Telangana Government: మహిళా స్వయం సహాయక సంఘాలకు సర్కార్ గుడ్ న్యూస్
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:33 PM
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మంత్రి సీతక్క తెలిపారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వాటిని చెల్లిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. తాజాగా మహిళా స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సంఘాలకు రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నిధులను జమ చేసింది. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డీఆర్‌డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క.. ఏటూరు నాగారం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని తెలిపారు.
ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వాటిని చెల్లిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై ఈ సందర్భంగా సీతక్క మండిపడ్డారు. అంతే కాకుండా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పొదుపు సొమ్మును సైతం గత ప్రభుత్వం కాజేసిందని విమర్శించారు. అక్కా చెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా ప్రభుత్వం మింగేసిందన్నారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలను ప్రారంభించిందని గుర్తు చేశారు.
మహిళలకు నిధులను సమీకరించడమే కాదు.. ఈ వడ్డీలను కూడా సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డల కష్టాన్ని కాజేసి కన్నీళ్ళకు కారణమైన బీఆర్ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటూ ఆ పార్టీ నేతలకు సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లు తగ్గకుండా బ్యాంక్ లింకేజీ రుణాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని సీతక్క వివరించారు. ఈ సంఘాలకు క్రమం తప్పకుండా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుంది. తాజాగా రూ. 304 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా సంఘాల ఖాతాల్లో ఈ నిధులు జమ అయినాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News