Share News

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం ఎలా?

ABN , Publish Date - Feb 20 , 2025 | 05:05 AM

లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)-2020లోని దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్‌ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌లో ఎల్‌1 కేటగిరీ (స్థలం టైటిల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ చిక్కులు లేకపోవడం) కీలకం.

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌  దరఖాస్తుల  పరిష్కారం ఎలా?

ఇరిగేషన్‌, ప్లానింగ్‌, రెవెన్యూ సంయుక్త తనిఖీలకు అడ్డంకులు

  • ఏకకాలంలో జరిపే వీల్లేకుండా పలు సమస్యలు

  • శాఖలవారీగా దస్త్రాలు పంపి క్లియర్‌ చేసే యోచన

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)-2020లోని దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్‌ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌లో ఎల్‌1 కేటగిరీ (స్థలం టైటిల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ చిక్కులు లేకపోవడం) కీలకం. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించే క్రమంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు ముఖ్యం. కానీ ఇరిగేషన్‌, రెవెన్యూ, ప్లానింగ్‌ విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరిపేందుకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయా విభాగాల అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపడదామంటే.. ఆయా శాఖలకు అప్పటికే ఉన్న పనుల కారణంగా కుదరట్లేదు. దీంతో ఎల్‌1 క్లియరెన్స్‌ రాక దరఖాస్తులు పరిష్కారం కావట్లేదు. ఈ నేపథ్యంలో.. సంయుక్త తనిఖీలకు బదులుగా, ఆయా శాఖలవారీగా దస్త్రాలను పంపి, పరిష్కరించే దిశగా యోచిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌-2020 దరఖాస్తుల స్వీకరణ సందర్భంలోనే ఎక్కడికక్కడే పరిష్కారం చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. డీటీసీపీ కూడా ఉంది. కానీ హెచ్‌ఎండీఏ లేదు. దాని పరిధిలో ఉన్న 32 మున్సిపాలిటీలు, ఎనిమిది కార్పొరేషన్ల పరిధిలోని దరఖాస్తులను పరిష్కారం చేయడానికి ఆయా స్థానిక సంస్థల్లో పట్టణ ప్రణాళిక విభాగాలున్నాయి. కానీ హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కారం చేసే వ్యవస్థ లేదు. దాంతో 719 గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 4లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కారం చేసే బాధ్యతలను హెచ్‌ఎండీఏకు అప్పగించారు. ఈమేరకు హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటికే అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని మొత్తం 1337 దరఖాస్తుల్లో అక్రమ లేఅవుట్ల దరఖాస్తుదారులకు సమాచారమిచ్చి, వారి నుంచి సంబంధిత పత్రాలను పరిశీలించారు. అందులో 400 నుంచి 600 వరకూ దరఖాస్తులు తిరస్కరించారు. మిగతా దరఖాస్తులను అనుమతించి.. ఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారమిచ్చారు. ఆ ప్రక్రియ సాగుతోంది. అదే తరహాలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు.


ఇదీ లెక్క..

హెచ్‌ఎండీఏలో ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎ్‌స-2020కి సంబంధించిన ప్లాట్ల దస్త్రాలు 3.44 లక్షలున్నాయి. ఇందులో దాదాపు లక్ష దరఖాస్తుల ప్రాసెసింగ్‌ మొదలైంది. చెరువులు, నిషేధితజాబితాలో ఉన్న భూముల సర్వే నెంబర్ల సమీపంలోని ప్లాట్లు మినహా ఇతర ప్లాట్ల ప్రాసెసింగ్‌ ప్రక్రియను మాత్రమే చేపట్టారు. చెరువులు, నిషేదిత జాబితాలో ఉన్న భూముల సర్వే నెంబర్ల సమీపంలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌1 క్లియరెన్స్‌ చేసేందుకు ఇరిగేషన్‌, రెవెన్యూ, ప్లానింగ్‌ విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరపాలని నిర్ణయించారు. కానీ ఈ మూడు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయడం సాధ్యపడడం లేదు. సంయుక్త తనిఖీకి ఏదైనా తేదీని నిర్ణయించినా.. ఆ సమయానికి రావడం అందరు అధికారులకూ కుదరట్లేదు. ఇక.. చెరువులు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల సర్వే నెంబర్ల సమీపంలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌1 క్లియరెన్స్‌ చేసేందుకు వివిధ శాఖల వారిగా దస్త్రాలను పంపే యోచనలో ఉన్నారు. చెరువుకు చుట్టుపక్కల సర్వే నంబర్లలో గల ప్లాట్లకు ఇరిగేషన్‌ క్లియరెన్స్‌ ఇచ్చేందుకు ఆ శాఖకు సంబంధిత దరఖాస్తులు పంపాలని, చెరువుతో పాటు నిషేదిత జాబితాలో ఉన్న భూముల వెంట గల సర్వే నెంబర్లలో ప్లాట్ల వివరాలను రెవెన్యూ విభాగానికి పంపాలని భావిస్తున్నారు. దీనిపై మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు చర్చించి త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయి.


Also Read:

వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ

ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు

యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 05:05 AM