Hyderabad: వణికించిన మూసీ.. బస్తీలు, కాలనీలు జలమయం.. ఉగ్రరూపం దాల్చిన నది
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:03 PM
మహానగరాన్ని మరోసారి వరణుడు వణికించాడు. మూసీ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నది పక్కనున్న బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం.. జంట జలాశయాల గేట్లు తెరిచారు.
- జంట జలాశయాల నుంచి నీరు విడుదల.. 35 వేల క్యూసెక్కులు వదలడం పదేళ్లలో ఇదే తొలిసారి
- వరద నీటిలో చిక్కుకున్న పలువురు.. కాపాడిన హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసులు
- పునరావాస కేంద్రాలకు 1500 మంది.. మూసీపై పలు బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేత
- ముసారాంబాగ్ నూతన బ్రిడ్జి వద్ద కొట్టుకుపోయిన సెంట్రింగ్
హైదరాబాద్ సిటీ: మహానగరాన్ని మరోసారి వరణుడు వణికించాడు. మూసీ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నది పక్కనున్న బస్తీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం.. జంట జలాశయాల గేట్లు తెరిచారు. దీంతో మూసీలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. మూసీపై పలు బ్రిడ్జిలపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. ముసారాంబాగ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి సెంట్రింగ్ కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో ఏరుల్లా మారిన రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. నగరంలోని బార్కాస్‌లో అత్యధికంగా 61 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మూసీలోకి భారీగా వరద
హిమాయత్‌సాగర్ నీటి నిల్వసామర్థ్యం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.85 అడుగుల మేర నీరు ఉంది. జలాశయంలోకి 23వేల క్యూసెక్కుల నీరువస్తుండగా.. 21,450 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఉస్మాన్‌సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 1790 అడుగులు కాగా.. 1789.15 అడుగులకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 14 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 13,335 క్యూసెక్కులుగా ఉంది. రెండు జలాశయాల నుంచి సుమారు 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. వరద ఉధృతికి నది పక్కనున్న పలు బస్తీలు నీట మునిగాయి.

ముసారాంబాగ్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. దీంతో అంబర్‌పేట, గోల్నాక, మలక్‌పేట, కోఠి, బేగంపేట, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నదిపై ఇక్కడ నూతనంగా నిర్మిస్తోన్న వంతెన సెంట్రింగ్ వరద నీటిలో కొట్టుకుపోయింది. వరద ప్రవాహం పెరగడంతో చాదర్‌ఘాట్ బ్రిడ్జిపైనా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఐటీ కారిడార్‌తోపాటు నగరంలోని అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లకిడీకాపూల్, కోఠి, మలక్‌పేట, చాదర్‌ఘాట్, మెహిదీపట్నం, టోలీచౌకీ, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, మాసబ్‌ట్యాంకు, నాంపల్లి, ఎంజెమార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. నార్సింగ్-మంచిరేవుల మధ్య ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో వరద నీటిలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తడంతో ఆ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. ఆటో ట్రాలీలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా.. వరద నీటిలో చిక్కుకున్నారు.
పునరావాస కేంద్రాలకు తరలింపు
మూసీ వెంట ఉన్న బస్తీలు చాలా వరకు నీట మునిగాయి. రాత్రి వేళ నదిలో వరద ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరింది. చాదర్‌ఘాట్ రసూల్‌పురాలోని ఓ ఇంట్లో ఎనిమిది మంది వరద నీటిలో చిక్కుకున్నారు. హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందం బోటులో వెళ్లి వారిని రక్షించే ప్రయత్నం చేసింది. నది వెంట ఉన్న శంకర్‌నగర్, మూసానగర్, దుర్గానగర్, అంబేడ్కర్ నగర్, కృష్ణానగర్, భూలక్ష్మి దేవాలయం, బండ్లగూడ జాగీర్‌లోని సాయిరాంనగర్, పీఅండ్‌టీ కాలనీలో వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత పారంతాలకు తరలించారు.
అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాలతో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లోని ముంపు బాధితులను సుమారు 1,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి భోజనం, తాగునీరు ఏర్పాట్లు చేయడంతోపాటు దుప్పట్లు అందజేశారు. వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన కర్ణన్ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌లోనూ నీటి మట్టం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం దాటింది. దీంతో సర్‌ప్లస్ నాలా తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ముంపు ప్రాంతం, సురక్షిత ప్రాంతాలకు
తరలించిన పౌరులు
శంకర్‌నగర్ 500
మూసానగర్ 150
అంబేడ్కర్‌నగర్ 200
దుర్గానగర్ 80
కృష్ణానగర్ 32
భూలక్ష్మి ఆలయం 55
ఇతరత్రా ప్రాంతాలు 490
మొత్తం 1500
జలాశయం నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం ఇన్‌ఫ్లో అవుట్‌ఫ్లో
(అడుగుల్లో) (క్యూసెక్కుల్లో)
హిమాయత్‌సాగర్ 1763.50 1762.85 23,000 21,450
ఉస్మాన్‌సాగర్ 1790 1789.15 14,000 13,335
హుస్సేన్‌సాగర్ 513.41 మీటర్లు 513.60 మీటర్లు 2,540 1,590
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News