Share News

KCR: కాళేశ్వరం కమిషన్‌కు ఏం చెబుదాం?

ABN , Publish Date - May 29 , 2025 | 04:42 AM

కాళేశ్వరం కమిషన్‌ ముందు జూన్‌ 5న విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్న మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అందుకు సంబంధించి తగిన సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

KCR: కాళేశ్వరం కమిషన్‌కు ఏం చెబుదాం?

  • హరీశ్‌రావుతో కేసీఆర్‌ మంతనాలు.. ఫామ్‌హౌస్‌లో 4గంటలపాటు సుదీర్ఘ చర్చ

సంగారెడ్డి ప్రతినిధి/హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్‌ ముందు జూన్‌ 5న విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్న మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అందుకు సంబంధించి తగిన సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌ్‌సకు పిలిపించుకున్నారు. కమిషన్‌ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులు సహా పలు అంశాలపై ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకు ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో ఈ ఇరువురితోపాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ఉన్నారు. కాళేశ్వరం నిర్మాణం నుంచి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు డ్యామేజీ అయ్యేవరకు జరిగిన పరిణామాలపై వారు మూడున్నర గంటలపాటు సమాలోచన చేసినట్లు తెలిసింది. ఎన్‌డీఎ్‌సఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) ఏం సూచించింది, బ్యారేజి కుంగడంపై సాంకేతిక కారణాలు ఏమిటన్న దానిపై పూర్తివివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా.. ఇప్పటికే కమిషన్‌ ఎదుట హాజరైన కొంతమంది రిటైర్డ్‌ ఇంజనీర్లతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. కమిషన్‌ అడిగిన ప్రశ్నలు ఏంటి? ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయన్న విషయాలపై కూడా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటికి సంబంధించిన సమాచారంపై కూడా కేసీఆర్‌, హరీశ్‌ మాట్లాడుకున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది పడిన నాటినుంచి పూర్తయ్యేవరకు అన్ని వివరాలను హరీశ్‌తో భేటీలో కేసీఆర్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లపై ఏయే సందర్భంలో సంతకాలు పెట్టాల్సి వచ్చిందో.. ఆయా ఫైళ్ల వివరాలను సైతం కేసీఆర్‌ తెప్పించుకున్నట్లు తెలిసింది. కాగా, కమిషన్‌ ఎదుట సమాధానాలు చెప్పే క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంతోపాటు కమిషన్‌ను సైతం ఇరుకునపెట్టే విధంగా పలు అంశాలను కేసీఆర్‌ ప్రస్తావించనున్నట్లు సమాచారం. అందుకే పూర్తిస్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు లెక్కలు, వివరాలపై అధ్యయనం చేసేందుకే హరీశ్‌తో భేటీ జరిగినట్లు తెలిసింది. హరీశ్‌రావు సైతం జూన్‌ 9న విచారణకు హాజరవుతున్నందున.. ఎవరెవరు ఏయే అంశాలు ప్రస్తావించాలో ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.


కవిత అంశంపైనా..

బీఆర్‌ఎస్‌ పార్టీ విధివిధానాలను తన లేఖతో ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత అంశంపైనా కేసీఆర్‌, హరీశ్‌ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. కవిత విషయంలో స్పందించవద్దని కేసీఆర్‌ ఇప్పటికే కేటీఆర్‌కు సూచనలు చేశారు. ప్రస్తుతం కేటీఆర్‌ అమెరికా పర్యటనలో ఉన్నందున కవిత అంశంలో పార్టీ నేతలు స్పందించకుండా చూసుకోవాలని హరీశ్‌కు, ప్రశాంత్‌రెడ్డికి కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. కవిత ఎపిసోడ్‌, తాజా పరిణామాలపైనా ఈ ఇద్దరు నేతలతో కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ఇక జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం.


పార్టీకి మైలేజీ కోసమేనా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు పార్టీలో ఉత్సాహం నింపాలంటే కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరవడమే తక్షణ కర్తవ్యంగా కేసీఆర్‌ భావించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించడమే నేరమా? అనే కోణంలో కార్యకర్తలు, ప్రజలను రగిలించేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఫామ్‌హౌ్‌సలో మౌనంగా ఉండడం కంటే విచారణకు హాజరైతే తమ తప్పులు లేవని చెప్పడమే కాకుండా.. విచారణకు కేసీఆర్‌ హాజరవుతున్న సందర్భాన్ని పార్టీకి అనుకూలంగా మలచుకోవడానికి బీఆర్‌ఎస్‌ నాయకులూ సిద్ధమవుతున్నారు.


ఎన్‌డీఎస్‌ఏ నివేదిక బూటకమని తేలింది: కేటీఆర్‌

మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన నివేదిక బూటకమని, తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా తుదినివేదిక ఎలా ఇస్తుందని ఎల్‌అండ్‌టీ ప్రశ్నించడంతో నివేదిక తప్పులతడక అని రుజువైందని ఎక్స్‌ వేదికగా తెలిపారు. నివేదికను ఎల్‌అండ్‌టీ తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. సీఎం రేవంత్‌ రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. కాగా, అధికారంలో లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉంటామని, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు కృషిచేస్తామని కేటీఆర్‌ చెప్పారు. యూకేలో తెలుగు బిజినెస్‌కౌన్సిల్‌ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రగతికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా పనిచేయాలని ఆయన కోరారు.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 02:55 PM