Road Accident: మొక్కు కోసం వెళ్లి మృత్యు ఒడికి
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:30 AM
మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. 14 మంది ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసేక్రమంలో దాన్నే ఢీకొట్టింది.

షిర్డీ-ఔరంగాబాద్ రోడ్డులో ట్రాక్టర్‌ను ఢీకొన్న వాహనం.. నలుగురి మృతి
మొక్కుకు తీసుకెళ్లిన శిశువు కూడా.. మరో నలుగురి పరిస్థితి విషమం
బాధితులది ఒకటే కుటుంబం యాదాద్రి జిల్లా కొండగడప వాసులు
మోత్కూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. 14 మంది ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసేక్రమంలో దాన్నే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 6నెల ల శిశువు సహా నలుగురు దుర్మరణంపాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని షిర్డీ-ఔరంగాబాద్‌లో రహదారి గంగాపూర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. మృతులు, క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. బాధిత కుటుంబం స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా మోత్కూరు పరిధిలోని కొండగడప గ్రామం. ఈ ఊరికి చెందిన శ్యామ్‌శెట్టి కృష్ణమూర్తి కుటుంబం 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. అక్కడ కృష్ణమూర్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. కృష్ణమూర్తికి భార్య ప్రేమలత కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి.
పండుగలప్పుడు ఈ కుటుంబం స్వగ్రామానికి వచ్చి వెళుతుంటుంది. కృష్ణమూర్తి కుమారుడు, కోడైలన వెంకన్న-యామిని దంపతులకు ఎనిమిదేళ్లుగా పిల్లలు లేరు. సంతానం కోసం ఎన్నో ఆలయాలు తిరిగి మొక్కుకున్నారు. ఈ దంపతులకు ఆర్నెల్ల క్రితం కుమారుడు వైద్విక్ పుట్టాడు. సంక్రాంతికి సెలవులు రావడంతో కృష్ణమూర్తి కుటుంబం సొంతూరుకొచ్చింది. మనుమడు పుట్టినందుకు షిర్డీ వెళ్లి మొక్కు తీర్చువాలని అనుకుంది. ఈనెల 13న రాత్రి కృష్ణమూర్తి కుటుంబసభ్యులు, ఆయన కూతు ళ్లు, అల్లుళ్లు కలిపి మొత్తం 14మంది షిర్డీ బయలుదేరారు. 14న షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు. సమీపంలో ఉన్న దేవాలయాలు చూసేందుకు 15న షిర్డీలో ఓవాహనం అద్దెకు తీసుకుని బయలుదేరారు. నాసిక్ వెళుతూ ఆ రోజు రాత్రి షిర్డీ-ఔరంగాబాద్ రహదారిలో గంగాపూర్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి దాన్నే ఢీకొట్టిం ది.
ఈ ప్రమాదంలో కృష్ణమూర్తి భార్య ప్రేమలత (57), పెద్ద కుమార్తె ప్రసన్న లక్ష్మి(42), ప్రసన్నలక్ష్మి పెద్ద కుమార్తె అక్షిత (21), వెంకన్న-యామినిల కుమారుడు వైద్విక్ (6నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణమూర్తి, ఆయన కుమారుడు వెంకన్న, కృష్ణమూర్తి అల్లుడు తొలుపునూరి శ్రీనివాస్, శ్రీనివాస్ కుమార్తె శరణ్య తీవ్రంగా గాయపడ్డారు. వారి ని ఔరంగాబాద్‌లోని గజానన్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కృష్ణమూర్తి చిన్న కుమార్తె స్రవంతి, ఆమె భర్త రాంబాబు, వారి ఇద్దరు పిల్లలు, కృష్ణమూర్తి కోడలు యామిని, ఆమె తల్లి, వాహనం డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో కొండగడపలో విషాదఛాయలు అలుముకున్నాయి.