Share News

Hyderabad: హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌‌గా ఏకే సింగ్‌

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:28 AM

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) నియమితులయ్యారు.

Hyderabad: హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌‌గా ఏకే సింగ్‌

  • త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ

  • త్రిపుర సీజేగా జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచందర్‌ రావు నియామకం

  • తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ బదిలీ.. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం

  • న్యాయకోవిదుల కుటుంబం నుంచి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌

  • ఆయన తాత జస్టిస్‌ బీపీ సిన్హా సుప్రీం 6వ ప్రధాన న్యాయమూర్తి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) నియమితులయ్యారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ సోమవారం కేంద్రం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆయనతో పాటుగా దేశంలో నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ, ఐదు హైకోర్టులకు కొత్త సీజేలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణతో పాటు త్రిపుర, మద్రాస్‌, రాజస్థాన్‌ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, గువాహటి, పట్నా హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్‌ ఏకే సింగ్‌ను తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మే 26న సిఫారసు చేసింది. దానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. అంతకుముందు చీఫ్‌ జస్టి్‌సగా పనిచేసిన అలోక్‌ అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బదిలీ అయినప్పటి నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ను బదిలీ చేసింది. ఆయనను కలకత్తా హైకోర్టు జడ్జిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం ఆమోదించింది. హైకోర్టులో నాలుగో సీనియర్‌ జడ్జిగా ఉన్న జస్టిస్‌ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ అయిన జస్టిస్‌ సీ సుమలత, జస్టిస్‌ కన్నెగంటి లలిత, జస్టిస్‌ ఏ అభిషేక్‌రెడ్డిలను మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినప్పటికీ ఆ సిఫార్లును ఇంకా కేంద్రం ఆమోదించలేదు. హైకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 42 కాగా ప్రస్తుతం 26 మంది పనిచేస్తున్నారు. ఇద్దరు జడ్జీల బదిలీ.. ఒకరి చేరికతో ఆ సంఖ్య 25కు తగ్గనుంది.


జస్టిస్‌ అపరేశ్‌ది న్యాయకోవిదుల కుటుంబ వారసత్వం

న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ 1965 జూలై 7న డాక్టర్‌ రాంగోపాల్‌సింగ్‌, డాక్టర్‌ శ్రద్ధ సింగ్‌ దంపతులకు జన్మించారు. ఆయన తల్లివైపు కుటుంబానికి చెందిన తాత జస్టిస్‌ బీపీ సిన్హా సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తిగా, మరో తాత అయిన జస్టిస్‌ శంభుప్రసాద్‌ సింగ్‌ పట్నా హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టి్‌సగా బాధ్యతలు నిర్వర్తించారు. సమీప బంధువులైన జస్టిస్‌ బిశ్వేశ్వర్‌ ప్రసాద్‌, జస్టిస్‌ శివకీర్తి సింగ్‌ సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్‌, న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందిన ఏకే సింగ్‌ 1990లో ఉమ్మడి పట్నా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1990 నుంచి 2000 వరకు పట్నా హైకోర్టులో, 2001 నుంచి 2012 వరకు జార్ఖండ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పలు కీలక కేసులు వాదించారు. 2012లో జార్ఖండ్‌ హైకోర్టు అదనపు న్యాయయమూర్తిగా, 2014లో శాశ్వత న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2022లో జార్ఖండ్‌ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టి్‌సగా సేవలు అందించి, 2023లో త్రిపుర హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా పదోన్నతి పొందారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై రానున్నారు.


త్రిపురకు జస్టిస్‌ రామచందర్‌ రావు

త్రిపుర హైకోర్టు సీజేగా తెలుగువాడైన జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌ రావును నియమించారు. ఆయనను ఝార్ఖండ్‌ నుంచి బదిలీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్‌ రామచందర్‌ రావు ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్త్తిగా, తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత పంజాబ్‌-హరియాణా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం ఝార్ఖండ్‌ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. రాజస్థాన్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ మణీంద్ర మోహన్‌ శ్రీవాత్సవను మద్రాస్‌ హైకోర్టు సీజేగా, మద్రాస్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ కె.పి.శ్రీరామ్‌ను రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ను అక్కడే శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఢిల్లీ న్యాయమూర్తి జస్టిస్‌ విభు బఖ్రును, గౌహతి సీజేగా పట్నా హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్‌ అశుతోష్‌ కుమార్‌ను నియమించారు. పట్నా హైకోర్టు సీజేగా అదే కోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్‌ విపుల్‌ మనోభాయి పంఛోలిని, ఝార్ఖండ్‌ సీజేగా హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తార్లోక్‌ సింగ్‌ చౌహాన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


ఇవి కూడా చదవండి

నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '

తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 05:28 AM