Share News

Retired Employees: విశ్రాంత ఉద్యోగుల అరిగోస

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:07 AM

ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 ఏళ్లపాటు విధులు నిర్వర్తిస్తారు.. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు.

Retired Employees: విశ్రాంత ఉద్యోగుల అరిగోస

  • రాష్ట్రంలో రిటైర్మెంట్‌ ప్రయోజనాల సొమ్ములందక ఇక్కట్లు

  • 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవీ విరమణ

  • ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం రూ.60-70 లక్షలు

  • జీపీఎఫ్‌, గ్రాట్యుటీ, ఎల్‌ఐసీ, కమ్యూటేషన్‌ బిల్లులన్నీ పెండింగ్‌

  • గ్రాట్యుటీ తప్ప.. మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే

  • వారి సొమ్ము వారికివ్వడానికే ఇబ్బందులు పెడుతున్న వైనం

  • కమీషన్లు ఇచ్చేవారికి, పైరవీకారుల బిల్లులకు ఆమోదం!

  • అందరికీ చెల్లించాలంటే రూ.5 వేల కోట్లు అవసరం

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 ఏళ్లపాటు విధులు నిర్వర్తిస్తారు.. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్‌, టీజీఎల్‌ఐసీ, ఆర్జిత సెలవుల సొమ్ములు అందుతాయని.. ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం.. ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు. కానీ, సర్కారు మాత్రం వారి ఆశలను అడియాశలు చేస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. 61 ఏళ్ల పైబడి, నడవడానికి ఇబ్బంది పడేవారు, పక్షవాతం, ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సొమ్ములందక విశ్రాంత ఉద్యోగులు గోస పడుతున్నారు. తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందించి, శాలువాలతో సత్కరించి, ఇంటి వరకు ప్రభుత్వ వాహనాల్లో దింపి రావాలంటూ గత కేసీఆర్‌ ప్రభుత్వం ఆదేశించింది. కానీ, అప్పటి నుంచే ఈ విధానం అమలు కావడం లేదు!! కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. రిటైరైన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెలలు గడుస్తున్నా చెల్లించడం లేదు. వీటన్నింటినీ క్లియర్‌ చేయాలంటే దాదాపు రూ.5000 కోట్లకు పైగానే అవసరమవుతాయని అంచనా. బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.


ఒక్కో రిటైర్డు ఉద్యోగికి 60-70 లక్షలు రావాలి

సాధారణంగా ఉద్యోగి రిటైరైన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేది పెద్దగా ఏమీ ఉండదు. ఉద్యోగి తన పదవీ కాలంలో దాచుకున్న సొమ్మునే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్‌, టీజీఎల్‌ఐసీ, కమ్యూటేషన్‌, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులను సరెండర్‌ చేయడం వంటివాటన్నింటి కింద రూ.60-70 లక్షల వరకు వస్తుంటాయి. అలాగే, ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్‌ కింద సగటున రూ.8-10 లక్షల వరకు అందుతుంది. ఉద్యోగి రిటైరైన తర్వాత కమ్యూటేషన్‌ కింద 40 శాతం వరకు పెన్షన్‌ను ప్రభుత్వానికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. మిగతా 60 శాతం పెన్షన్‌ రూపంలో ప్రతి నెలా అందుతుంది. తాను అమ్ముకున్న 40శాతం పెన్షన్‌ తాలూకు సొమ్మును ఒకేసారి ప్రభుత్వం అడ్వాన్సుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉద్యోగికి రిటైరైన వెంటనే దాదాపు రూ.15 లక్షల వరకు అందుతుంది. తెలంగాణ ప్రభుత్వ బీమా (టీజీఎల్‌ఐసీ) కింద ఉద్యోగి మూల వేతనం నుంచి కనీసం 6 శాతం లేదంటే అంతకంటే ఎక్కువ శాతం మేర ప్రీమియం కట్‌ అవుతుంటుంది.


రిటైరైన తర్వాత ఎల్‌ఐసీ కింద జమ అయిన సొమ్మును ఉద్యోగికి ఇచ్చేయాలి. దీని కింద రూ.6 లక్షల వరకు అందుతుంది. ఉద్యోగి 300 వరకు ఆర్జిత సెలవుల (ఈఎల్‌)ను నిల్వ చేసి పెట్టుకోవచ్చు. వీటిని రిటైరైన తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఈఎల్‌లకు సంబంధించి ఒక్కో ఉద్యోగికి రూ.12-15 లక్షల వరకు సొమ్ము అందుతుంది. ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి రూ.16లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కో ఉద్యోగికి రూ.60-70 లక్షల వరకు సొమ్మును ప్రభుత్వం వెంటనే అందించాలి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2021లో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దాంతో 2024 మార్చి 31 వరకు రిటైర్మెంట్లు లేవు. ఆ తర్వాత ప్రారంభమయ్యాయి. 2024లోనే 7,995 మంది రిటైరయ్యారు. ఈ సంవత్సరం 9,630మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443మంది, 2028లో 7,213మంది పదవీ విరమణ చేయనున్నారు. 2024 మార్చి 31న, ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి రిటైర్‌ అవుతున్నవారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు. వీరందరి బిల్లులు క్లియర్‌ చేయాలంటే రూ.5000 కోట్ల వరకు అవసరమని అంచనా వేస్తున్నారు.


కమీషన్లు ఇచ్చేవారికే చెల్లింపులు!

కమీషన్లు ఇచ్చినవారి, పైరవీలు చేసుకునేవారి బిల్లులను మాత్రం చెల్లిస్తున్నారని, పైరవీలు చేయనివారివి పెండింగ్‌లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ రిటైర్డు ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియరెన్స్‌ కోసం ఆర్థిక శాఖలో రూ.50 వేలు సమర్పించుకున్నాడని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ నాయకుడు తెలిపారు. కొంతమంది బిల్లు మొత్తం సొమ్ములో 6-10 శాతం వరకు కమీషన్లను ముట్టజెప్పాల్సి వస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా డీడీవోలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీల నుంచి టోకెన్లు జనరేట్‌ అవుతున్నాయి. ఈ టోకెన్ల సీరియల్‌ నంబర్లవారీగా బిల్లులను పరిష్కరించాలి. కానీ, పైరవీలు చేసుకునేవారు, కమీషన్లు ఇచ్చేవారి బిల్లులు చివర ఉన్నా క్లియర్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రిటైరైన ఉద్యోగుల బిల్లులపై దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నారు.


కష్టార్జీతం చేతికందడం లేదు

నాకు గ్రాట్యుటీ, జీపీఎఫ్‌, ఆర్జిత సెలవులు తదితర రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.60 లక్షలకు పైగా డబ్బు రావాల్సి ఉంది. రిటైర్మెంట్‌ తర్వాత ప్రశాంత జీవనం గడుపుదామంటే.. నా కష్టార్జితం చేతికందక ఇబ్బందులు పడుతున్నా.

-షేక్‌ జహూర్‌, రిటైర్డ్‌ టీచర్‌, హనుమకొండ

97.15 లక్షలు రావాల్సి ఉంది

మెదక్‌ జిల్లాలో బీసీ హాస్టల్‌ వార్డెన్‌గా పని చేసి, 2024 జూలైలో పదవీ విరమణ చేశా. నాకు మొత్తం రూ.97,15,000 వరకు రావాల్సి ఉంది. బిల్లులు సమర్పించినా ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. డబ్బు వస్తే.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చని ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నా.

- మనోహర్‌, రిటైర్డ్‌ హాస్టల్‌ వార్డెన్‌, మెదక్‌

బిడ్డ పెళ్లికి ఉపయోగపడట్లేదు

సిద్దిపేట జిల్లాలో టీచర్‌గా పని చేసి, 2024 జూన్‌ 30న రిటైరయ్యాను. రూ.40 లక్షల వరకు రావాల్సి ఉంది. సర్వీసు పెన్షన్‌ మాత్రం వస్తోంది. రిటైర్మెంట్‌ తర్వాత బిడ్డ పెళ్లి చేయాలనుకున్నా. సర్కారు సొమ్ము ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నా.

- రవీందర్‌, రిటైర్డ్‌ హెచ్‌ఎం, సిద్దిపేట


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

టీమిండియాకు కొత్త కెప్టెన్.. చేజేతులా చేసుకున్న సూర్య

ఇంత పొగరు అవసరమా హార్దిక్.. ఆల్‌రౌండర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 04:07 AM