Share News

BV Pattabhiram: బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:07 AM

ప్రముఖ ఇంద్రజాలికుడు, అంతర్జాతీయంగా పేరు పొందిన హిప్నాటిస్టు, మానసిక వైద్యుడు, ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సుపరిచితుడైన బీవీ పట్టాభిరామ్‌(75) కన్నుమూశారు.

BV Pattabhiram: బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత

  • గుండెపోటుతో మృతి

  • వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్ట్‌, కౌన్సెలర్‌గా అంతర్జాతీయ గుర్తింపు

  • 57కు పైగా వ్యక్తిత్వ వికాస రచనలు

  • హిప్నాటిజంపై తొలిసారిగా పీహెచ్‌డీ

  • సీఎంలు రేవంత్‌, చంద్రబాబు సహా పలువురు ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌ సిటీ/పంజాగుట్ట, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఇంద్రజాలికుడు, అంతర్జాతీయంగా పేరు పొందిన హిప్నాటిస్టు, మానసిక వైద్యుడు, ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సుపరిచితుడైన బీవీ పట్టాభిరామ్‌(75) కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు భావరాజు వేంకట పట్టాభిరామ్‌. సోమవారం రాత్రి ఖైరతాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టాభిరామ్‌ భార్య జయ కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. వీరి కుమారుడు ప్రశాంత్‌ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. పట్టాభిరామ్‌ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని శీల గ్రామం. 1950 ఫిబ్రవరి 12న భావరాజు సత్యనారాయణ, వెంకాయమ్మ దంపతులకు పట్టాభిరామ్‌ జన్మించారు. వీరికి మొత్తం 15 మంది సంతా నం కాగా.. పట్టాభిరామ్‌ ఎనిమిదో వారు. తండ్రి సత్యనారాయణ ఇంజనీర్‌గా అందించిన సేవలకుగాను బ్రిటిష్‌ ప్రభుత్వం రావ్‌ సాహెబ్‌ బిరుదుతో సత్కరించింది. ఉద్యోగరీత్యా సత్యనారాయణకు బదిలీలు కావడంతో పట్టాభిరామ్‌ నెల్లూరు, హైదరాబా ద్‌, కర్నూలు, కాకినాడ తదితర ప్రాంతాల్లో విద్యను అభ్యసించారు. పట్టాభిరామ్‌ చిన్నతనంలో చందమామ సంచికల్లో ఇంద్రజాలంపైపీసీ సర్కార్‌ రాసే కథనాలు చదివి స్ఫూర్తి పొందారు. అమీర్‌పేట ప్ర భుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో ఒకరోజు కోఠి కబూతర్‌ఖానా దగ్గర సైఫుద్దీన్‌ అనే ఇంద్రజాలికుడి ప్రదర్శన చూసి, ఆ విద్యపై ఆసక్తి పెంచుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న రోజుల్లో ఎంబేర్‌ రావు దగ్గర ఇంద్రజాలం నేర్చుకున్నారు. డిగ్రీ అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో టైపిస్టుగా చేస్తూనే, ఇంద్రజాల ప్రదర్శనలు ప్రారంభించారు.ఎఫ్‌సీఐలో క్లర్కుగా కూడా పనిచేశారు. 1984లో రవీంద్రభారతి నుంచి చార్మినార్‌కు అక్కడి నుంచి రవీంద్రభారతికి కళ్లకు గంతలు కట్టుకొని స్కూటరు నడిపి పట్టాభిరామ్‌ సంచలనం సృష్టించారు. ఇంద్రజాల విద్య ద్వారా బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి తెలుగునాట కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. మ్యాజిక్‌ స్కూలు ద్వారా పిల్లలకు పట్టాభిరామ్‌ ఇంద్రజాల విద్యను నేర్పిస్తున్న సమయంలో రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు సలహాతో హిప్నాటిజం తరగతులు ప్రారంభించారు. తద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ మనస్తత్వ నిపుణుడిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ సైకాలజీ చదివారు. 1992లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. హిప్నాటిజంపై తొలి పీహెచ్‌డీ పట్టాభిరామ్‌దే కావడం విశేషం.


నేడు అంత్యక్రియలు

పట్టాభిరామ్‌ కుమారుడు ప్రశాంత్‌ 15 రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి, సోమవారం తెల్లవారు జామునే అమెరికా తిరిగి వెళ్లారు. రాత్రికి తండ్రి మరణవార్త తెలియడంతో ఆయన తిరుగుప్రయాణమయ్యారు. పట్టాభిరామ్‌ భౌతిక కాయాన్ని బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన స్వగృహంలో ఉంచుతారు. తర్వాత జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టాభిరామ్‌ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పట్టాభిరామ్‌ మృతి పట్ల ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. సీనియర్‌ జర్నలిస్టులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్‌, ఎమెస్కో విజయకుమార్‌, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు యాకూబ్‌, విజయవాడ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు మనోహర్‌ నాయుడు తదితరులు పట్టాభిరామ్‌ సేవలను గుర్తుచేసుకున్నారు.


రచనలు సంచలనం..

తెలుగు పాఠక లోకంలో పట్టాభిరామ్‌ వ్యక్తిత్వ వికాస రచనలకు విశేష ఆదరణ ఉండేది. ‘మైండ్‌ మ్యాజిక్‌’తో మొదలుపెట్టి ‘మాస్టర్‌ మైండ్‌’, ‘జ్ఞాపకశక్తి- ఏకాగ్రత’, ‘మాటే మంత్రం’, ‘పాజిటివ్‌ థింకింగ్‌’, ‘జీనియస్‌ మీరు కూడా’ వంటి 57కు పైగా పుస్తకాలు రాశారు. వాటన్నింటినీ ఎమెస్కో ప్రచురించింది. కొద్ది నెలల కిందట ఆయన ఆత్మకథ ‘జీవితం ఒక ఉత్సవం- నా బతుకు కథ’ విడుదలైంది. పత్రిక, టెలివిజన్‌, యూట్యాబ్‌ మాధ్యమాల ద్వారానేగాక కళాశాలలు, కార్పొరేట్‌, ప్రభుత్వరంగ కార్యాలయాల్లో కొన్ని వందల వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలీసులు సైతం పట్టాభిరామ్‌ దగ్గర కౌన్సెలింగ్‌ కిటుకులు నేర్చుకొని నేరస్థులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ తనకు గురువు అని పలు ఇంటర్వ్యూల్లో పట్టాభిరామ్‌ చెప్పారు. చిన్నవయసులో తలెత్తిన ప్రమాదం వల్ల పట్టాభిరామ్‌ కా లికి శస్త్రచికిత్స చేశారు. తన తండ్రి సత్యనారాయ ణ ఇచ్చిన స్థైర్యమే తనను ఈ స్థాయికి ఎదిగేలా చేసిందని పలు సందర్భాల్లో ఆయన తెలిపారు.


ఇవి కూడా చదవండి:

ఉగ్రవాదులు అరెస్ట్.. ఉలిక్కిపడ్డ రాష్ట్రం

వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి వార్నింగ్

బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం తాపత్రయపడుతోంది: సీఎం రేవంత్ రెడ్డి..

For More Telangana News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 04:07 AM