Kavitha: ఆడబిడ్డలకు తులం బంగారంపై నిప్పులు చెరిగిన కవిత..
ABN , Publish Date - Oct 25 , 2025 | 07:00 PM
తన్నలకి ఎకరాకి రూ.50వేల పరిహారం, ఆడబిడ్డలకు తులం బంగారం, పింఛన్ల పెంపు ఎప్పుడిస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
యంచ, (నిజామాబాద్) అక్టోబర్ 25: రైతన్నలకి ఎకరాకి రూ.50వేల పరిహారం, ఆడబిడ్డలకు తులం బంగారం, పింఛన్ల పెంపు ఎప్పుడిస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇవాళ(శనివారం) నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచ గ్రామంలో 'జాగృతి జనం బాట' కార్యక్రమాన్ని కవిత ప్రారంభించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోదావరి పరివాహక ప్రాంతంలో పంటలు నీట మునిగాయని ఆమె ఆరోపించారు.
తెలంగాణలోని 9 గ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందన్న కవిత.. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి నీటిని విడుదల చేసి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదన్నారు. అధికారులు, మంత్రులు చేసిన పాపం రైతులకు శాపంగా మారిందని ఆమె వాపోయారు. రైతులకు యూరియా సైతం అందించలేని అసమర్థ ప్రభుత్వమిదని, బోనస్, మద్దతు ధర ఇవ్వకుండా రైతులను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నిజామాబాద్ జిల్లా నా మెట్టినిల్లు... ఎంపీగా ఎమ్మెల్సీగా నాకు పట్టం కట్టి నా రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిన జిల్లా. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచే 'జాగృతి జనం బాట' ను ప్రారంభించడం సముచితంగా భావించాను. అంతే ఉత్సాహంతో నన్ను స్వాగతించి అక్కున చేర్చుకున్న నిజామాబాద్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను'అని కవిత చెప్పుకొచ్చారు. అంతేకాదు, నిజామాబాద్ లో తన ఓటమికి కుట్ర జరిగిందని కూడా కవిత ఈ సందర్భంగా వెల్లడించారు. 'జాగృతి జనం బాట' కార్యక్రమంలో భాగంగా తాను 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నట్లు కవిత ప్రకటించారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లో మరో మారు పంట నష్టంపై సర్వే నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 'ఎకరానికి రూ.50 వేల పరిహారం రైతులకు అందించాలి. వరద ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సందర్శించి నష్టాన్ని అంచనా వేయించాలి. రైతుల సమస్యలను రాజకీయంగా చూడకుండా.. ఆదుకునేందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంత్రి తుమ్మల కృషి చేయాలి. ఆడబిడ్డలకు తులం బంగారం, పింఛన్ల పెంపు ఎప్పుడు ఇస్తారు?. రైతుల పక్షాన మాజీ ఎమ్మెల్యే షకీల్ పోరాటం చేయాలి' అని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని ఈ సందర్భంగా కవిత అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా, అవసరమైతే పార్టీ పెడతానంటూ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి