kalvakuntla kavitha: అలా అయితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడమే..: కవిత
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:12 PM
రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తేమ ఎంత ఉన్నా.. పత్తి, వడ్లు, ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్దితో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
మహబూబ్ నగర్, అక్టోబర్ 29: భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని.. కానీ సామాజిక తెలంగాణ సాధనలో మాత్రం ఒక అడుగు వెనుకనే ఉన్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనం బాట పేరిట చేపట్టిన పాదయాత్రలో భాగంగా బుధవారం మహబూబ్ నగర్‌లో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. సామాన్యులకు కనీస వైద్యం అందించ లేని స్దితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు మంజూరు చేయకపోవడం వల్ల పేద విద్యార్దులు చదువులు వదిలి ఇంటి వద్దే ఉంటున్నారని చెప్పారు. భూమి కోసం.. భుక్తి కోసం.. విమూక్తి కోసం చేసిన ఉద్యమం విజయవంతమైందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో జాగృతి సంస్థ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రులు, గురుకులాలను నడిపే స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదని విమర్శించారు. అధికారంలో అందరికీ వాటా దక్కాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో వర్తిస్తుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పరిస్థితి తేలడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముస్లిం, లంబాడిలు లేని మొట్టమొదటి కేబినెట్ ఇదంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఆత్మగౌరవం కలిగిన అధికారం కావాలని కవిత ఆకాంక్షించారు. అధికారం.. ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ నినాదంతో తెలంగాణ జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. విప్లవాత్మత చర్యల వల్ల సామాజిక తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు. వివక్ష లేని సమాజం కోసం సామాజిక తెలంగాణ రావాలన్నారు. యెన్నం శ్రీనినాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా?.. బీజేపీలో ఉన్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకం పనులు ఆలస్యం వల్ల పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఆ నీటిని తరలించుకు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచితే పాలమూరు జిల్లాలోని కృష్ణానదిలో క్రికెట్ ఆడుకోవల్సిందేనంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆల్మట్టి ఎత్తును అడ్డుకునేందుకు ప్రయత్నించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత సూచించారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. తేమ ఎంత ఉన్నా.. పత్తి, వడ్లు, ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్దితో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అందుకోసం అన్ని రాజకీయ పార్టీల బృందాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అయితే తనకు బీఆర్ఎస్‌తో సంబంధం లేదని కుండ బద్దలు కొట్టారు. ఎంబీసీ కులాల స్వశక్తికరణే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
అక్టోబర్ 26వ తేదీన జనం బాట పేరిట కవిత పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. 33 జిల్లాల్లోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది. అంతకుముందు గన్ పార్క్‌లోని అమర వీరుల స్తూపానికి కవిత నివాళులర్పించి.. అనంతరం నిజామాబాద్ వెళ్లారు. నిజామాబాద్ నుంచి ఆమె ఈ యాత్రను చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొంథా తుఫాను.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ ప్రచారం.. షెడ్యూల్ ఫిక్స్
Read Latest Telangana News And Telugu News