Kaleshwaram Commission: అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:50 AM
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు శనివారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
కాళేశ్వరం పేరుతో రాజకీయ కక్ష తీర్చుకొనే కుట్ర
ఈ అంశంపై న్యాయస్థానం తేల్చే వరకు
కాళేశ్వరం నివేదికను సస్పెండ్ చేయండి
హైకోర్టులో కేసీఆర్, హరీశ్ మధ్యంతర దరఖాస్తులు
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు శనివారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇప్పటికే రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో వాటిపై తుది తీర్పు వెలువడే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అక్రమమని, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8-బీ, 8-సీ కింద తమకు నోటీసు ఇవ్వకుండా తమ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కమిషన్ నిర్ధారణలు చేసిందని, సదరు కమిషన్ నివేదికను కొట్టేయాలని కోరుతూ ఇప్పటికే కేసీఆర్, హరీశ్‌లు హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ నివేదికను అసెంబ్లీ ఎదుట ఉంచి చర్చించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం చెప్పడంతో వారిద్దరి పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అసెంబ్లీలో చర్చించిన తర్వాత కూడా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాజాగా శనివారం కేసీఆర్, హరీశ్‌లు మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు.
శాసనసభలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్పే ప్రమాదం ఉందని.. అసెంబ్లీలో చర్చించామనే కారణాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష తీర్చుకోవాలని, పిటిషనర్ల కీర్తి ప్రతిష్ఠలను, పేరు ప్రఖ్యాతులను దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. సెక్షన్ 8-బీ, సెక్షన్ 8-సీ కింద నోటీసు ఇవ్వకుండా వెలువరించిన కమిషన్ నివేదికే అక్రమమని, సదరు అక్రమ నివేదిక ఆధారంగా ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చిం చాం కాబట్టి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకునే అవకాశం ఉందని, అలా చేస్తే తిరిగి పూరించలేని విధంగా తమకు నష్టం జరుగుతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వడంతోపాటు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లలో హైకోర్టు తుది తీర్పు ప్రకటించే వరకు కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మధ్యంతర దరఖాస్తులు ప్రధాన పిటిషన్లతో కలిపి రెగ్యులర్ విధానంలో త్వరలో విచారణకురానున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి:
కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌పై మాటల యుద్ధం..
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..