Share News

Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్‌ నివేదిక అక్రమం

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:33 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్లక్ష్యం, అక్రమాలపై విచారణ కోసం వేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక అక్రమమంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్‌ నివేదిక అక్రమం

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటే చట్టవిరుద్ధంగా జరిగింది

  • కమిషన్‌ మమ్మల్ని కేవలం సాక్షులుగా పిలిచి తప్పుదోవ పట్టించింది

  • చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదు.. పరువు నష్టం కలిగేలా నివేదిక

  • ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికలోని అంశాలను

  • దురుద్దేశంతో మీడియా సమావేశంలో వెల్లడించారు

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి కోసం రాజకీయ నాటకాలు

  • నివేదికను కొట్టివేయండి.. హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌ పిటిషన్లు

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్లక్ష్యం, అక్రమాలపై విచారణ కోసం వేసిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక అక్రమమంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమ పరువుకు నష్టం కలిగించేలా, ఏకపక్షంగా ఉన్న ఆ నివేదికను కొట్టివేయాలని కోరారు. ఆ నివేదికకు సంబంధించి తమకు ఎలాంటి ప్రతులు, సమాచారం అందలేదని.. కానీ నివేదికలోని అంశాలను సీఎం, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారని కోర్టుకు వివరించారు. ఇది దురుద్దేశపూరిత చర్య అని.. తమ పేరు, ప్రతిష్ఠలకు భంగకరమని పేర్కొన్నారు.

బాధ్యులెవరో తేల్చడం కమిషన్‌ పనికాదు

కాళేశ్వరంపై విచారణ కమిషన్‌ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 6 చెల్లదని.. ఎలాంటి అధికార పరిధి లేకుండానే, కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌-1952కు విరుద్ధంగా సదరు జీవో ఇచ్చారని పిటిషన్లలో కేసీఆర్‌, హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు వ్యక్తిగతంగా ఎవరు బాధ్యులో తేల్చాలని జీవోలో ఉందని.. అసలు జ్యుడీషియల్‌ విచారణ చేసే అధికారం విచారణ కమిషన్లకు ఉండదనే విషయాన్ని పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు. గతంలో జరిగిన విషయాలకు ఎవరు బాధ్యులని తేల్చడం విచారణ కమిషన్‌ అధికార పరిధిలోకి రాదన్నారు.


సాక్షులుగా పిలిచి తప్పుదోవ పట్టించింది

ఆధారాల కోసం కేవలం సాక్షులుగా పిలుస్తున్నామంటూ సమన్లు ఇచ్చిన కమిషన్‌.. తమపై ఆరోపణలు చేయడం ద్వారా తప్పుదోవ పట్టించిందని కేసీఆర్‌, హరీశ్‌రావు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. కమిషన్‌ ఇచ్చే నివేదిక ఎవరైనా వ్యక్తిపై ఆరోపణలు చేసేలా, వారి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఉంటే.. కచ్చితంగా సదరు వ్యక్తికి కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ చట్టం సెక్షన్‌-8 బీ, సెక్షన్‌ 8 సీ కింద నోటీసు ఇవ్వాలని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల వాదన వినడంతోపాటు సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలా చేయకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. కమిషన్‌ దురుద్దేశం, పక్షపాతంతోనే తమకు నివేదిక ప్రతిని ఇవ్వలేదని.. ఈ కారణంతో సదరు కమిషన్‌ నివేదిక మొత్తాన్ని కొట్టివేయవచ్చని పేర్కొన్నారు. సదరు నివేదిక న్యాయ సమీక్షకు ఏ విఽధంగానూ నిలవదని, దానిని కొట్టివేయాలని హైకోర్టును కోరారు.

స్థానిక ఎన్నికల కోసం రాజకీయ నాటకాలు

కమిషన్‌ నివేదికలో తమకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను మీడియా సమావేశం పెట్టి వెల్లడించడం, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇవ్వడం, మీడియాలో ప్రచురించడం ద్వారా ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశం కనిపిస్తోందని పిటిషన్‌లో కేసీఆర్‌, హరీశ్‌రావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించడం కోసం రాజకీయంగా నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లు త్వరలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎదుట విచారణకు రానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2025 | 04:33 AM