Share News

ఐదుసార్లు తప్పించుకొని.. ఆరోసారి బలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:56 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవ వరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..

ఐదుసార్లు తప్పించుకొని.. ఆరోసారి బలి

  • సర్వేయర్‌ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

  • భర్త తేజేశ్వర్‌ బైక్‌కు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చిన ఐశ్వర్య

  • దాని ఆధారంగా అతడి లొకేషన్‌ వివరాలు సుపారీ ముఠాకు!

  • ఇప్పటికే పోలీసుల అదుపులో ఎనిమిది మంది నిందితులు?

  • మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

కర్నూలు క్రైం/గద్వాల క్రైం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవ వరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రియుడిపై మోజుతో తన భర్త తేజేశ్వర్‌ను చంపడానికి సిద్ధమైన ఐశ్వర్య.. అతడి బైకుకు జీపీఎస్‌ ట్రాకర్‌ను ఏర్పాటు చేసినట్లు, దాని ఆధారంగానే అతడి లొకేషన్‌ వివరాలను సుపారీ ముఠాకు అందజేసినట్టు తెలిసింది. అంతేకాదు.. పెళ్లయిన నెల రోజుల వ్యవధిలో ఐదుసార్లు వారి హత్యాయత్నాల నుంచి తప్పించుకున్న తేజేశ్వర్‌ ఆరోసారి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని గంటవీధి కాలనీకి చెందిన ప్రైవేటు సర్వేయర్‌ తేజేశ్వర్‌కు (32) కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన ఐశ్వర్యతో మే 18న వివాహం జరిగింది. అయితే.. అప్పటికే ఆమెకు కర్నూలులో తన తల్లి పనిచేసే బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తిరుమలరావుతో సంబంధం ఉంది. అతడు వివాహితుడు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడని.. అప్పుడు అతడి భార్య తీవ్రంగా గొడవ పెట్టుకుందని సమాచారం. ‘‘మనకు పిల్లలు లేరు కదా ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటా’’నని అతడు ఒత్తిడి తెచ్చినా ఆమె ససేమిరా అనడంతో ఐశ్వర్యను తిరిగి వెనక్కి పంపేశాడు.


ఆ తర్వాత కూడా వారి మధ్య సంబంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఐశ్వరయ్యకు తేజేశ్వర్‌తో నిశ్చితార్థం జరిగి రద్దు అయింది. కానీ ఆమె తన ప్రియుడు తిరుమలరావుతో పాటు తేజేశ్వర్‌తో కూడా వాట్సాప్‌ చాట్‌ చేస్తూ ప్రేమాయణాన్ని కొనసాగించినట్టు తెలుస్తోంది. ఐశ్వర్య మాటలను నమ్మిన తేజేశ్వర్‌.. పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఐశ్వర్య నిత్యం బ్యాంకు మేనేజర్‌తో చాటింగ్‌ కొనసాగించిందని.. ‘‘ఎలాగైనా తేజేశ్వర్‌ను వదిలించుకుని నీ దగ్గరకు వచ్చేస్తా’’ అని బ్యాంక్‌ మేనేజర్‌ను ప్రాధేయపడిందని సమాచారం. దీంతో అతడు తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు కొంత మందికి రూ.75 వేల సుపారీ ఇచ్చాడు. అతడి వద్ద డబ్బు తీసుకున్నవారిలో ప్రధాన నిందితుడైన మనోజ్‌ అనే వ్యక్తి.. తేజేశ్వర్‌ సర్వేయర్‌ కావడంతో సర్వే పేరుతో అతణ్ని బయటకు తీసుకెళ్లాడు. ముందుగా జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని ఎరవలి చౌరస్తా, పెబ్బేరు తదితర ప్రాంతాల్లో తిప్పాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు.. పెబ్బేరు సమీపంలో అతణ్ని హత్య చేశారు.


తేజేశ్వర్‌ ముందు సీటులో కూర్చుని ఉండగా.. వెనుక ఉన్న మనోజ్‌ కత్తితో తేజేశ్వర్‌ గొంతు కోసి చంపేశాడు. ముందురోజే అతడు తన కారు అద్దాలన్నింటికీ బ్లాక్‌ ఫిల్మ్‌ వేయించుకోవడంతో.. కారులో ఏం జరుగుతుందో బయట ఎవరూ గుర్తించలేకపోయారు. తేజేశ్వర్‌ చనిపోయాక అతడి మృతదేహాన్ని ఎక్కడ పడేయాలా అని ఆలోచించారు. సమీపంలో పడేస్తే తెలిసిపోతుందని కర్నూలు వైపు వచ్చారు. కర్నూలు టోల్‌ ప్లాజా దాటిన తర్వాత పూడిచర్ల వైపు మొదట మృతదేహాన్ని పడవేద్దామనుకున్నారు. అయితే గ్రామ సమీపంలో ఉండటంతో వెంటనే గుర్తిస్తారని భావించి తమ్మరాజుపల్లె ఘాట్‌ వైపు వెళ్లారు. అక్కడ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుకూలంగా లేకపోవడంతో పాణ్యం సమీపంలో పిన్నాపురం క్రాస్‌ రోడ్డు వద్ద గాలేరి నగరి కాల్వ మీదుగా వెళ్లి అక్కడ మృతదేహాన్ని పడేశారు. ఆ మరుసటి రోజు గద్వాల పోలీసులు కేసు నమోదు చేసి రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఆ తర్వాత పాణ్యం పోలీసులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిర్వహించారు.


పోలీసుల అదుపులో..

ఈ హత్య కేసును చాలెంజింగ్‌గా తీసుకున్న జోగులాంబ గద్వాల్‌ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.. దీన్ని ఛేదించేందుకు జిల్లాలోని పలువురు ఎస్సైలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావు సహా 8 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతడితోపాటు.. మృతుడి భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హత్య చేసిన మనోజ్‌, సహకరించిన ఇద్దరు, కారు డ్రైవర్‌, మధ్యవర్తిత్వం వ్యవహరించిన మరొకరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులెవ్వరినీ వదిలిపెట్టబోమని.. అందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 03:56 AM