Share News

Kishan Reddy: రేవంత్‌.. నోరు అదుపులో పెట్టుకో

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:00 AM

సీఎం హోదాలో ఉండి ప్రధాని మోదీపై అవాకులు, చవాకులు పేలుతారా..?’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ప్రధాని మోదీ బీసీనా..? కాదా..? అన్న అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు.

Kishan Reddy: రేవంత్‌.. నోరు అదుపులో పెట్టుకో

  • ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. మోదీపై నోటికొచ్చినట్టు మాట్లాడతావా..?

  • బీసీలకు కాంగ్రెస్‌ ఏం చేసింది: కిషన్‌రెడ్డి

  • రాహుల్‌ మతమేంటి : బండి సంజయ్‌

హైదరాబాద్‌/కంది/రామచంద్రాపురం టౌన్‌/కామారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘సీఎం హోదాలో ఉండి ప్రధాని మోదీపై అవాకులు, చవాకులు పేలుతారా..?’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. ప్రధాని మోదీ బీసీనా..? కాదా..? అన్న అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయం మరచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. స్వతహాగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా, దేశంలో బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడిగా మోదీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే.. కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. బీసీల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల జాబితాను తాను ఇస్తానని.. మరి కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పగలరా..? అని రేవంత్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చేసిన కులగణన సర్వేను బీసీ సంఘాలే విమర్శించిన సంగతి నిజం కాదా..? అని నిలదీశారు.


బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం మరో ప్రయత్నం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. ‘మీ పరిశోధన పూర్తిగా విఫలమైంది. 1994లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మోదీ ఓబీసీ జాబితాలో ఉన్నారు. రాహుల్‌గాంధీ ఏ కులానికి చెందినవారు..? ఆయన మతం ఏంటి..? రాహుల్‌ తాత ఫిరోజ్‌ జహంగీర్‌ గాంధీ. హిందూ సంప్రదాయంలో కులం తండ్రి ద్వారా వస్తుంది. ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి.. 10 జన్‌పథ్‌ నుంచి ప్రారంభించాలి’ అని సంజయ్‌ స్పష్టం చేశారు. మోదీపై విమర్శలు చేస్తే సూర్యుడిపై ఉమ్మివేసినట్లుగా ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కేంద్రం ఏం చేసింది అంటూ అందరూ మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌, రేవంత్‌ కలిసి వస్తే ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.కేంద్రం ఇచ్చిన నిధులపై హరీశ్‌ రావు, కేటీఆర్‌ చర్చకు సిద్ధమా అంటూ కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలో పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రామచంద్రపురంలోనూ ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు.


హామీల పేరుతో కాంగ్రెస్‌ దగా: లక్ష్మణ్‌

అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా హైడ్రా, మూసీ ప్రక్షాళన, కుల గణన పేరుతో కాంగ్రెస్‌ పబ్బం గడుపుతోందన్నారు. రూ.లక్షా 10వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి, సమ్మక్క, సారక్క యూనివర్సిటీ ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు. హిందువులను విడగొట్టేందుకు సీఎం రేవంత్‌ కుల రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 15 , 2025 | 04:00 AM