MP R. Krishnaiah: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను వెంటాడుతాం..
ABN , Publish Date - Nov 29 , 2025 | 10:01 AM
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను వెంటాడుతాం.. అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల్లో జీఓ46ను తీసుకొచ్చి బీసీలను ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- త్వరలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ
- తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: విద్యా, ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య(MP R. Krishnaiah) హెచ్చరించారు. శుక్రవారం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు, యువజన, బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఆర్.కృష్ణయ్య నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఆయన మాట్లాడుతూ..
42శాతం రిజర్వేషన్లపై ప్రతి దశలోనూ సీఎం రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జీఓ46ను తీసుకొచ్చి బీసీలను ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేలా త్వరలో తాము ప్రధాని నరేంద్రమోదీని కలిసి విన్నవిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై త్వరలో పరేడ్‌మైదానంలో లక్షలాది మందితో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.

తద్వారా కాంగ్రెస్ సర్కారును ఎండగడతామన్నారు. అప్పటికీ స్పందించని పక్షంలో ఢిల్లీలోని జంతర్‌మంత్ వద్ద ధర్నా చేస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ అరుణ్‌కుమార్, బీసీ రాష్ట్ర ప్రతినిధులు కొండా దేవన్న, నీలా వెంకటేశ్, భూమన్నగౌడ్, గుజ్జ సత్యం, రాజేందర్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News