Share News

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ నా దారిలోకి రావాల్సిందే!

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:30 AM

కొంత కాలంగా బీఆర్‌ఎస్‌ విధానాలపై పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఒక్క సారిగా దూకుడు పెంచారు. సొంత పార్టీపై ప్రత్యక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ నా దారిలోకి  రావాల్సిందే!

  • బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ సరైనదే

  • అన్నీ తెలిసే బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తోంది

  • నిపుణులతో చర్చించాకే నేను మద్దతిచ్చా

  • మల్లన్న వ్యాఖ్యలపై స్పందించకపోవడం దారుణం

  • దీన్ని ఆ పార్టీ నేతల విజ్ఞతకే నేను వదిలేస్తున్నా

  • బనకచర్లను అప్పనంగా చంద్రబాబు చేతిలో పెట్టారు

  • రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి

  • ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : కొంత కాలంగా బీఆర్‌ఎస్‌ విధానాలపై పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఒక్క సారిగా దూకుడు పెంచారు. సొంత పార్టీపై ప్రత్యక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని, దీన్ని వ్యతిరేకించడం సరికాదంటూ బీఆర్‌ఎస్‌ తీరును తప్పుపట్టారు. తీన్మార్‌ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ స్పందించకపోవడంపైనా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు కాకున్నా.. తర్వాతైనా తన దారిలోకి రావాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి కవిత మద్దతు ఇస్తున్నారా? లేక బీసీ రిజర్వేషన్లపైనే మాట్లాడుతున్నారా? అసలు కవిత వ్యూహం ఏంటి? అన్న అంశాలపై గులాబీ శ్రేణుల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురువారం ఆమె మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు వీలుగా ఆర్డినెన్స్‌ తేవడం సరైందేనని కవిత ప్రకటించారు. ‘‘బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించాలంటూ కేంద్రానికి పంపిన బిల్లు, ప్రస్తుతం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌... రెండూ వేర్వేరనే విషయం చెప్పకుండా బీఆర్‌ఎస్‌ వాళ్లు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడం విడ్డూరంగా ఉంది. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానం చేసింది. ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్‌పై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే నేను మద్దతు ఇస్తున్నా. ఈ విషయంలో చివరకు బీఆర్‌ఎస్‌ కూడా నా దారిలోకి రావాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్‌ చేసింది కూడా తానేనని గుర్తు చేశారు. తనను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు నోరు మెదకపకోవడం దారుణమని, దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని వెల్లడించారు. మల్లన్నను జనాభా లెక్కల నుంచి తీసేశానని, ఆయనెవరో కూడా తనకు తెలియదని, ఆ ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్‌ స్వయంగా బొగ్గు గని కార్మికుడని, ఆయనకు టీబీజీకేఎస్‌ బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని కవిత వెల్లడించారు.


సీఎం రేవంత్‌రెడ్డి బుకాయిస్తున్నారు

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్ల అంశమే లేదంటూ రేవంత్‌రెడ్డి బుకాయిస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. అదే సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. తెలంగాణ పట్ల బాధ్యత లేని రేవంత్‌రెడ్డికి సీఎం పదవిలో ఉండే అర్హత లేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తన స్కూల్‌.. బీజేపీలో అని, కాలేజీ.. టీడీపీలో అని, ఉద్యోగం కాంగ్రె్‌సలో అని చెప్పుకొన్న రేవంత్‌రెడ్డి.. ఇంకా కాలేజీలోనే ఉన్నాననుకొని చంద్రబాబుకు గోదావరి నీళ్లను దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ మీటింగ్‌లో శాలువాతో సన్మానం చేయించుకొని బలికా బక్రా అయ్యారని ఎద్దేవా చేశారు. ఆయన ఏమైనా నష్టం లేదని, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగడం ఆందోళనకరమన్నారు. ఈ సమావేశం ద్వారా సీఎం సాధించిందేమీ లేదని, టెలిమెట్రీ స్టేషన్లు ఇప్పటికే ఉన్నాయని, కేఆర్‌ఎంబీని ఏపీకి తరలించాలన్నది విభజన చట్టంలోనే ఉందని గుర్తు చేశారు. బనకచర్లతో ఏపీ ప్రజలకూ ఉపయోగం లేదని, తెలంగాణలోని తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం చేపడితే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు కడితే.. వచ్చే కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టుకు రేవంత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వం బనకచర్లపై తగిన చర్యలు తీసుకోకుంటే కలిసి వచ్చే పక్షాలతో జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. 21నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బనకచర్లతోపాటు బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 03:30 AM