KTR: రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం!
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:07 AM
కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసంతో పాటు రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం కూడా జరిగిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.

కంచ గచ్చిబౌలి భూముల పేరిట రుణం
దేశాన్ని, బ్యాంకులను మోసగించిన రేవంత్ సర్కార్
హక్కు పత్రాలు చూడకుండానే రుణమిచ్చిన ‘ఐసీఐసీఐ’
బీజేపీ ఎంపీ సహకారంతో స్కాంకు తెరలేపిన సీఎం
ప్రధానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
టీజీఐఐసీకి రుణం ఇవ్వలేదు.. వాళ్లు స్థలాలు తనఖా పెట్టలేదు.. కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ఐసీఐసీఐ
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసంతో పాటు రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం కూడా జరిగిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఆ భూముల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ఈ కుంభకోణానికి తెరతీశారన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కారు రిజర్వ్ బ్యాంకును, బ్యాంకులను, దేశాన్ని మోసం చేసిందని పేర్కొన్నారు. భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండానే టీజీఐఐసీ ఆ భూమిని ఐసీఐసీఐ బ్యాంకుకు ఎలా తనఖా పెట్టింది? సేల్ డీడ్ కూడా లేని భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చింది? ఇది మోసం కాదా? అని ఆయన ప్రశ్నించారు. భూ యాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే రూ.10 వేల కోట్ల రుణమిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ట్రస్ట్ ఎడ్వజైర్స్ ఇన్వె్‌స్టమెంట్ అనే కంపెనీ రేవంత్‌రెడ్డికి బ్రోకరిజం చేసిందని, దీని వెనక బీజేపీ ఎంపీ హస్తం ఉందని ఆరోపించారు. ఇందుకుగాను సదరు కంపెనీకి రూ.169.84 కోట్లు లంచం ఇచ్చారని విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూములపై కోర్టు తీర్పు అనంతరం టీజీఐఐసీకి ఆ భూములు అప్పగిస్తున్నట్లు జీవో మాత్రమే ఇచ్చారన్నారు. సేల్ డీడ్, మ్యుటేషన్ చేయలేదని, భూములకు హక్కుదారుగా నిర్ధారించలేదని చెప్పారు.
తనది కాని భూమిని బ్రోకర్ కంపెనీ మాట విని, టీజీఐఐసీ తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఈ మోసానికి టీజీఐఐసీతో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శిని జైల్లో పెట్టొచ్చని తెలిపారు. సీఎం రేవంత్, ఐసీఐసీఐ బ్యాంకు, బ్రోకర్ సంస్థ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోకపోతే రేవంత్ సర్కారు మరో 60 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడుతుందన్నారు. బీకన్ ట్రస్టీషిప్, ట్రస్ట్ అడ్వైజర్స్ సంస్థలపై వెంటనే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కల ప్రకారం కంచగచ్చిబౌలి ప్రాంతంలో గజం విలువ రూ.26,900 అని.. అంటే 400 ఎకరాలకు రూ.5,239.84 కోట్లు మాత్రమేనని, మరోవైపు అక్రమ మార్గంలో రుణం పొందేందుకు రెవెన్యూ శాఖ ఆ భూమి విలువ 30 వేల కోట్లు అని చెప్పుకొందని విమర్శించారు. ప్రభుత్వం, బ్రోకర్ సంస్థ, ఐసీఐసీఐ బ్యాంకు కుమ్మక్కై ఆ భూమికి లేని విలువను ఉన్నట్లుగా చూపి రూ.10 వేల కోట్ల రుణం తీసుకున్నారని తెలిపారు. అక్కడ భూమి విలువ ఎకరా రూ.75 కోట్లని జీవో ఇచ్చారని, దానిప్రకారం తొలుత రూ.30 వేల కోట్లని, తర్వాత 20 వేల కోట్లని చెప్పారని.. చివరికి ఆ భూమి విలువను రూ.16 వేల కోట్లకు కుదించి తన వాళ్లకు కట్టబెట్టడానికి రేవంత్ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాలు అటవీ భూమేనని.. సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నానని కేటీఆర్ అన్నారు. అసలు ప్రభుత్వం తీసుకున్న 10వేల కోట్ల రుణంతో ఏం చేసిందని ప్రశ్నించారు. మంత్రివర్గంలో ఉన్న కాంట్రాక్టర్లు, వాళ్ల మనుషులకు కమీషన్లు చెల్లించడానికి వాడారా? అని నిలదీశారు.
ప్రధాని, ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేస్తాం
రేవంత్ సర్కార్ చేసిన ఈ ఆర్థిక మోసాన్ని బీఆర్‌ఎస్ వదిలిపెట్టదన్న కేటీఆర్.. తమ పార్టీ తరఫున ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రధాని వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ఈ వ్యవహారంలో రేవంత్‌కు అండగా నిలబడ్డ బీజేపీ ఎంపీ పేరును త్వరలో బయట పెడతానని చెప్పారు. కేంద్రంస్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
టీజీఐఐసీకి మేం రుణం ఇవ్వలేదు
వాళ్లు మా వద్ద స్థలాలు తనఖా పెట్టలేదు
కంచ గచ్చబౌలి భూముల అంశంలో.. కేటీఆర్ ఆరోపణలను
ఖండించిన ఐసీఐసీఐ బ్యాంకు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల అంశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమపై చేసిన ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంకు ఖండించింది. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల సంస్థ (టీజీ-ఐఐసీ)కి తమ బ్యాంకు నుంచి ఎలాంటి తనఖా(మార్ట్‌గేజ్) రుణం ఇవ్వలేదని స్పష్టం చేసింది. కేటీఆర్ విలేకరుల సమావేశం ముగిసిన కాసేపటికే ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బాండ్ల జారీకి టీజీ ఐఐసీ తమ వద్ద ఎలాంటి స్థలాన్ని తనఖా పెట్టలేదని తెలిపింది. బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపులకు సంబంధించి టీజీఐఐసీకి ఖాతా బ్యాంకుగా మాత్రమే ఐసీఐసీఐ వ్యవహరించిందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు