India’s First AI Village: రికార్డుకెక్కనున్న దేశంలోనే తొలి ఏఐ గ్రామం.. ఎక్కడంటే..?
ABN , Publish Date - Sep 13 , 2025 | 07:05 PM
ప్రస్తుతం అంతా ఏఐయే. దేశంలోనే తొలి ఏఐ గ్రామంగా మరికొన్ని రోజుల్లో రికార్డుకెక్కనుందన్న సంగతి తెలుసా?. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లోని ఒక గ్రామం.. ఆ గుర్తింపును సొంతం చేసుకోనుంది.
పెద్దపల్లి, సెప్టెంబర్ 13: ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాలు ఎలా ఉంటాయంటే.. అభిృద్ధికే కాదు.. విద్య, వైద్య సౌకర్యాలు సైతం ఆమడ దూరంలో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో.. అది కూడా ఏజెన్సీ ప్రాంతంలోని ఒక గ్రామం దేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామంగా రికార్డుకెక్కనుంది. ఈ విషయం ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం నూటికి నూరు శాతం నిజం. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామం ఆ ఖ్యాతిని దక్కించుకోనుంది.
ఈ నేపథ్యంలో ఇకపై ఏఐ శ్రీరాంపూర్‌గా ఈ గ్రామాన్ని పిలువనున్నారు. హైదరాబాద్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ ప్రస్తుతం హైస్పీడ్ ఇంటర్ నెట్ సౌకర్యంతో ఆ పల్లె వెలుగులీనుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సహాయంతో విద్యార్థులకు విద్యా బోధన అందుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి గతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ సైతం అందేవి కావు. అలాగే ఈ గ్రామంలో విద్యుత్ కోతలూ తీవ్రంగానే ఉండేది. దీంతో విద్యా బోధనకు ఈ ప్రాంత ప్రజలు దూరంగా ఉండేవారు.
అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అనంతరం తెలంగాణలో కోటి ఇళ్లకు టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఆ జాబితాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని అసెంబ్లీ నియోకవర్గంలోని ముత్తారం మండలం అడవీ శ్రీరాంపూర్ గ్రామం కూడా ఉంది.
హైదరాబాద్ లేదా మెట్రో సిటీస్‌లో మాత్రమే ఉండే హైస్పీడ్ ఇంటర్ నెట్ ప్రస్తుతం ఈ గ్రామంలోనూ ఉంది. ఇంటింటికీ ఇంటర్నెట్‌లో భాగంగా ఇక్కడ టీవీలు, సెల్ ఫోన్లు అన్నింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కీలకంగా మారింది. ప్రతి ఇంటికీ మోడమ్ ఇవ్వడంతో.. వైఫై సిగ్నల్స్ ద్వారా టీవీలు,సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు పని చేస్తున్నాయి. ఈ మేరకు మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అడవీ శ్రీరాంపూర్‌ని ఏఐ గ్రామమని అభివర్ణించారు.
ఇక అడవీ శ్రీరాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ పాఠాలు అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫర్ ఫ్లెక్సిటీటూల్స్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో వారంతా ముందుకెళ్తున్నారు. టీవీలే స్మార్ట్ కంప్యూటర్లుగా చేసుకుని.. అంతర్జాతీయ స్థాయి విద్యా బోధనతో విద్యార్థులు దూసుకెళ్తున్నారు.
అంతే కాదు స్కూల్లో విద్యార్థులకు మూడు డిజిటల్ బోర్డులు, రెండు మానిటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారానే విద్యార్థులకు టీచర్లు పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులు డిజిటల్ బోర్డు ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తూ టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీలకే సాధ్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సైతం ఈ పాఠశాలల్లోని విద్యార్థులు వినియోగిస్తున్నారు. ఫర్‌ఫ్లెక్సిటీ ఏఐ టూల్స్ ను ఉపయోగించి వాయిస్ మోడ్ ద్వారా పలు ప్రశ్నలకు విద్యార్థులు జవాబులు రాబట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఆ గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ జెట్ స్పీడ్‌తో అందుతున్నాయి. టీ ఫైబర్ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత కేబుల్, డిష్ కనెక్షన్లను కూడా గ్రామస్థులు తీసేశారు. టీ ఫైబర్ నెట్ ఉండటంతో ఇంటి నుంచే అన్ని ఇంటర్ నెట్ పనులను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్నెట్ సేవలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు.
భవిష్యత్‌లో నెల వారి ఛార్జీలను గ్రామస్తుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొత్తానికి అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి ఇంటర్నెట్ వెలుగులు రావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏఐతో విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడంతో ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా గ్రామాల్లోని విద్యార్థులు కూడా ఏఐపై అవగాహన పెంచుకుంటున్నారు. భవిష్యత్‌లో ఉద్యోగాలు సాధించేందుకు పాఠశాలలో నేర్చుకునే ఏఐ బాగా ఉపయోగపడుతుందని విద్యార్థులు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంట్లోంచి పెద్దగా అరుపులు.. లోపలికెళ్లి చూడగా షాక్..
మంచినీళ్ల కోసం వెళ్లిన మహిళలు.. అది చూసి పరుగో పరుగు..
For More TG News And Telugu News