Nalgonda: అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య!
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:26 AM
అమెరికాలో ఉన్నత చదువు పూర్తిచేసుకున్న కుమారుడు, త్వరలో మంచి కొలువు సాధించి, కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు దిగ్ర్భాంతికరమైన వార్త చెవినపడింది!
ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా దుండగుల కాల్పులు.. కారు, డబ్బులు ఇవ్వాలని ఘాతుకం
మృతుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసి
ఉన్నత చదువులకు వాషింగ్టన్‌కు
మార్చిలో ఉదోగ్యం వస్తుందనగా ఘోరం
తండ్రి క్యాబ్ డ్రైవర్.. భూమినంతా అమ్మేసి ఇద్దరు పిల్లల్ని అమెరికాకు పంపిన వైనం
నల్లగొండ, ఎల్బీనగర్, హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్నత చదువు పూర్తిచేసుకున్న కుమారుడు, త్వరలో మంచి కొలువు సాధించి, కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు దిగ్ర్భాంతికరమైన వార్త చెవినపడింది! తమ కుమారుడు ఇక లేడని తెలియడంతో కంటికిమంటికీ ధారగా రోదిస్తున్నారు. మృతు డు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రవితేజ (27). తల్లిదండ్రులు సువర్ణ-చంద్రమౌళి గౌడ్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చంద్రమౌళి కుటుంబం నల్లగొండ తిరుమలనగర్ కాలనీలో స్థిరపడింది. ఐదేళ్ల క్రితం చంద్రమౌళి, జీవనోపాధి కోసంతన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని చైతన్యపురికొచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు రవితేజతో పాటు కూతురు ఉంది. రవితేజ హైదరాబాద్‌లో బీటెక్ చేశాడు. క్యాబ్ డ్రైవర్‌గా తనకొచ్చే సంపాదన సరిపోకపోవడంతో చంద్రమౌళి తనకున్న భూమినంతా విక్రయిం చి కుమారుడిని 2022లో, కుమార్తెను2023లో ఎంఎస్ చదివేందుకు అమెరికా పంపాడు. రవితేజ అక్కడ మాస్టర్స్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.
తాత్కాలికంగా ఓ చైనీస్ రెస్టారెంట్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగం గా భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కారులో ఓ కస్టమర్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు దుండగులు రవితేజపై కాల్పులు జరిపి, ఆయన కారును అపహరించుకుపోయారు. ఇక్కడ తెల్లవారుజామునే లేచి ఉదయం నడకలో ఉన్న రవితేజ తండ్రి చంద్రమౌళికి అమెరికాలోని సమీపబంధువు నుంచి ఫోనొచ్చింది. అమెరికాలో దుండగుల కాల్పులకు రవితేజ చేతులకు బుల్లెట్ గాయాలయ్యాయని, ఎలాంటి ప్రమాదం లేదని ఆయన చెప్పాడు. ఇది విని.. చంద్రమౌళి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అమెరికాలోనే ఉన్న కుమార్తెకు ఫోన్ చేసి వివరాలు అడిగాడు. అన్నయ్యకు ఏమీ కాలేదని, తాను అక్కడికే వెళ్తున్నానంటూ చెప్పి తండ్రిని ఓదార్చేప్రయత్నం చేసినా, కొద్దిసేపటికే జరిగిన ఘోరం ఆయనకు తెలిసిపోయింది. మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహ కరించాలని చంద్రమౌళితో పాటు ఆయన సమీప బంధువులు కోరారు. సోమవారం ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రవితేజ మృతదేహం తరలింపు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రవితేజ మృతదేహం తరలింపునకు, ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు స్నేహితులు నిధులు సేకరిస్తున్నారు.
బండి సంజయ్ పరామర్శ
రవితేజ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.