ కార్యాలయంలో తీసుకుంటుండగా, మెదక్‌ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని నాంపల్లి ఏబీసీ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

Updated Date - Jan 28 , 2025 | 04:03 AM