Bihar Workers Attack: దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:37 PM
పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కలిసి వినతి చేశారు బిహార్ కూలీలు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 22: జిల్లాలోని పాలకీడు మండలం దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్యాక్టరీపై, అడ్డుకోబోయిన పోలీసులపై బిహార్ కూలీలు దాడి చేశారు. ఇటీవల కంపెనీలో ఓ బిహార్ కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో అతడి కుబుంబాన్ని ఆదుకోవాలని.. పరిహారం చెల్లించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తోటి కార్మికులు కోరారు. అయితే కార్మికుల విన్నపాన్ని యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ విషయంపై పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కలిసి వినతి చేశారు కూలీలు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో బిహార్ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు (సోమవారం) ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఫ్యాక్టరీపై దాడి చేశారు.. అంతేకాకుండా పరిశ్రమలోని అధికారులపైనా దాడికి పాల్పడ్డారు. ఫ్యాక్టరీ ఆఫీసు అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న బిహార్ కూలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులపై కూడా కార్మికులు దాడి చేశారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి.. వాహనం ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి..
సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా
గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్
Read Latest Telangana News And Telugu News