Panchayat Elections: మా డబ్బులు ఇచ్చేయండి.. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి కన్నీరు
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:56 PM
తెలంగాణలో తొలి విడత గ్రామ పంచయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ఎన్నికల కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టామని వాపోతున్నారు.
నల్లగొండ, డిసెంబర్ 13: తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కోసం బరిలోకి దిగిన అభ్యర్థులు ఎంతో ఖర్చు పెట్టారు. తమను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ఓటర్లను కోరారు. అంతేకాకుండా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చుపెట్టారు. అయితే ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు జరుగగా.. అదే రోజు ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల్లో గెలుస్తామనే ఆశతో.. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కొందరు అభ్యర్థులు మాత్రం ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.
దీంతో ఓటమిపాలైన అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. చివరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులను తమకు తిరిగి ఇచ్చేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయాడు. దేవుడి ఫోటోతో ఇంటింటికీ తిరుగుతూ తన డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాడు.
జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నికల్లో ఓడిపోయానని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని గ్రామస్తులను కోరుతున్నాడు. అయితే ప్రజలు మాత్రం అతడికే ఓటు వేసినట్లు చెబుతున్నారు. దీంతో ఓట్లు వేశామని చెబుతున్న ఓటర్లను దేవుడిపై ప్రమాణం చేయించుకుంటున్నాడు సదరు సర్పంచ్ అభ్యర్థి.
అందరూ తనకే ఓట్లు వేస్తే ఎలా ఓడిపోయానంటూ ఓటర్లను నిలదీస్తూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఈ ఎన్నికల కోసం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేశానని బాధితుడు వాపోతున్నాడు. మరికొన్ని గ్రామాల్లో కూడా ఓడిపోయిన అభ్యర్థులు ఇలానే తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతామంటూ ఓడిపోయిన అభ్యర్థులు బెదిరిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. వాటిపై ఫోకస్
ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టనున్న రేవంత్, మెస్సీ
Read Latest Telangana News And Telugu News