Statue Of Goddess: బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:49 PM
మంచిర్యాల జిల్లా ముల్కల మండలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో ఆ విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంచిర్యాల, డిసెంబర్ 15: మంచిర్యాల జిల్లా ముల్కల గోదావరి నది ఒడ్డున అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో ఈ విగ్రహాన్ని చూసేందుకు ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు పోటెత్తారు. అమ్మవారి విగ్రహానికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసి పోయింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రజలు క్యూ లైన్ పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఒకానొక సమయంలో ప్రజలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం పూజారీతోపాటు పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు గోదావరి పరిక్రమ యాత్ర చేపట్టారు. డిసెంబర్ 12వ తేదీన ఈ యాత్ర.. మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ముల్కల గోదావరి నది వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే మార్గంలో ప్రదేశాన్ని చూపించి.. ఈ ప్రాంతంలో ఏదో తెలియని శక్తి ఉందని వారు చెప్పారని గ్రామస్తులు తెలిపారు.
ఈ స్థలం ప్రైవేట్ భూమి కావడంతో.. ఆ యజమాని అనుమతి తీసుకుని తవ్వకాలు జరిపినట్లు వారు చెప్పారు. ఈ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తవ్వకాలు జరిపారని వివరించారు. ఈ సందర్బంగా సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం బయట పడిందన్నారు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. అమ్మ వారి విగ్రహం బయటపడడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో అమ్మ వారి విగ్రహం వెలుగులోకి రావడం తమ అదృష్టమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతంలో దేవాలయం ఉందని స్వామిజీలు చెబుతున్నారని వివరించారు. దాంతో జేసీబీల సహయంతో తవ్వకాలు జరుపుతున్నామని గ్రామస్తులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. ప్రత్యేక పూజలు
వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
For More TG News And Telugu News