Share News

KTR: రేవంత్‌.. నన్నేం పీకలేవ్‌!

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:12 AM

‘ఎన్నో ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చాం. రేవంత్‌ రెడ్డీ.. కుట్ర కేసులు, కక్షపూరిత చర్యలతో నన్నేం పీకలేవ్‌’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

KTR: రేవంత్‌.. నన్నేం పీకలేవ్‌!

  • లొట్టపీసు కేసు.. లొట్టపీసు ముఖ్యమంత్రి

  • ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నో ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చాం. రేవంత్‌ రెడ్డీ.. కుట్ర కేసులు, కక్షపూరిత చర్యలతో నన్నేం పీకలేవ్‌’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పార్టీ పెట్టినప్పుడున్న పరిస్థితి, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమరవీరుల త్యాగాలతో పోల్చితే తనకొచ్చిందేమీ ఇబ్బంది కాదన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ 2025 డైరీని మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తనపై పెట్టిన కేసు గురించి పార్టీ శ్రేణులు ఆలోచించాల్సిన అవసరం లేదని, పార్టీ లీగల్‌ సెల్‌ ద్వారా న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. రైతులు, ప్రజలను మోసగిస్తున్న కాంగ్రె్‌సపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోరాడాలని, ఈ ఏడాదిని పోరాట నామ సంవత్సరం చేద్దామన్నారు. ఫార్ములా-ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిది ప్రతీకార ధోరణేనని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.


ఫార్ములా-ఈ ‘ఒక లొట్టపీసు కేసు.. ఆయనొక లొట్టపీసు ముఖ్యమంత్రి’ అని విమర్శించారు. ‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ తయారుచేసిన సైనికుడిని.. కేసీఆర్‌ రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని.. ఈ అక్రమ కేసులకు భయపడతానా?’ అని అన్నారు. తమ భూమి గుంజుకోవద్దన్నందుకు లగచర్ల రైతులను 40 రోజులు అక్రమంగా జైల్లో పెట్టిన దానితో పోలిస్తే తనపై కేసు పెద్దదేం కాదన్నారు. రైతులు, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలోనూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఈ ఏడాదంతా రైతన్నలకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హమీల అమలు గురించి, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, తప్పులు, మోసాలు, సాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న దుష్ప్రచారం గురించి మాట్లాడదామన్నారు. అంతేకానీ తనపై పెట్టిన అక్రమ కేసు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, కేటీఆర్‌ ఫార్ములా-ఈ కేసులో విచారణ నిమిత్తం గురువారం ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు.


అక్రమ కేసులు తప్ప ఏం చేశావ్‌ రేవంత్‌?: హరీశ్‌

ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న వారిపై సీఎం రేవంత్‌ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని హరీశ్‌ రావు ఆరోపించారు. ‘అక్రమ కేసులు తప్ప రేవంత్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదేమైనా ఉందా? కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పరిస్థితి ఏమైంద’ని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతోందని, ప్రజల్లో మరింత బలహీనపడతానన్న భయంతో కేటీఆర్‌పై కుట్రపూరితంగా లొట్టపీసు కేసు బనాయించారని విమర్శించారు. పార్టీ మొత్తం కేటీఆర్‌ వెంట ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయమంటే.. డబ్బుల్లేవంటున్న సీఎం తన కుటుంబ సభ్యుల భూములకు వేల కోట్లు ఖర్చుపెట్టి కల్వకుర్తి దాకా ఆరు లేన్ల రోడ్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. ఆసరా పింఛన్లకు, రైతుబంధుకు మాత్రం పైసల్లేవంటున్నారని చెప్పారు.

8.jpg

Updated Date - Jan 09 , 2025 | 04:12 AM