MLA Sabitha: కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ కల సాకారం..
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:20 AM
ఎవరు ఏమన్నా.. కేసీఆర్ చేసిన నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. దశాబ్దాల కల కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. అయినప్పటికీ కొందరు విమర్శలు చేస్తుండడం దారుణమన్నారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11 రోజులు చేసిన నిరాహార దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(MLA Sabitha Reddy) అన్నారు. విజయ్ దీక్షా దివస్ సందర్భంగా మీర్‌పేట్ సర్కిల్ జల్లెలగూడలోని చందచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడి అంబేడ్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పింక్ బెలూన్లు గాల్లోకి వదిలారు.

ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ 2009 డిసెంబరు 9న నాటి కేంద్ర హోమంత్రి చిదంబరం స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేసి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన గురించి తెలియజేశారని, ఆయన హామీతోనే కేసీఆర్ దీక్ష విరమించారని అన్నారు. కాగా, ప్రస్తుత అధికార పార్టీలోని నేతలు కేసీఆర్ దీక్షపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సహేతుకం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా కేసీఆర్ వల్లనే రాష్ట్రం సిద్ధించిందన్నది జగమెరిగిన సత్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ బడంగ్‌పేట్, మీర్‌పేట్ సర్కిళ్ల అధ్యక్షులు, నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంపాపేట డివిజన్‌లో..
చంపాపేట: చంపాపేట డివిజన్ రెడ్డికాలనీలోని దివ్యాంగుల వసతిగృహంలో మంగళవారం బీఆర్‌ఎస్ యువ నాయకుడు గండికోట శ్రీనాథ్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులకు పండ్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మనీష్, యశ్వంత్, కోమల్, భాను, సాయి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News