Share News

Miss Canada World: చార్మినార్‌కు 400 ఏళ్లా? మా దేశ చరిత్ర కంటే ఎక్కువ

ABN , Publish Date - May 10 , 2025 | 04:10 AM

మిస్‌ కెనడా వరల్డ్‌ కిరీటం గెలుచుకున్న ఆ దేశ తొలి ఆదివాసీ తెగ మహిళ. ఎందరో శ్వేతవర్ణ భామలతో పోటీపడి గెలిచిన భూమిబిడ్డ. కేవలం 1,900 మంది జనాభా ఉన్న గ్రామంలో పుట్టారు. అందాల పోటీలని కాకుండా.. ఈ పోటీల్లోనూ ఒక అర్థం, పరమార్ధం ఉందనే ఆలోచనతో ఆ వైపు మళ్లారు.

Miss Canada World: చార్మినార్‌కు 400 ఏళ్లా? మా దేశ చరిత్ర కంటే ఎక్కువ

  • నా కాళ్లు నిలవడం లేదు.. చార్మినార్‌ చూసి లాడ్‌ బజార్‌లో తిరుగుతా

  • ఇక్కడి బిర్యానీ అద్భుతం..

  • మిస్‌ కెనడా వరల్డ్‌ ఎమ్మా మోరిసన్‌

హైదరాబాద్‌, మే 9, (ఆంధ్రజ్యోతి): మిస్‌ కెనడా వరల్డ్‌ కిరీటం గెలుచుకున్న ఆ దేశ తొలి ఆదివాసీ తెగ మహిళ. ఎందరో శ్వేతవర్ణ భామలతో పోటీపడి గెలిచిన భూమిబిడ్డ. కేవలం 1,900 మంది జనాభా ఉన్న గ్రామంలో పుట్టారు. అందాల పోటీలని కాకుండా.. ఈ పోటీల్లోనూ ఒక అర్థం, పరమార్ధం ఉందనే ఆలోచనతో ఆ వైపు మళ్లారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కెనడా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: హైదరాబాద్‌ ఎలా ఉంది?

ఎమ్మా మోరిసన్‌: అద్భుతంగా ఉంది. కెనడా నుంచి ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. రెండు విమానాలు మారాను. కానీ ఇక్కడికి వచ్చాక.. సొంత ప్రదేశం, సొంతిల్లు వంటి అనుభూతి పొందా. మా తండ్రితో కలిసి ఇక్కడికి వచ్చా. అద్భుత స్వాగతం లభించింది.


అందాల పోటీల్లో పాల్గొనాలనే ఆలోచన ఎలా వచ్చింది?

మాదొక చిన్న గ్రామం. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లడం. చుట్టుపక్కల ఉండే గుట్టలు, కొండలు ఎక్కడం, ఆటలాడడం, చేపలు పట్టడం, సాయంత్రానికి మురికిగా తయారవడమే పని. 2017లో ఒకాయన నన్ను కలిసి.. అందాల పోటీల్లో పాల్గొంటావా? అని అడిగారు. అప్పటికి అందాల పోటీలంటే నాకున్న అభిప్రాయం వేరు. అందుకే కాదని చెప్పాను. తర్వాత అధ్యయనం చేస్తే.. ఈ పోటీలకు అందమొక్కటే కాదు.. అంతః సౌందర్యం, అనేక మందికి సేవ చేసే అవకాశం, మనం ఎంచుకునే ప్రాజెక్టుకు నిధుల సేకరణ వంటివన్నీ ఉంటాయని తెలిసింది. అందాల పోటీలపై ఆసక్తి కలిగింది. మిస్‌ ఒంటారియో, మిస్‌ టీనేజ్‌ కెనడా, మిస్‌ కెనడా వరల్డ్‌ పోటీల్లో గెలిచా.

మీ బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ ప్రాజెక్టు ఏంటి?

మా అమ్మమ్మ నేర్పించినదే నా ప్రాజెక్టు అయింది. అదే ‘రీ కనెక్టింగ్‌ విత్‌ రిబ్బన్‌ స్కర్ట్స్‌’. మా జాతి సంస్కృతికి, సంప్రదాయానికి అది చిహ్నం. అందులోని అల్లికలు మా మధ్య ఐకమత్యానికి ప్రతీక. స్కర్ట్‌ దారాల అల్లిక వెనుక అనేక కథలు. మహిళలను సంఘటితం చేసే ప్రత్యేకతలు. ఈ స్కర్ట్‌ల అల్లికలు, ఇతర సాయాల కోసం 10 వేల డాలర్ల నిధులు సేకరించా.


అందాల పోటీల్లో మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా?

మిస్‌ కెనడా వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్నప్పుడు తోటి పోటీదారులు వెకిలిగా మాట్లాడారు. ‘ఆదిమ తెగ నుంచి వచ్చిందట. చారిటీ చెక్కులపై సంతకం కాలి బొటనవేలితో పెడుతుందా?’ అని వెక్కిరించారు. బాధగా అనిపించింది. ఇక ఈ పోటీల కోసం కుటుంబం నుంచి దూరంగా ఉండటం ఇబ్బంది. కానీ నేనో పెద్ద లక్ష్యం వైపు వెళ్తున్నానని వారికి తెలుసు.

నేటి తరం మహిళలకు మీరిచ్చే సందేశమేంటి?

నేనే ఒక సందేశం. నేనే ఒక సాక్ష్యం. ఏ నేపథ్యం లేకుండా వచ్చాను. మిస్‌ కెనడా వరల్డ్‌గా ఎంపికయ్యాను. అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. నేర్పు, ఓర్పు, హార్డ్‌ వర్క్‌ ఉంటే చాలు. కలలు నెరవేరుతాయి.


హైదరాబాద్‌లో ఏమేం చూడాలనుకుంటున్నారు?

చార్మినార్‌ను చూడాలి అనుకుంటున్నా. అది ఎన్ని వందల ఏళ్ల నుంచి ఉంది? (400 ఏళ్లని చెప్పడంతో..) ఓహ్‌ నా కాళ్లు నిలవడం లేదు. 400 ఏళ్లా? మా దేశ చరిత్ర కంటే ఎక్కువ అది. చార్మినార్‌ చూసి లాడ్‌ బజార్‌లో తిరుగుతా. చారిత్రక ప్రదేశాలతోపాటు ఇక్కడ నైట్‌ పబ్‌కు వెళ్తా.

భారత సంస్కృతి, సంప్రదాయాలపై మీ అభిప్రాయం?

భారతీయులు ఎవరినైనా చూడగానే నవ్వుతూ పలకరిస్తారు. సానుకూల దృక్పథంతో ఉంటారు. అందుకే నాకు భారత్‌ అంటే ఇష్టం. కెనడాలోనూ భారత సంస్కృతి ఉంది. మా ఊరిలో హోలీ సంబరాల్లో పాల్గొన్నా.


ఈసారి మిస్‌ వరల్డ్‌లో ప్రధాన పోటీలేంటి?

‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ ప్రధాన పోటీ. ఎంపికైన ప్రాజెక్టుకు సంబంధించి బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ చేయాలి. అదే విధంగా స్పోర్ట్స్‌ ఫిట్‌నెస్‌ ఈవెంట్‌ ఉంటుంది. అమెరికా, యూరోప్‌, ఆసియా, ఆఫ్రికా దేశాల పోటీదారులందరితో ఫిట్‌నెస్‌, వాకింగ్‌, రన్నింగ్‌ పోటీలు ఉంటాయి.

మీకు నచ్చిన హైదరాబాదీ వంటకం?

చికెన్‌ బిర్యానీ. చాలా ఘాటుగా ఉంది. కెనడాలో ఇంత ఘాటైన ఆహారం ఉండదు. ఇక భోజనం అనంతరం తీపి పదార్థాలు బాగున్నాయి. టేబుళ్ల నిండా పెడుతున్నారు. ముట్టుకుంటే అందం పోతుందేమో అన్నంతగా అలంకరించి ఇస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 04:10 AM