Share News

Mahesh Kumar Goud: ఆ 5200 కోట్లు.. బిల్లీ రావుతో కేటీఆర్‌ లంచం పద్దు!

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:04 AM

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విలువ రూ.5,200 కోట్లు అని కేటీఆర్‌ చెబుతున్నారు. వాస్తవానికి అది బిల్లీ రావుతో కేటీఆర్‌ కుదుర్చుకున్న లంచం పద్దు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అన్నారు.

Mahesh Kumar Goud: ఆ 5200 కోట్లు.. బిల్లీ రావుతో కేటీఆర్‌ లంచం పద్దు!

  • ఐఎంజీ భారత్‌తో 30 శాతానికి ఒప్పందం

  • బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. 400 ఎకరాలను బిల్లీ రావుకు అప్పగించేవారు

  • బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో భూముల అమ్మకాలపై చర్చకు కేటీఆర్‌ సిద్ధమా?: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ‘‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విలువ రూ.5,200 కోట్లు అని కేటీఆర్‌ చెబుతున్నారు. వాస్తవానికి అది బిల్లీ రావుతో కేటీఆర్‌ కుదుర్చుకున్న లంచం పద్దు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అన్నారు. ఆ భూములకు సంబంధించి 30 శాతం ముడుపులు చెల్లించేలా ఐఎంజీ భారత్‌తో కేటీఆర్‌ ఎన్నికల ముందు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ సంస్థకు భూములు అప్పగించి ఉండేవారని తెలిపారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మహేశ్‌గౌడ్‌ మాట్లాడారు. కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్ల ధర పలికినప్పుడు.. చుట్టూ మైక్రోసాఫ్ట్‌, ఆక్సెంచరీ వంటి సంస్థల భవనాలు ఉన్న కంచ గచ్చిబౌలి భూముల విలువ రూ.75 కోట్లు ఉండదా? అని ప్రశ్నించారు. ఇది కూడా ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసీతో సర్కారు చేసుకున్న ఒప్పందమేనన్నారు. భవిష్యత్తులో ఆ భూములను టీజీఐఐసీ అభివృద్ధి చేసి వేలం వేస్తే.. ఎకరం రూ.200 కోట్ల దాకా పలుకుతుందని అన్నారు. ఈ భూములపై ఐసీఐసీఐ బ్యాంకు నుంచి టీజీఐఐసీ తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణం ఎవరి జేబుల్లోకూ పోలేదని, ఆ మొత్తాన్ని రైతు రుణమాఫీకి, సన్న వడ్లకు బోన్‌సకు ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. రైతులు బాగుపడుతున్నారన్న కడుపు నొప్పితో కేటీఆర్‌ మాట్లాడుతున్నారని మహేశ్‌గౌడ్‌ మండిపడ్డారు. రుణాల సేకరణకు సంబంధించి ట్రస్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కన్సల్టెన్సీకి రూ.175 కోట్ల చెల్లింపును కూడా కుంభకోణం అన్నట్లుగా కేటీఆర్‌ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఏ ప్రభుత్వమైనా కన్సల్టెన్సీల ద్వారానే రుణాలకు వెళ్తుందని, గత ప్రభుత్వంలోనూ ఇదే జరిగిందని గుర్తు చేశారు. ట్రస్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థ.. టెండర్‌ ద్వారానే కన్సల్టెన్సీని దక్కించుకుందని, ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి వెళ్లిన మొత్తం పూర్తిగా వైట్‌ మనీయేనని స్పష్టం చేశారు. ఇది ఏ రకంగా అవినీతి అవుతుందని ప్రశ్నించారు.


ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్‌ కుటుంబం..

దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం.. కేసీఆర్‌ కుటుంబమని మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు. అవినీతి గురించి కేటీఆర్‌ మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ప్రైవేటు సంస్థ చేతుల్లో నుంచి కంచ గచ్చిబౌలి భూములను కాపాడి.. ప్రభుత్వపరం చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదని తెలిపారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ను 500 ఎకరాల్లో కడితే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, ఈ 400 ఎకరాలను అభివృద్ధి చేసి అందులో కొత్త కంపెనీలు వస్తే 5లక్షల ఉద్యోగాలు ఎందుకు రావని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, లక్షల ఎకరాల మేరకు జరిగిన డీ ఫారెస్టేషన్‌, హైదరాబాద్‌ పరిధిలో భూముల అమ్మకం, భూ దోపిడీపై చర్చకు కేటీఆర్‌ సిద్ధమా! అంటూ సవాల్‌ విసిరారు. గ్రేటర్‌ పరిధిలో 10 వేల ఎకరాలకుపైగా భూములను అమ్మిన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరిగిన భూ అవకతవకలపై సీఎం రేవంత్‌రెడ్డి విచారణ జరిపించాలని కోరారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులపై ఆమోద ముద్ర వేయాల్సిందిగా ప్రధాని మోదీని బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, ఈటల రాజేందర్‌, లక్ష్మణ్‌ ఎందుకు అడగడంలేదని మహేశ్‌గౌడ్‌ ప్రశ్నించారు. బీసీ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హెచ్‌సీయూ అంశాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తెరపైకి తెచ్చాయని ఆరోపించారు. హైదరాబాద్‌ అభివృద్ధి కాకూడదనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ సహా పలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని అన్నారు.


ఆ 400 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమే

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమేనని సుప్రీంకోర్టు ఎంపవర్‌ కమిటీకి కాంగ్రెస్‌ ఎంపీలు రఘురాంరెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ, అటవీశాఖ రికార్డుల ప్రకారం ఈ భూమిని అటవీ భూమి అని వర్గీకరించలేదని పేర్కొన్నారు. ఈ భూములను అభివృద్ధి చేస్తే రూ.50 వేల కోట్ల మేరకు పెట్టుబడులు, 5లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఈ మేరకు ఎంపీలు శుక్రవారం కమిటీ సభ్యులను కలిసి లేఖ సమర్పించారు.


ఇవి కూడా చదవండి:

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు

Read Latest and Viral News

Updated Date - Apr 12 , 2025 | 04:04 AM