karimnagar : ‘దోస్త్’ కటీఫ్
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:20 AM
గణేశ్‌నగర్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతమున్న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) విధానాన్ని ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

- డిగ్రీలో ఆన్‌లైన్ అడ్మిషన్లకు స్వస్తి చెప్పే యోచనలో ప్రభుత్వం
- భారీగా మిగిలిపోతున్న సీట్లు..
- ముందే జాగ్రత్త పడుతున్న పైవ్రేటు కాలేజీలు
గణేశ్‌నగర్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతమున్న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) విధానాన్ని ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలను పాత విధానంలోనే చేపట్టే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి ఈ విషయంపై ఇప్పటికే చేపట్టిన అధ్యయనం తుది దశకు చేరుకోగా, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దోస్త్‌ను మొదటి ఉంచి కొన్ని కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఫ ఏమిటీ దోస్త్
జిల్లా వ్యాప్తంగా 68 ప్రభుత్వ, పైవ్రేటు డిగ్రీ కాలేజీలున్నాయి. గతంలో డిగ్రీ సీటు కోసం ప్రతీ కాలేజీలోనూ రుసుము చెల్లించి దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉండేది. విభిన్న కోర్సుల కోసం వివిధ దరఖాస్తులు చేయాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల విద్యార్థులు వ్యయ ప్రయాసలకు గురయ్యేవాళ్లు. దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగ్గా, ఆన్‌లైన్‌లో ఏకీకృత ప్రవేశాలు ఉండాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 2015లో ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 2016 నుంచి దోస్త్ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థి కూడా ఆన్‌లైన్‌లో అన్ని కాలేజీలకు, అన్ని కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల దరఖాస్తులోనే ఎక్కడ? ఏ కాలేజీలో? ఏ కోర్సులో? సీటు వచ్చిందనే సమాచారం ఇచ్చే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
ఫ అభ్యంతరాలేంటి?
దోస్త్ ద్వారా కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు స్థానికంగా కాకుండా, మెరిట్ ప్రకారం ఎక్కడో సీట్లు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు చేరడం లేదు. మరోవైపు పైవ్రేటు సంస్థలు విద్యార్థుల వద్దకు వెళ్లి విద్యార్థులకు మాయమాటలు చెప్పి తమ కళాశాలలకు మాత్రమే ఆప్షన్స్ ఇప్పిస్తున్నారు. మరికొన్ని కళాశాలలు తామే విద్యార్థుల ద్వారా దరఖాస్తు చేస్తున్నాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో దోస్త్ ప్రవేశాలు ఎక్కువగా ఉంటున్నాయని, మరి కొన్నిచోట్ల తక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ, మండల కేంద్రాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు కనీస స్థాయిలో విద్యార్థులు చేరడం లేదు. ఇప్పటికే చాలా కాలేజీలు మూసివేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల కాకపోవడంతో పైవ్రేట్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలా వరకు కళాశాలలు మూతపడుతున్నాయి. దోస్త్ పేరుతో ఉన్నత విద్యా మండలి ఆధిపత్యం చెలాయిస్తోందనే విమర్శలు ఉన్నాయి. పాత విధానం వల్ల కాలేజీలపై ప్రభుత్వ అజమాయిషీ తగ్గుతుందని, విద్యార్థులు ఇష్టం వచ్చిన కళాశాలల్లో చేరే అవకాశం ఉంటుంది.
ఫ పాత పద్ధతిలోనే అడ్మిషన్లు నిర్వహించాలి
- వంగపల్లి ఉమాదేవి, మాజీ ఈసీ మెంబర్, శాతవాహన యూనివర్సిటీ
దోస్త్‌ను తొలగించి పాత పద్ధతిలోనే కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులు వారికి నచ్చిన కళాశాలలో చేరడానికి అవకాశం ఉంటుంది, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎక్కడో హైదరాబాదులో సీటు వస్తే ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాలల్లో చేరడం లేదు. పాత పద్ధతిలో దరఖాస్తు చేసుకునే విధానం ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు సమీపంలో ఉన్న కళాశాలల్లో చేరుతారు.
ఫ మేధావులు, విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవాలి
-డాక్టర్ పెంచాల శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రతి విద్యార్థి తను ఎన్నుకున్న సబ్జెక్టును, కళాశాలను, ప్రదేశాలను తన ఇష్టానుసారంగా ఎన్నుకునే అవకాశం దోస్త్ ప్రక్రియ ద్వారా చేసుకోవచ్చు. దీని వల్ల విద్యార్థి స్వేచ్ఛకు, అభిప్రాయాలకు విలువనిచ్చినట్లవుతుంది. దోస్త్ ప్రక్రియలో మార్పులు చేర్పులు మేధావులు, విద్యార్థుల అభిప్రాయాలను తీసుకోవాలి.
ఫ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి
- కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
దోస్ విధానంతో పేరున్న కళాశాలలకు మాత్రమే అడ్మిషన్లు పోతున్నాయి. చిన్న కళాశాలలు అడ్మిషన్లు లేక తలలు పట్టుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.
ఫ దోస్త్‌తో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు..
- చిక్కుల కిరణ్, విద్యార్థి సంఘ నాయకుడు
విద్యార్థులు అడ్మిషన్ పొందిన తర్వాత కళాశాల నచ్చకుంటే మరో కళాశాల అవకాశం వచ్చే విధంగా ఆప్షన్ ఇస్తే బాగుంటుంది, ఒకసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత మరొక కళాశాలకు వెళ్లాలంటే కళాశాల సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోస్త్‌ను తొలగించి పాత పద్ధతిలోనే అడ్మిషన్ల పక్రియ కొనసాగిస్తే బాగుంటుంది. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చెప్పుకోలేక, నచ్చని కళాశాలలో విద్యను అభ్యసించలేక, చదువుకు దూరమవుతున్నారు.