Hyderabad: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కడ్నుంచి..?
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:52 AM
హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఈ రహదారి అలైన్‌మెంట్‌పై కసరత్తు జరుగుతోంది. కానీ, ఏపీలోని అమరావతి, తెలంగాణలోని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఎంట్రీ పాయింట్ల (రోడ్డు నిర్మాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఎక్కడ అనుసంధానించాలి?)ను నిర్ధారించలేదు.
‘హైదరాబాద్-అమరావతి’ రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు
త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. అందులో ఎంట్రీ పాయింట్ల ఖరారు
3 ప్రతిపాదనలతో ప్రాథమిక రూట్‌మ్యాప్!.. వాటిని సీఎంలు ఓకే చేస్తే కేంద్రానికి..
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఈ రహదారి అలైన్‌మెంట్‌పై కసరత్తు జరుగుతోంది. కానీ, ఏపీలోని అమరావతి, తెలంగాణలోని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఎంట్రీ పాయింట్ల (రోడ్డు నిర్మాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఎక్కడ అనుసంధానించాలి?)ను నిర్ధారించలేదు. ఈ విషయం తేలితేనే దీనికి సమాంతరంగా నిర్మించాలని భావిస్తున్న హై స్పీడ్ రైలు మార్గానికి కూడా లైన్ క్లియర్ అవుతుంది. ఎంట్రీ పాయింట్లపై త్వరలోనే ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కీలక సమావేశం ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఆ సమావేశంలోనే ఇరు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి రోడ్డును నిర్మించాలనే విషయం ఖరారవుతుందని అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు, రేవంత్‌ల సమావేశం తర్వాత మార్గం పూర్తి స్వరూపం తెలుస్తుందని, దాంతో అలైన్‌మెంట్ కూడా ఖరారవుతుందని అంటున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు కుడివైపుగా ప్రాథమికంగా మూడు రకాల ప్రతిపాదనలతో కూడిన రూట్‌మ్యా్‌పను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మ్యాప్‌పై సీఎంలు సుముఖత వ్యక్తం చేస్తే, ఆ వివరాలను కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం.
ఆ తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని పేర్కొంటున్నారు. ఏపీ, తెలంగాణ విభజన చట్టంలో హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలనే హామీ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేతో పాటు ఇదే ప్రాంతంలో నిర్మించాలని భావిస్తున్న డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ రోడ్డు, రైౖలు మార్గాన్ని ‘హై స్పీడ్’ కారిడార్‌గా నిర్మించాలని కోరింది. అటు ఏపీ కూడా ఈ రోడ్డును మంజూరు చేయాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఫలితంగా ఇటీవల ఏపీలో పలు జాతీయ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు వెళ్లిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రతిపాదిత మార్గం వివరాలను సమర్పించాలని సూచించారు. ఈ రహదారి నిర్మిస్తే పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఎగుమతులు, దిగుమతులకు కూడా ఉపయోగపడనుంది. తెలంగాణ పరిధిలో ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు ఎంట్రీ పాయింట్ ఎక్కడన్నది తేలడం లేదు.
హైదరాబాద్‌కు ఇప్పటికే ఔటర్ రింగు రోడ్డు ఉండగా, దీనికి కొంత దూరంలో రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), రీజినల్ రింగు రైలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ కోసం ఓఆర్‌ఆర్ నుంచి ఎంట్రీ పాయింట్ ఇవ్వాలా లేక ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఇవ్వాలా అనేదానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఇవ్వాలనుకుంటే ఫ్యూచర్‌సిటీకి దగ్గర్లో ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కానీ, ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగంపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ అలైన్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. దాని ప్రకారం అమరావతి హైవేకు ఎంట్రీ పాయింట్ కూడా ఖరారవుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. లేదంటే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగంతో సంబంధం లేకుండా ప్రస్తుతమున్న ఓఆర్‌ఆర్ నుంచే ఫ్యూచర్‌సిటీకి దగ్గరగా ఉండేలా ఒకటి లేదా రెండు ఎంట్రీ పాయింట్లను గుర్తించాల్సి ఉంటుందనే అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఉభయ రాష్ట్రాల పరిధిలో ఎంట్రీ పాయింట్లు తేలితేనే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనులు వేగవంతం కానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News