Kishan Reddy: మెట్రో డీపీఆర్ ఇచ్చింది గత వారమే
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:10 AM
తెలంగాణ ప్రభుత్వం గత వారమే కేంద్రానికి మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి అవగాహనారాహిత్య వ్యాఖ్యలు
కాంగ్రెస్ కోసమో.. రేవంత్ కోసమో మేం పనిచేయం
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: కిషన్‌రెడ్డి
రెండోదశ మెట్రోపై.. సీఎం రేవంత్‌వి అవగాహనారాహిత్య వ్యాఖ్యలు
సమస్యలను పరిష్కరించకుండా.. కేంద్రం ఆమోదించడం లేదని చెప్పడం దురదృష్టకరం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం గత వారమే కేంద్రానికి మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ఇచ్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెట్రో డీపీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. ‘‘మెట్రో రెండోదశకు కేంద్రం ఆమోదం తెలపలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కొంతమంది మంత్రులు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు. వారి వ్యాఖ్యలు దురదృష్టకరం. సీఎం రేవంత్ ఔనన్నా.. కాదన్నా.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కోసమో.. రేవంత్‌రెడ్డి కోసమో పనిచేయం.
తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. కేంద్రానికి గత వారమే మెట్రో డీపీఆర్ అందిందని, మెట్రోను నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టీతో రెండో దశకు సంబంధించిన ఎంవోయూ ఎలాంటిది? అనే వివరాలపై చర్చించాల్సి ఉందన్నారు. దీంతోపాటు.. ఎన్ని రైళ్లను ప్రారంభిస్తారు? రైల్వే నెట్‌వర్క్ నిర్వహణ బాధ్యత ఎవరిది? ఖర్చులను ఎవరు భరిస్తారు? అనే అంశాలపై చర్చ జరగాల్సి ఉందని గుర్తుచేశారు. ‘‘సీఎం రేవంత్, గతవారం ఢిల్లీకి వచ్చినప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇవే అంశాలను అడిగారు. వీటిని, రెండో దశ మెట్రో సమస్యలను పరిష్కరించకుండా.. కేంద్రం ఆమోదించడం లేదని సీఎం రేవంత్ విమర్శలు చేయడం దురదృష్టకరం’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.