Golconda Fort: స్కై వే కేబుల్ కార్ ప్రాజెక్టుకు..మూడు కంపెనీల నుంచి బిడ్లు
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:26 AM
హైదరాబాద్‌లో గోల్కొండ కోట-సెవెన్ టూంబ్స్ మధ్య నిర్మించనున్న స్కై వే కేబుల్ కారు ప్రాజెక్టులో కీలక అడుగు పడింది.
సెవెన్ టూంబ్స్, గోల్కొండ ప్రాంతంలో.. ఎంపీ అసద్, టూరిజం ఎండీ పర్యటన
నార్సింగ్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో గోల్కొండ కోట-సెవెన్ టూంబ్స్ మధ్య నిర్మించనున్న స్కై వే కేబుల్ కారు ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించాలంటూ హెచ్‌ఎండీఏ గతంలో టెండర్ నోటిఫికేషన్ ప్రకటించగా.. మూడు కంపెనీలు ముందుకు వచ్చాయి. సాంకేతిక కమిటీ పరిశీలన అనంతరం ఏజెన్సీ ఎంపిక జరగనుంది. ఇదిలా ఉండగా గురువారం గోల్కొండ కోట, సెవెన్ టూంబ్స్ ప్రాంతాలను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. కేబుల్ కార్ నిర్మాణం ఎలా ఉండాలి..? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఎప్పటిలోపు పనులు పూర్తవుతాయి..? తదితర అంశాలపై చర్చించారు. ఈ ప్రాంతాలకు మరిన్ని పర్యాటక హంగులు అద్దేందుకు కేబుల్ కార్ ప్రతిపాదనను అసదుద్దీన్ ప్రతిపాదించారు. 2026లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబుల్ కారు అందుబాటులోకి వస్తే పాత బస్తీ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అసదుద్దీన్ పేర్కొన్నారు.
ఉపాధి కల్ప తరువు అరబ్ గల్ఫ్: మంత్రి వివేక్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలు తెలంగాణకు ఉపాధి కల్ప తరువు అని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. రాష్ట్రం బయట తెలంగాణ వాసులు ఎక్కువ సంఖ్యలో ఉపాధి పొందుతోంది అరబ్ గల్ఫ్ దేశాల్లో మాత్రమేనని చెప్పారు. గురువారం దుబాయ్‌లో ఆయన ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధితో మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, తద్వారా ఉపాధి కల్పన అవకాశాలను పెంచడంతో పాటు సంక్షేమానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. త్వరలో తాను అధికార బృందంతో కలిసి గల్ఫ్ దేశాల పర్యటనకు వస్తానని వెల్లడించారు. అంతకు ముందు, దుబాయ్‌లో కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ ఎస్వీ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు వివేక్‌ను కలిసి దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రవాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News