Share News

Miss World Contestants: ఐసీయూలో పిల్లలతో.. అందాల భామల ముచ్చట్లు!

ABN , Publish Date - May 17 , 2025 | 03:45 AM

ప్రపంచ సుందరి పోటీల కోసం వచ్చిన అందాల భామలు శుక్రవారంగచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.

Miss World Contestants: ఐసీయూలో పిల్లలతో.. అందాల భామల ముచ్చట్లు!

  • ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను

  • పరామర్శించిన ప్రపంచ సుందరి పోటీదారులు

  • హైదరాబాద్‌ శివార్లలోని ఎకోపార్క్‌ సందర్శన

  • మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి వద్దకూ..

  • బతుకమ్మ ఆడి మొక్కలు నాటిన సుందరీమణులు

ప్రపంచ సుందరి పోటీల కోసం వచ్చిన అందాల భామలు ఎక్స్‌పీరియం పార్క్‌లో సందడి చేశారు. సూర్యాస్తమ య (సన్‌ సెట్‌) పాయింట్‌ వద్ద ప్రారంభమైన వీరి సందర్శన.. బుద్ధ ట్రీ, చెట్లతోనే సహజసిద్ధంగా తీర్చిదిద్దిన కుర్చీలు, జపనీస్‌ గార్డెన్‌ మీదగా సాగింది. పార్క్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకున్నారు. భిన్నమైన మొక్కలు, చెట్లను, తమ సహచర పోటీదారులను కెమెరాల్లో బంధించారు.

హైదరాబాద్‌ సిటీ/ మహబూబ్‌నగర్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరి పోటీల కోసం వచ్చిన అందాల భామలు శుక్రవారంగచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఆస్పత్రిలో పిల్లల ఐసీయూ వార్డును సందర్శించి.. కాలేయ, జీర్ణకోశ తదితర సమస్యలతో బాధపడుతున్న పిల్లలను పలకరించారు. వారి పేరు, చదువు, ఇతర వివరాలు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్వీట్లు, బహుమతులు అందజేశారు. ఆ పిల్లల జబ్బులు, అందుతున్న చికిత్స వివరాలను వైద్యుల నుంచి తెలుసుకున్నారు. అంతకుముందు ఆస్పత్రికి వచ్చిన సుందరీమణులకు ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి బతుకమ్మలను అందించి స్వాగతం పలికారు. వారు ఏఐజీ ఆస్పత్రిలో అత్యాధునిక ఎండోస్కోపీ సౌకర్యాలు, ఇన్నోవేషన్‌ సెంటర్‌, క్లినికల్‌ స్కిల్‌ ల్యాబ్‌, రీసెర్చ్‌ ల్యాబ్‌, ఆధునిక అంకాలజీ, పిల్లల సంరక్షణ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు. రక్తంలో చక్కెర స్థాయులు జన్యుపరమైన అంశాలపైనా ఆధారపడి ఉంటాయని తమ పరిశోధనలో తేలిందని ఆయన తెలిపారు. జీర్ణవ్యవస్థలోని మైక్రోబియం మన మెదడును, గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వివరించారు. ప్రస్తుతం రక్తంలో చక్కెరను ఎప్పటికప్పుడు కొలిచే ప్యాచ్‌లు వచ్చాయని తెలిపారు. ఇక మహిళల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే.. కుటుంబం, సమాజం అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఏఐసీ ఆస్పత్రి వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించడాన్ని సుందరీమణులు ప్రశంసించారు. ఇలాంటి సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు.


పిల్లలమర్రి వద్ద సందడి

12.jpg

ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన పాలమూరులోని పిల్లలమర్రి వద్ద అందాల భామలు శుక్రవారం సాయంత్రం సందడి చేశారు. తొలుత రాజరాజేశ్వర ఆలయంతోపాటు, పురావస్తు నిపుణుడు ఈమని శివనాగిరెడ్డి నిర్వహిస్తున్న మ్యూజియాన్ని సందర్శించారు. తర్వాత పిల్లలమర్రి ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి చెట్టు విశిష్టతను అటవీ అధికారులు వివరించారు. ఆ ప్రాంగణంలో అందాల భామలు బతుకమ్మ ఆడారు. మొక్కలు నాటారు. కూచిపూడి, భరతనాట్యం, బంజారా నృత్యాలను వీక్షించారు. తామూ కాలు కదిపారు. హస్తకళలు, చేనేత స్టాళ్లను సందర్శించారు. పలువురు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. వందల ఏళ్ల నుంచి మర్రిచెట్టును కాపాడుకోవడం గొప్ప విషయమని.. ఈ చరిత్రను ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తామని చెప్పారు. ఇక డీహైడ్రేషన్‌తో మిస్‌ చైనా సుందరి అస్వస్థతకు గురికాగా.. ఓఆర్‌ఎస్‌ నీళ్లు తాగి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. తెలంగాణ పర్యాటకానికి ప్రపంచ సుందరి పోటీదారులే బ్రాండ్‌ అంబాసిడర్లని చెప్పారు. ఇక్కడి పర్యాటక ప్రాంతాలపై ప్రచారం చేయాలని అందాల భామలను కోరారు. పోటీలు ముగిసిన వెంటనే వెళ్లిపోకుండా.. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి చరిత్ర, సంస్కృతిని తమ దేశాల్లో ప్రచారం చేయాలని అందాల పోటీదారులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కోరారు.


ఎకో పార్క్‌లో ఉత్సాహంగా..

12.jpg

ప్రపంచ సుందరి పోటీలో ఉన్న అందాల భామలు.. హైదరాబాద్‌ శివార్లలోని ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను సందర్శించారు. బ్యాటరీ వాహనాల్లో పార్కు మొత్తం కలియదిరిగారు. దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్‌లో ఎన్నో దేశాలకు చెందిన 25వేలకుపైగా రకాల మొక్కలు ఉన్నాయి. వాటిని ఆసక్తిగా పరిశీలించారు. తమ దేశాల మొక్కలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. పార్క్‌లో సమ్మర్‌ క్యాంప్‌లో పాల్గొంటున్న చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. ఈజిప్షియన్‌ రాక్‌ స్పాట్‌ వద్ద నాటు నాటు పాటకు ఉత్సాహంగా కాలు కదిపారు. పార్క్‌ అద్భుతంగా ఉందని కొనియాడారు. భావితరాల భవిష్యత్‌ కోసం ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.

పార్క్‌ సందర్శన సమయంలో పంజాబీ డోలు బృందం లోని ఓ కళాకారుడి అత్యుత్సాహం అవాక్కయ్యేలా చేసింది. డోలు వాయిస్తున్నప్పుడు.. అందాల భామలు ఉత్సాహంగా నృత్యం చేశారు. ఓ కళాకారుడు మిస్‌ వరల్డ్‌ బొలీవియా ఓల్గా ఛావెజ్‌ను తన డోలుపై కూర్చోబెట్టి వాయించాడు. అధికారులు ఆ బృందాన్ని మందలించి, కళాకారులను బయటికి పంపారు.


3 బృందాలుగా.. 3 చోట్లకు..

తెలంగాణలో పర్యాటకానికి మిస్‌ వరల్డ్‌ పోటీలతో ఊపు తీసుకురావాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు వీలుగా అందాల భామల పర్యటనలకు ప్రణాళిక రూపొందించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం.. ప్రపంచ సుందరి పోటీదారులను మూడు బృందాలుగా మూడు ప్రాంతాలకు తీసుకెళ్లారు. రాష్ట్రంలో వైద్య పర్యాటకం, అందుబాటులో మంచి వైద్యం, ఆరోగ్య సంస్కరణలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిని 37 మంది అందాల భామలతో కూడిన ఒక బృందం సందర్శించింది. ఇక మహబూబ్‌నగర్‌లో వందల ఏళ్ల చరిత్ర ఉన్న ‘పిల్లల మర్రి’ వద్ద 22 మందితో కూడిన మరో బృందం పర్యటించి, అక్కడ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంది. 20 మందితో కూడిన మూడో బృందం హైదరాబాద్‌ శివార్లలోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను సందర్శించింది.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:45 AM