Share News

CM Revanth reddy: కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల నెరవేరబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Nov 24 , 2025 | 06:22 PM

త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూతను వినబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుందన్నారు. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయన్నారు.

CM Revanth reddy: కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల నెరవేరబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
TG CM Revanth Reddy

కొడంగల్, నవంబర్ 24: ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే.. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కొడంగల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బతికేలా ఉండాలని తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ప్రతి పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. అదానీ, అంబానీలతో పోటి పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణను మహిళలకు అప్పగించామని వివరించారు. మహిళలకు ఆర్ధిక స్వాతంత్య్రం కల్పించామని వివరించారు.


హైటెక్ సిటీ శిల్పారామంలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ సైతం ఏర్పాటు చేశామని వివరించారు. ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదువు అందించడం ఒక్కటే మార్గమని సూచించారు. మీ పిల్లలు గొప్పగా చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని చెప్పారు. ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని అందించే కార్యక్రమం తీసుకువస్తున్నామన్నారు. బిడ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లుగా… తమ ప్రభుత్వం ఆలోచించి వారి ఆకలి తీరుస్తోందని తెలిపారు.


ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చామని వివరించారు. విద్య ఒక్కటే తరగని ఆస్తి అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువుల కోసం కొడంగల్‌కు వెళ్లాలనేలా ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. 16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్‌ను మార్చాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.


కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని చెప్పారు. మూడేళ్లల్లో ప్రాజెక్టు పూర్తి చేసి కొడంగల్ భూములను కృష్ణా జలాలతో తడుపుతామని విశ్వాసం వ్యక్తం చేశారు . లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ పారిశ్రామిక వాడగా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూతను కూడా వినబోతున్నారన్నారు. కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల నెరవేరబోతుందన్నారు. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయని తెలిపారు.


కొడంగల్ నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలు సైతం ఏర్పాటు కాబోతున్నాయని వివరించారు. అభివృద్ధిలో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఒక మోడల్‌గా మారుస్తామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోండంటూ ప్రజలకు సూచించారు. ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారె ఇందిరమ్మ చీరలని.. ఇవి ప్రతి ఆడబిడ్డకు చీర చేరేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. రాజకీయాలకు అతీతంగా కొడంగల్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధికి అండగా ఉండాలని ఈ సందర్భంగా ఆడబిడ్డలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళా స్వయం సహాయక సంఘాలకు సర్కార్ గుడ్ న్యూస్

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More TG News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 07:34 PM