Tunnel Collapse: టన్నెల్ నిండా బురద
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:36 AM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకోవడంతో..

సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన
టీబీఎం నుంచి 400 మీటర్ల వరకు కూరుకుపోయిన మట్టి, ఐరన్ షీట్లు
నిమిషానికి 3500 లీటర్ల దాకా
సొరంగంలోకి వస్తున్న ఊటనీరు
సవాల్‌గా మారిన నీటి తొలగింపు
3 రోజులపాటు సహాయక చర్యలు కొనసాగితేనే పరిస్థితి కొలిక్కి!
ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు
2.5 మీటర్ల ఎత్తున పేరుకున్న బురద
సహాయక చర్యలపై సీఎం ఆరా
సీఎం రేవంత్‌కు రాహుల్ ఫోన్
కార్మికులను రక్షించేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని సూచన
మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూలు/అచ్చంపేట/ దోమలపెంట, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకోవడంతో.. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు, హైడ్రా, ఇండియన్ ఆర్మీ, స్పెషల్ బెటాలియన్ల ఆధ్వర్యంలో శనివారం రాత్రి 10.30 గంటల నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకు మూడు బృందాలు లోపలికి వెళ్లాయి. అయితే సొరంగంలో దాదాపు 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తున బురద పేరుకుపోవడం, నిమిషానికి 3500 లీటర్ల వరకు ఊటనీరు వస్తుండటం, ప్రమాదం జరిగిన తర్వాత పేరుకుపోయిన నీరు నిల్వ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాదాపు 13 కిలోమీటర్ల వరకు విద్యుత్తు సరఫరాను, వైఫైని పునరుద్ధరించగా.. అక్కడి వరకు ఆక్సిజన్ సరఫరా నిర్విరామంగా కొనసాగుతోంది. టన్నెల్ లోపల ఇరుకుగా ఉండటం, దిగువన బురద కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని స్థితి ఉండటంతో.. సహాయక చర్యలకు ఎక్కువ బృందాలను తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) నుంచి దాదాపు 400 మీటర్ల వరకు మట్టి కూరుకుపోయిందని సహాయక చర్యల్లో పాల్గొని తిరిగివచ్చిన వారు చెబుతున్నారు. దీంతో లోపల చిక్కుకున్నవారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడం, వారు ఉన్న వైపునకు గాలి సరఫరా లేకపోవడం, ప్రమాదం జరిగి దాదాపు రెండు రోజులు అవుతుండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. లోపలికి వెళ్లివచ్చిన వారు కూడా.. సహాయక చర్యలు పూర్తయి, టన్నెల్‌లో చిక్కుకున్నవారి వద్దకు వెళ్లాలంటే కనీసం మూడు రోజుల సమయం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం మూడో బృందంలో మధ్యాహ్నం ఒంటి గంటకు టన్నెల్ లోపలికి వెళ్లి సాయంత్రం 6.40 గంటలకు బయటకు వచ్చారు. అక్కడ నెలకొన్న పరిస్థితి ప్రకారం ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా చెప్పలేమన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, చిక్కుకున్న వారిని కాపాడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్విరామంగా డీ వాటరింగ్ ప్రక్రియ..
సహాయక చర్యలకు ప్రధానంగా బురద, నీరు అడ్డంకిగా ఉండడంతో డీ వాటరింగ్ చేయడం సవాల్‌గా మారింది. లోపలికి వెళ్లివచ్చిన రెస్క్యూ బృందాల్లోని సభ్యులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు నిల్వ ఉన్న బురద నీటిని తరలించడం కష్టంగా మారిందని అంటున్నారు. ఇప్పటికే డీ వాటరింగ్ కోసం అక్కడ 150 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్ ఉండగా, మరో 100 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్‌ను బిగించారు. నిమిషానికి దాదాపు 4500 లీటర్ల నీటిని బయటకు తోడుతున్నారు. పేరుకుపోయిన మట్టి.. లూజ్ బురదగా మారితే దానిని కూడా డీ వాటరింగ్‌లో భాగంగానే బయటకు తరలించే ప్రయత్నం చేస్తే సహాయక చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే టన్నెల్ ఇరుకైనది కావడం కూడా సమస్యగా మారింది. టన్నెల్ దాదాపు 9 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. ఇందులో ఎయిర్ పంపింగ్ కోసం పైపు లాంటి వ్యవస్థ ఉంటుంది. కిందివైపు.. పైపులు, విద్యుత్తు సరఫరా లైన్లు, మట్టి తరలించడానికి కన్వేయర్లు ఉంటాయి. ఈ ఇరుకు సొరంగంలోకి ఎక్కువ మంది వెళ్లి పనిచేయడానికి లేదా ఎక్స్‌కవేటర్లు, పెద్ద మెషినరీ వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. కేవలం 50 నుంచి 60 మంది మాత్రమే వెళ్లి పనిచేయడానికి వీలుంటుంది. సొరంగం లోపల బురద పేరుకుపోవడంతో.. సహాయక బృందాలు అందులోకి దిగి నడవడం కోసం తడకలను, లూజ్ బురద ఎక్కువగా ఉంటే అందులో నుంచి వెళ్లేందుకు థర్మకోల్ తెప్పలను, ఊటనీరు ఎక్కువగా వస్తే రక్షణ కోసం ట్యూబ్‌లను సహాయక బృందాలు లోపలికి తీసుకెళ్లాయి. మట్టికి అడ్డుగా ఐరన్ షీట్లు, రాడ్లు పడడంతో.. వాటిని కట్ చేయడానికి కట్టర్లు, గ్యాస్ సిలిండర్లు, విద్యుత్తు సరఫరా నిలిచిపోతే ఇబ్బంది కాకుండా డీజిల్ జనరేటర్లను తీసుకెళ్లారు.
మంత్రులు, అధికారుల సమీక్షలు..
సహాయక చర్యలను పరిశీలించడానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉదయం 10.30గంటలకు జేపీ గెస్ట్‌హౌ్‌సకు వచ్చారు. అక్కడే అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మంత్రి జూపల్లి దాదాపు ఐదు గంటలపాటు టన్నెల్‌లోనే ఉండి సహాయక చర్యలను పరిశీలించారు. మరోవైపు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సంబంధిత విభాగాలతో ఆరా తీశారు. కార్మికులను రక్షించేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులకు సూచించారు. కాగా, సహాయక బృందాలకు సహకారం అందించేందుకు సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీర్ టాస్క్‌ఫోర్స్ (ఈటీఎఫ్) బృందాలు కూడా ఆదివారం రంగంలోకి దిగాయి.
సహాయక చర్యల్లో వందల మంది..
సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో భాగంగా భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతోపాటు రెండు ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి 120 మంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, ఎస్డీఆర్‌ఎఫ్ నుంచి 70 మంది, సింగరేణి రెస్క్యూ టీం నుంచి 35 మంది, హైడ్రా నుంచి 15 మంది పాల్గొంటున్నారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ సీఎస్ అరవింద్‌కుమార్, ఐఏఎస్ శ్రీధర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, నాగర్‌కర్నూలు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్లు సుదీశ్‌కుమార్, ప్రసన్న, పవన్, అగ్నిమాపక శాఖ నుంచి ఆర్‌ఎఫ్ హరినాథ్‌రెడ్డి, సింగరేణి రెస్య్యూ టీం చీఫ్ కలందర్ తదితరులు పాల్గొంటున్నారు. మొదటి టీంలో కేవలం 8 మంది మాత్రమే సొరంగంలోకి వెళ్లగా, రెండో టీంలో 23 మంది, మూడోసారి దాదాపు 50 మంది లోపలికి వెళ్లారు. జేపీ, రాబిన్ కంపెనీలు విద్యుత్తు, ఎయిర్, వాటర్, డీవాటర్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. సాయంత్రం 6.40గంటలకు మంత్రి జూపల్లితోపాటు పది మంది బయటకు వచ్చారు.
రెస్క్యూ ఆపరేషన్ సాగుతోందిలా..
శనివారం రాత్రి 10:30 గంటలకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది 8 మంది టన్నెల్ లోపలికి ట్రెయిన్ ద్వారా వెళ్లారు. 11.45 గంటలకు అక్కడికి చేరుకున్నారు. 12 కిలోమీటర్ల వరకు ట్రెయిన్‌లో వెళ్లి.. అక్కడి నుంచి కన్వేయర్ బెల్టు సాయంతో మరో కిలోమీటర్ వరకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దాదాపు 300 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు మట్టి, సెగ్మెంట్ బ్లాకులు, ఐరన్ షీట్స్, టన్నెల్ సామగ్రి పేరుకుపోయినట్లు గుర్తించి రాత్రి 2:30 గంటలకు తిరిగి వచ్చారు.
అర్ధరాత్రి దాటాక 3 గంటలకు సింగరేణి, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎ్‌ఫకు చెందిన దాదాపు 23 మంది టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లింది. వారు ఘటనా స్థలానికి దాదాపు 300 నుంచి 400 మీటర్ల దగ్గరి వరకు వెళ్లారు. అక్కడ దాదాపు 2.5 మీటర్ల ఎత్తు వరకు బురద ఉండటంతో.. అందులోకి దిగి నడవడం వీలు కావడం లేదని రెస్క్యూ టీంలో ఉన్న వ్యక్తులు తెలిపారు. 24 గంటలు షిప్టుల వారీగా మూడు రోజులపాటు సహాయక చర్యలు కొనసాగిస్తేనే లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం ఉందని కొందరు తమ అంచనాలను చెప్పారు. వారు ఆదివారం ఉదయం 9 గంటలకు తిరిగి వచ్చారు.
ఉదయం 10 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి జేపీ గెస్ట్‌హౌ్‌సకు వచ్చి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
10.30 గంటలకు ఆర్మీతోపాటు ఇతర సహాయక బృందాలు లోపలికి వెళ్లాయి.
11.30 గంటల వరకు మంత్రులు, ఇతర అధికారులు టన్నెల్ ప్రాంతానికి చేరుకొని, అక్కడ సహాయక ఏర్పాట్లపై ప్రణాళికలను పరిశీలించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొరంగం లోపలికి అర కిలోమీటర్ వరకు వెళ్లారు.
మధ్యాహ్నం 1 గంటకు మరో బృందం లోపలికి వెళ్లగా.. అందులో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వెళ్లారు.
సాయంత్రం 5.30 గంటలకు రాబిన్ కంపెనీకి చెందిన ఎలక్ర్టీషియన్లు, వాటర్‌మెన్ 10 మంది తిరిగి వచ్చారు.
సాయంత్రం 6.40 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నెల్ నుంచి బయటకు వచ్చారు.