Ponguleti: రప్పా రప్పా.. ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడతామా?
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:52 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు ‘రప్పారప్పా‘ ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడే వారు ఎవరూ లేరని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
‘కాళేశ్వరం’ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హరీశ్ సభలో ఫ్లెక్సీలు
బనకచర్ల పాపం బీఆర్‌ఎస్‌దే 2016లోనే ఆ ప్రాజెక్టుకు జీవో
కేసీఆర్ మొక్కులు తీరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆగస్టు కల్లా ‘భూభారతి’ అర్జీలకు పరిష్కారం: మంత్రి పొంగులేటి
నకిరేకల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి హరీశ్‌రావు ‘రప్పారప్పా‘ ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడే వారు ఎవరూ లేరని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన పాపాలు బయటపడుతుండటంతో ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బనకచర్ల ప్రాజెక్టుపై హరీశ్‌రావు రప్పా.రప్పా.. ఫ్లెక్సీలతో షో చేశారని ఎద్దేవా చేశారు. బనకచర్ల పాపం బీఆర్‌ఎ్‌సదేనని, ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని పొంగులేటి గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నియోజకవర్గానికి చెందిన 3,500 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆదివారం ఇంటి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి పలువురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన పాపాలు బయటపడుతుండటంతో ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా బనకచర్ల ప్రాజెక్టుపై హరీశ్‌రావు రప్పా...రప్పా.. ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడే వారెవరూ లేరన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే కమీషన్లు రావనే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కట్టారని పొంగులేటి ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ప్రచారం ఆర్భాటంతో సరిపెట్టిన బీఆర్‌ఎస్ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని పొంగులేటి పేర్కొన్నారు. తొలి విడతగా 4.50లక్షల ఇళ్లను మంజూరు చేశామని వచ్చే నాలుగేళ్లలో 16లక్షల మందికి ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇక, సీఎం హోదాలో కేసీఆర్ చేసిన మొక్కులను సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు చెల్లిస్తున్నారని పొంగులేటి చమత్కరించారు. భద్రాచల దేవస్థానం అభివృద్దికి రూ.100 కోట్లు కేటాయిస్తాని మాట ఇచ్చిన కేసీఆర్ రూ.100 కూడా ఇవ్వలేదన్నారు. కానీ, దేవస్థానం అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే రూ.80 కోట్ల మేర నిధులు విడుదల చేశారని చెప్పారు. కాగా, భూ భారతి ద్వారా వచ్చిన 8.60లక్షల అర్జీల్లో న్యాయపరమైన చిక్కుల్లేని వాటిని వచ్చే ఆగస్టు నాటికి పరిష్కరించి రైతులకు స్వాతంత్య్రం కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గం రాజకీయ నాయకుల ఉత్పత్తి కేంద్రంగా మారిందన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఈ సభలో పాల్గొన్నారు.
‘రప్పా రప్పా’ డైలాగ్‌లు రాజకీయాల్లో చెల్లవ్..
ఇది ప్రజాస్వామ్యం.. రాచరికం కాదు: మల్లు రవి
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): సినిమా డైలాగ్‌లు వినడానికే బాగుంటాయి.. కానీ రాజకీయాల్లో చెల్లవని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు ‘రప్పా.. రప్పా, 2028లో రప్పా.. రప్పా లోడింగ్ 3.0’ ప్లకార్డులు ప్రదర్శించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆదివారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాజుల కాలంలో రప్పా రప్పా ఆడించేది ఉండేదన్నారు. ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్యమని.. ఇక్కడ రప్పా రప్పా అంటే చెల్లదని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షలకు ప్రజాస్వామ్యంలో తావు లేదన్నారు. బీఆర్‌ఎస్ పరిస్థితి ఏంటో స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ వంటి పార్టీలకు కాంగ్రెస్ భయపడబోదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..