BIG Mistake in MLC Elections: ఆ ఒక తప్పు హరికృష్ణను ఓడించిందా..!
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:36 PM
తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్ఠభద్రుల స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఎందుకు ఓడిపోయారు. గ్రాడ్యుయేట్లు మద్దతు పలికినప్పటికీ.. ఆయన చేసిన పొరపాటు ఏమిటి. ఆ ఒక తప్పే ఆయన కొంపముంచిందా.. ప్రసన్న హరికృష్ణకు ఎక్కువమంది ఓట్లు వేశామని చెబుతున్నా.. ఎందుకు గెలవలేకపోయారు. ఆ ఒక్క పొరపాటు ఆయనను విజయానికి దూరం చేసిందా..

ఒకో సారి లాభం చేస్తాయనుకునే అంశాలు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. మనం చేసే ఒక తప్పుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందనడానికి ఇటీవల జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికలే నిదర్శనం. ముఖ్యంగా రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరగగా.. అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్నిక మాత్రం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం. ఇక్కడినుంచి మొత్తం56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య ప్రధానపోటీ జరగ్గా.. చివరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ సరళి ఆధారంగా బీఎస్పీ అభ్యర్థ ప్రసన్న హరికృష్ణ విజయం తథ్యమని ప్రచారం జరిగింది. ఓట్ల లెక్కింపు చేపట్టన తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గట్టిపోటీ ఇస్తారని అంతా అంచనా వేసినప్పటికీ త్రిముఖ పోరులో విజయం సాధిస్తారని కచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ అనూహ్యాంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు అధికంగా రావడంతో బీజేపీ అభ్యర్థి కౌంటింగ్ ప్రారంభం నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. దీంతో కోటా ఓట్లు రాకపోయినప్పటికీ ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా చివరకు అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటే అన్ని ప్రాధాన్యత ఓట్లను ఒక అభ్యర్థి వేయవచ్చు. దీంతో చాలామంది పోటీలో ఉండే వ్యక్తులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయకపోయినా కనీసం రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తారు. కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేవలం మొదటి ప్రాధాన్యత ఓటువేసి వెళ్లిపోతారు. సాధారణ ఓటరు మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు రెండు, మూడు ప్రాధాన్యత ఓట్లు వేసే అవకాశం ఉంది. దీంతో తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థులు కోరతారు.
మొదటి ప్రాధాన్యత వేయని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు కోసం అభ్యర్థిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చినప్పటికీ తొలి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వస్తే ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉండవు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఒకటి లేదా రెండో స్థానంలో ఉంటేనే రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ పడినా ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువపడి రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లు అందరికంటే ఎక్కువ పడినా ఎలాంటి ఉపయోగం ఉండదు. సరిగ్గా ప్రసన్న హరికృష్ణ విషయంలో ఇదే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ప్రసన్న హరికృష్ణ ఓటమికి గల కారణం ఏమిటి.. ఆ తప్పే ఆయనను ఓడించిందా..
రెండో ప్రాధాన్యత దెబ్బ తీసిందా
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణకు టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థికంటే ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తే బ్యాలెట్ పేపర్లో తన పేరు ముందువరుసలో వస్తుందనే ఉద్దేశంతో బీఎస్పీ మద్దతుతో బరిలోకి దిగారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం చేయడంతో పాటు ప్రధాన పోటీదారుడిగా మారారు. ఏ పది మంది గ్రాడ్యుయేట్లను కదిలించినా కనీసం ఐదుగురు నోట ప్రసన్న హరికృష్ణ పేరు వినిపించింది. సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పోలిస్తే ప్రసన్న హరికృష్ణకు పార్టీ క్యాడర్ తక్కువ. అయినప్పటికీ ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అదే సమయంలో మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్, బీజేపీ లేదా ఇతర అభ్యర్థులకు వేసినప్పటికీ రెండో ప్రాధాన్యత తనకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ విషయంలో ఆయన విజయం కూడా సాధించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లలో ఎక్కువమంది రెండో ప్రాధాన్యతను హరికృష్ణకు వేశారు. కానీ ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత మూడో స్థానంలోనే ఉండటంతో ప్రసన్న హరికృష్ణను ఎలిమినేటర్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ రెండో స్థానంలో ఉండిఉంటే రెండో ప్రాధాన్యత ఓట్లతో తప్పనిసరిగా ఆయన గెలిచి ఉండేవారన్న చర్చ జోరుగా సాగుతోంది.
అతి విశ్వాసం..
ప్రసన్న హరికృష్ణ అతి విశ్వాసం కూడా ఆయన ఓటమికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత కొద్ది నెలలుగా ఆయన చేసిన ప్రచారం, గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లు అభ్యర్థించడం ద్వారా ప్రచారంలో ముందున్నారు. ఎక్కువమంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించడంతో వారంతా తనకు ఓట్లు వేస్తారని విశ్వసించారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బీసీ వాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో బీసీ కార్డు తనకు పనికొస్తుందని భావించారు. బీసీ కార్డును ఎక్కువుగా నమ్ముకోవడం ద్వారా ఆయన నష్టపోయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల ప్రచారంలో తొలి ప్రాధాన్యత ఓటుకంటే రెండో ప్రాధాన్యత ఓటైనా సరే తనకు వేయాలని బలంగా ప్రచారం చేయడం ఓ విధంగా నష్టం చేసిందనే చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి...
Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం
phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here