Jagga Reddy Helps Vikas: మళ్లీ ఉదారత చాటుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:31 PM
మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దీంతో సంగారెడ్డి ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 13: సామాజిక సేవా కార్యక్రమాల్లోనే కాదు.. ఉదారతలోనూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ముందుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అంధ బాలుడి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. దీంతో జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోంకా తండాకు చెందిన వికాస్ నాయక్ మూడేళ్ల వయస్సులో అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతడు కంటి చూపును కోల్పోయాడు. అతడి తల్లిదండ్రులు ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా వికాస్‌కు చూపు మాత్రం రాలేదు. ప్రస్తుతం నిజామాబాద్‌లోని అంధుల పాఠశాలలో వికాస్ ఐదో తరగతి చదువుతున్నారు. ఇక అతడికి చూపు లేకున్నా వికాస్ నాయక్.. గాయకుడిగా రాణిస్తున్నాడు.
అయితే వికాస్ నాయక్ తండ్రికి రెండు కిడ్నీలు పాడైపోయి.. మంచం పట్టాడు. వికాస్ కంటి చూపు కోసం.. అతడి తండ్రి చికిత్స కోసం ఆ కుటుంబం భారీగా అప్పు చేసింది. దీంతో అసలుతోపాటు వడ్డీ సైతం భారీగా పెరిగిపోయింది. అసలు, వడ్డీ కలిసి.. దాదాపు రూ. 6 లక్షలకుపైగా దాటింది. ఈ నేపథ్యంలో ఇటీవల వికాస్ కుటుంబ సభ్యులు.. జగ్గారెడ్డిని కలిసి కుటుంబ పరిస్థితిని వివరించి.. తమకు సహయం చేయాలంటూ అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో శనివారం నాడు సంగారెడ్డిలోని తన నివాసానికి వికాస్ కుటుంబాన్ని జగ్గారెడ్డి పిలుపించుకున్నారు. ఈ సందర్భంగా రూ. 7.50 లక్షల చెక్కను వికాస్ కుటుంబానికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా అంధుడైన వికాస్ గానం చేసిన పాటలకు జగ్గారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వికాస్‌కు స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసి అందజేశారు.
తాను ఇచ్చిన నగదుతో అప్పు తీర్చడమే కాకుండా.. యూట్యూబ్ చానల్ నిర్వహించుకునేందుకు మిగిలిన మొత్తాన్ని వినియోగించాలంటూ వికాశ్ కుటుంబ సభ్యులకు జగ్గారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ.. బాగా చదువుకుని కలెక్టర్ అవడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా జగ్గారెడ్డికి వివరించారు. అనంతరం స్వయంగా ఆయనే కారును ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలానికి పంపించారు. ఈ ఘటనతో జిల్లావ్యాప్తంగా అనేక మంది జగ్గారెడ్డిని ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని