Bhatti Vikramarka: కాంగ్రెస్ సర్కార్‌పై బురద జల్లుతున్న బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:52 AM
పదేళ్ల పాటు అధికారంలో ఉండి తప్పు మీద తప్పు చేసిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
పదేళ్లలో తప్పులు చేసి.. మాపై నిందలా?
జలాల సమర్థ వినియోగమే లక్ష్యం: భట్టి
కాంగ్రెస్ అంటే సాగు, కరెంటు, ప్రాజెక్టులు
మాకు భగవంతుడి ఆశీర్వాదం: పొంగులేటి
పాలేరు నుంచి సాగర్ జలాలు విడుదల
ఖమ్మం/కూసుమంచి, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల పాటు అధికారంలో ఉండి తప్పు మీద తప్పు చేసిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అదే పార్టీ నేతలు తమపై నిందలు మోపడం విడ్డూరంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం నుంచి జిల్లాలోని సాగర్ రెండో జోన్ ఆయకట్టుకు సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సాగర్ జలాలను విడుదల చేశారు. అనంతరం పాలేరులో భట్టి విలేకరులతో కృష్ణా బేసిన్‌లో ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. పైగా, రోజుకు 11 టీఎంసీల నీరు తరలించేందుకు వీలుగా ప్రాజెక్టులు నిర్మించేందుకు బీఆర్‌ఎస్ పెద్దలు సహకరించారని ఆరోపించారు. గతంలో వారు చేసిన తప్పిదాలను సరిచేస్తూ తాము ముందుకు పోతున్నామని, కృష్ణా, గోదావరి జలాలను సమృద్ధిగా వినియోగించుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రైతును రాజు చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వ్యవసాయం, కరెంటు, ప్రాజెక్టులని వ్యాఖ్యానించారు. భగవంతుడి దయ తమ ప్రభుత్వానికి ఉందని, అందువల్లే వ్యవసాయానికి నీరు విడుదల చేయగలుగుతున్నామన్నారు.
81 మంది జేఎల్స్‌కు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్లు(జేఎల్)గా పనిచేస్తున్న 81 మందికి ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి, సంచాలకులు కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో ఈమేరకు వారికి పదోన్నతుల ఉత్తర్వులు అందించారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి