Share News

Phone tapping : మీ ఫోన్‌ ట్యాప్‌ అయింది..

ABN , Publish Date - Jan 29 , 2025 | 03:55 AM

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త పరిణామం..! పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలతో పాటు త్రిపుర గవర్నర్‌ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయిన వ్యవహారంలో పోలీసులు మరో అడుగు

Phone tapping : మీ ఫోన్‌ ట్యాప్‌ అయింది..
Phone Tapping Case

  • ఎవరెవరితో మాట్లాడారు?..

  • ఎవరిమీదనైనా అనుమానం ఉందా?

  • 350 మందికి త్వరలో నోటీసులు..

  • వాంగ్మూలాలకు పోలీసుల కసరత్తు

  • ట్యాపింగ్‌ కేసులో కొత్త పరిణామం..

  • తిరుపతన్నకు బెయిల్‌తో అప్రమత్తం

  • ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ యోచనలో ప్రభాకర్‌రావు!

హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త పరిణామం..! పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలతో పాటు త్రిపుర గవర్నర్‌ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయిన వ్యవహారంలో పోలీసులు మరో అడుగు వేయబోతున్నారు. ఈ కేసులో వాంగ్మూలాల స్వీకరణకు దాదాపు 350 మంది బాధితులకు నోటీసులు జారీ చేయడానికి సన్నద్ధం అయ్యారు. వారినుంచి స్టేట్‌మెంట్‌ రికార్డుకు కసరత్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మీ ఫోన్‌ ట్యాపింగ్‌ అయిన విషయం మీకు తెలుసా? ఆ రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు? ఎవరిమీదైనా అనుమానం ఉందా..? అని అడగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్నప్పుడే త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రాసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర నాయకులతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నారు. ఆయన గవర్నర్‌గా వెళ్లాక.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 2023 నవంబరులో 15 రోజలు పాటు ఇది కొనసాగింది. అందుకే ఇటీవల ఇంద్రసేనారెడ్డి పీఏ నర్సింహ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 4 వేలకు పైగా ఫోన్లను ఎస్‌ఐబీ అప్పటి చీఫ్‌ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని బృందం ట్యాప్‌ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. వీరిలో చాలామంది కాంగ్రెస్‌, బీజేపీ నాయకులతో పాటు అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ నాయకులున్నారు. పోలీసు అధికారి తిరుపతన్నకు సుప్రీంకోర్టులో బెయిల్‌ రావడంతో మిగతావారికి కూడా త్వరలోనే బెయిల్‌ మంజూరయ్యే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

దీంతో మరింతగా కేసు మూలాల్లోకి వెళ్లడమే కాకుండా నిందితుల నేరాన్ని నిరూపించే సాక్ష్యాధారాల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. కీలక సాక్ష్యాధారాలైన హార్డ్‌ డిస్క్‌లను డీఎస్పీ ప్రణీత్‌రావు ధ్వంసం చేయడంతో సర్వీసు ప్రొవైడర్ల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సర్వీసు ప్రొవైడర్లు ఎయిర్‌టెల్‌, జియో, వీఐ, బీఎ్‌సఎన్‌ఎల్‌కు లేఖలు రాశాయి. కాగా, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును అమెరికా నుంచి రప్పించడానికి పోలీసు ఉన్నతాధికారులు చట్టపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేంద్రం నుంచి అమెరికాకు లెటర్‌ ఆఫ్‌ రొగేటరీ పంపించడం ద్వారా ప్రభాకర్‌రావు, అక్కడే ఉన్న మరో నిందితుడు శ్రవణ్‌రావును రప్పించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం వ్యక్తిగతంగానూ కేంద్ర హోం శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, తిరుపతన్నకు బెయిల్‌ రావడంతో ప్రభాకర్‌రావు సైతం ముందస్తు బెయిల్‌కు పిటిషన్‌ దాఖలుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికిముందే ఆయనను రప్పించగలిగితే అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభాకర్‌రావు మాజీ పోలీసు అధికారి కావడంతో.. శాఖ ఏమేం చర్యలు తీసుకోవచ్చు..? దర్యాప్తులో ఏయే అడుగులు ఎలా వేయొచ్చు? అని ఊహించి అందుకుతగ్గట్లు పావులు కదుపుతున్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం

Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 07:49 AM