Share News

Kaleshwaram Project Report: 31లోపు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:24 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌..

Kaleshwaram Project Report: 31లోపు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక
Kaleshwaram Project Report

  • 27న రాష్ట్రానికి రానున్న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌

  • నివేదిక సమర్పించి.. విచారణ ముగిసినట్లుగా ప్రభుత్వానికి లేఖ రాయనున్న చైర్మన్‌

  • మంత్రివర్గంలో చర్చించి, శాసనసభలో ప్రవేశపెట్టాక సర్కారు చర్యలు

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌.. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ ఈ నెల 27న హైదరాబాద్‌కు రానున్నారు. వచ్చీరాగానే నివేదికకు తుదిరూపు ఇచ్చి.. రెండు, మూడు రోజుల్లోపు ప్రభుత్వానికి అందించ నున్నారు. ఈ నెల 29 నుంచి 31లోపు ఏ రోజైనా నివేదికను సమర్పించి, విచారణ ముగిసినట్లుగా పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసి వెళ్లనున్నారు. దీంతో ఈ దఫా ఆయన పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం బ్యారేజీలపై గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్‌ వేయగా.. అదే ఏడాది ఏప్రిల్‌ నుంచి విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. విచారణ ప్రక్రియలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. మొత్తం 115 మంది కోర్టు విట్‌నె్‌సలను కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్ఏ) నిపుణుల కమిటీ మూడు నెలల కిందటే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (వీఅండ్‌ఈ) కూడా విచారణ జరిపి.. పలువురు అధికారులపై క్రిమినల్‌ కేసులు, మరికొందరిపై శాఖాపరమైన చర్యలు, ఇంకొందరిపై సవరణ పెన్షన్‌ నిబంధనలు అనుసరించి, పెన్షన్‌లలో కోత విధించాలని సిఫారసు చేసింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా 38 మంది అధికారులకు షోకాజు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ముగ్గురు కీలక అధికారులపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసింది. మాజీ ఈఎన్‌సీ(జనరల్‌) సి.మురళీధర్‌, గజ్వేల్‌ ఈఎన్‌సీ బి.హరిరామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ల నివాసాల్లో సోదా లు నిర్వహించి, రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇక జస్టిస్‌ ఘోష్‌ నివేదికను సమర్పిస్తే.. మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. అనంతరం శాససనభలో కూడా ప్రభు త్వం ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత దీనిపై చర్చించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:24 AM