Alakananda Hospital: అలకనంద కిడ్నీ రాకెట్ కేసు.. 7 నెలల్లో 20 ఆపరేషన్లు
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:34 AM
సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో వెలుగుచూసిన కిడ్నీరాకెట్ తతంగాలను తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్నాయని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు వివరించారు.
ఏ-1గా డాక్టర్ అవినాశ్, ఏ-2గా సుమంత్
రూ. 12 కోట్లు వెనకేసుకున్న ముఠా సభ్యులు
ఒక్కో మూత్రపిండానికి రూ.60 లక్షల వసూలు
అందులో కిడ్నీదాతకు 5 లక్షలే.. డాక్టర్‌కు 10 లక్షలు
9 మంది అరెస్టు.. పరారీలోనే కీలక వైద్యులు
హైదరాబాద్ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో వెలుగుచూసిన కిడ్నీరాకెట్ తతంగాలను తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్నాయని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేయగా.. నిందితులైన ఇద్దరు ప్రధాన వైద్యులు, కీలక పాత్ర పోషించిన నలుగురు వ్యక్తుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. అలకనంద ఆస్పత్రిలో గడిచిన ఏడు నెలల్లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు 20 జరిగాయని, అంతకు ముందు సైదాబాద్‌లోని జననీ ఆస్పత్రి ఈ దందాకు అడ్డాగా ఉండేదని వెల్లడించారు. ఈ ముఠా కిడ్నీమార్పిడికి రూ.60 లక్షల దాకా వసూలు చేసేదన్నారు. శనివారం సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన అవినాశ్ చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్నాడు. పుణెలో డిప్లొమా ఇన్ సర్జరీ పూర్తిచేసి, అక్కడే పనిచేవాడు. 2022లో హైదరాబాద్‌కు వచ్చి.. సైదాబాద్ మాదన్నపేటలో జననీ ఆస్పత్రిని స్థాపించాడు. లాభాలు లేకపోవడంతో మూసివేయాలని నిర్ణయించాడు.
ఈ క్రమంలో ఏపీలోని వైజాగ్‌కు చెందిన లక్ష్మణ్ ఇతనికి పరిచయమయ్యాడు. ఆపరేషన్ థియేటర్‌ను అద్దెకిస్తే.. ఒక్కో కిడ్నీ మార్పిడి సర్జరీకి రూ.2.5 లక్షలు ఇస్తానంటూ ఆఫరిచ్చాడు. దానికి అవినాశ్ ఒప్పుకోవడంతో.. 2023 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు అక్కడ నిరాటంకంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. లక్ష్మణ్ స్నేహితుడు పవన్ అలియాస్ లియోన్, అతని అనుచరుడు పూర్ణ అలియాస్ అభిషేక్ కిడ్నీ మార్పిడి సర్జరీ వ్యవహారాలను చూసుకునేవారు. నెఫ్రాలజిస్టు అయిన పవన్.. తన వద్దకు వచ్చే కిడ్నీ రోగుల్లో ధనికులు, రూ.లక్షలు ఖర్చు పెట్టగలిగేవారిని గుర్తించి, మూత్రపిండాల మార్పిడి వివరాలు చెప్పేవాడు. వీరంతా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకుని, ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీలు దానం చేయడానికి సిద్ధపడేవారిని సంప్రదించేవారు.
కిడ్నీలు అవసరమైన వారి నుంచి రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షలు వసూలు చేసేవారు. దాతలకు రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షలు ఇచ్చేవారు. పవన్ సూచనల మేరకు యూరాలజిస్టులు-- తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్, జమ్మూకశ్మీర్‌కు చెందిన డాక్టర్ షోహిబ్‌ను హైదరాబాద్‌కు రప్పించి, సర్జరీలు చేయించేవారు. వారికి ఒక్కో సర్జరీకి రూ.10 లక్షల వరకు, ఆపరేషన్ థియేటర్ టీమ్‌కు రూ.30 వేలు ఇచ్చేవాడు. ఆపరేషన్ థియేటర్ అద్దె రూ.2.5 లక్షలు పోను.. మిగతాదాన్ని లక్ష్మణ్, పవన్ టీమ్, ఏజెంట్లు పంచుకునేవారు. అయితే.. గత ఏడాది జూన్‌లో ఆ ఆస్పత్రిని అవినాశ్ మూసివేయడంతో.. దందాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
అలకనందకు మారిందిలా..
కజకిస్థాన్‌లో వైద్యవిద్యను అభ్యసించిన డాక్టర్ గుంటుపల్లి సుమంత్.. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి అలకనంద ఆస్పత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జననీ ఆస్పత్రిని మూసివేశాక.. అవినాశ్.. సుమంత్‌ను కలిశాడు. కిడ్నీ ఆపరేషన్ల గురించి చెప్పి.. ఒక్కో సర్జరీకి రూ.2.5 లక్షలు వస్తాయని, అలకనంద ఆపరేషన్ థియేటర్‌ను అద్దెకిస్తే.. తాను రూ.1.5 లక్షలు అందేలా చేస్తానని, తాను రూ.లక్ష తీసుకుంటానని చెప్పాడు. దీంతో సుమంత్ ఒప్పుకొన్నాడు. దాంతో.. గడిచిన ఏడు నెలల్లో 20 మూతపిండాల మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించారు. కిడ్నీరాకెట్ ఈ 20 సర్జరీల ద్వారా రూ.12 కోట్లు వెనకేసుకుందని రాచకొండ సీపీ తెలిపారు. ఈ కేసులో అవినీశ్, సుమంత్, కర్ణాటకకు చెందిన ఆర్గనైజర్లు పొన్నుస్వామి ప్రదీప్, సూరజ్ మిశ్రా, మెడికల్ బృందానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. రాజశేఖర్, షోహిబ్, కీలక సూత్రధాలులు పవన్, పూర్ణ అలియాస్ అభిషేక్, లక్ష్మణ్, శంకర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఎస్‌వోటీ, సరూర్‌నగర్ పోలీసులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి