Road Accident: ప్రమాదానికి గురైన మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. అసలు కారణం ఇదే..
ABN , Publish Date - Feb 24 , 2025 | 09:02 AM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెనక టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మహబూబ్‌నగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి. మిర్యాలగూడ ఘటన మరవకముందే నేడు(సోమవారం) మరో బస్సు ప్రమాదం సంభవించింది.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెనక టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్నవారంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాద సమయంలో మెుత్తం 40మంది ప్రయాణికులు ఉండగా.. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో బొలెరో, ద్విచక్రవాహనం ఢీకొని ఓ విద్యార్థి మృతిచెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. బుడమోర్సు గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి మురళి పని నిమిత్తం వెళ్తుండగా వేగంగా వచ్చిన బొలెరో అతన్ని ఢీకొట్టింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, శనివారం నాడు మిర్యాలగూడ చింతపల్లి బైపాస్‌పై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో నెల్లూరుకు వెళ్తున్న పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టగా ఓ మహిళ మృతిచెందింది. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తరచూ ఇలాంటి ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Tunnel Collapse: టన్నెల్ నిండా బురద