Share News

Nalgonda: బాలిక కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో యువకుడికి 51 ఏళ్ల జైలుశిక్ష

ABN , Publish Date - Aug 27 , 2025 | 04:46 AM

బాలికను కిడ్నాప్‌ చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 51 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. దీనితోపాటు రూ.80 వేల జరిమానా విధించింది.

Nalgonda: బాలిక కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో యువకుడికి 51 ఏళ్ల జైలుశిక్ష

  • నల్లగొండ జిల్లా రెండో అదనపు జడ్జి సంచలన తీర్పు

  • పోక్సో కేసులో 20 ఏళ్లు, కిడ్నా్‌పకు

  • 10 ఏళ్లు.. అట్రాసిటీ చట్టం కింద

  • 20 ఏళ్లు.. బెదిరింపులకు ఏడాది జైలు

నల్లగొండ క్రైం/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): బాలికను కిడ్నాప్‌ చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 51 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. దీనితోపాటు రూ.80 వేల జరిమానా విధించింది. బాధిత బాలికకు జిల్లా న్యాయసేవా సహకార సంస్థ ద్వారా రూ.7లక్షలు పరిహారం అందించాలని ఆదేశించింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీఎస్టీ కోర్టు, అత్యాచారం, పోక్సో కేసుల ప్రత్యేక కోర్టుల న్యాయాధికారి ఎన్‌.రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాల మేరకు.. నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన ప్రైవేట్‌ కారు డ్రైవర్‌ మహమూద్‌ ఖయ్యూం ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా కారులో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఖయ్యూం నుంచి తప్పించుకున్న బాలిక.. తల్లిదండ్రుల వద్దకు చేరుకుని జరిగిన దారుణాన్ని వివరించింది. తల్లిదండ్రులతో కలిసి వెళ్లి 2021 డిసెంబర్‌ 5న తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో, ఐపీసీ, ఎస్సీ- ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయాధికారి మంగళవారం తీర్పు వెలువరించారు. బాలికపై లైంగికదాడి నేరానికి పోక్సో చట్టం సెక్షన్‌-4 కింద 20 ఏళ్ల జైలుశిక్ష రూ.25వేలు జరిమానా.. ఆమె ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినదని తెలిసీ దారుణానికి పాల్పడ్డందుకు ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం కింద 20ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానా.. బాలికను కిడ్నాప్‌ చేసిన నేరానికి ఐపీసీ సెక్షన్‌ 366 ప్రకారం పదేళ్ల జైలు, రూ.25 వేల జరిమానా.. నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్‌ 506 ప్రకారం ఏడాది జైలు, రూ.5వేల జరిమానా.. మొత్తంగా 51 ఏళ్ల జైలుశిక్ష, రూ.80 వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ.7 లక్షలు పరిహారాన్ని జిల్లా న్యాయ సేవా సహకార సంస్థ ద్వారా అందించాలని తీర్పులో పేర్కొన్నారు.


బాలుడిపై లైంగికదాడి.. యువకుడికి జీవిత ఖైదు

ఏడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు జడ్జి ఎన్‌.అమరావతి తీర్పు వెలువరించారు. బిహార్‌కు చెందిన గిరిధర్‌ (32) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జగద్గిరిగుట్ట మగ్దూమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. 2017 జూన్‌ 26న అదే ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలుడి తండ్రి జూలై 13న జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న జడ్జి గిరిధర్‌ను దోషిగా నిర్ధారించి.. జీవిత ఖైదుతోపాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధిత బాలుడి కుటుంబానికి 2లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2025 | 04:46 AM