Chandrayangutta Tragedy: చాంద్రాయణగుట్టలో దారుణం.. 10 ఏళ్ల బాలుడి దారుణ హత్య
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:23 AM
ఓ పిన తండ్రి 10 ఏళ్ల బాలుడ్ని దారుణంగా హత్య చేశాడు. ఇరుగు పొరుగు పిల్లలతో గొడవ పడుతుండటంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్టలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పిన తండ్రి 10 ఏళ్ల బాలుడ్ని దారుణంగా హత్య చేశాడు. ఇరుగు పొరుగు పిల్లలతో గొడవ పడుతుండటంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాలుడి తలను రోడ్డుకు వేసి కొట్టడంతో తలకు తీవ్ర గాయం అయింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళకు పది సంవత్సరాల క్రితం పెళ్లయింది. దంపతులకు ఓ బాలుడు పుట్టాడు. బాలుడికి షేక్ మహ్మద్ అజహర్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఆ మహిళ అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తర్వాత భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం బిడ్డతో కలిసి రెండో భర్త దగ్గరే ఉంటోంది. అయితే, బాలుడు అజహర్ ఇరుగు పొరుగున ఉండే తోటి పిల్లలతో తరచుగా గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఆ గొడవల కారణంగా సవితి తండ్రికి ఇబ్బందులు ఎదురయ్యేవి. ‘మీ పిల్లలను ఇలాగేనా పెంచేది’ అని పొరుగింటి వారు పిన తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది. ఈ నెల 7వ తేదీన కుమారుడిని రోడ్డుకు ఎత్తేసి తల పగులకొట్టాడు. తలకు తీవ్ర గాయం అయింది.
తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలుడు 7వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. డాక్టర్లు బాలుడ్ని బతికించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. అతడి పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇక, సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి పిన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
కెప్టెన్ పని టాస్ వేయడమేనా?.. సూర్య ఫామ్‌పై మాజీ క్రికెటర్ అసహనం