హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అపరేశ్ కుమార్ సింగ్
ABN , Publish Date - May 29 , 2025 | 04:39 AM
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అపరేశ్ కుమార్ సింగ్(ఏకే సింగ్) నియామకం కానున్నారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
జస్టిస్ వినోద్‌కుమార్ మద్రాస్ హైకోర్టుకు
కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసులు
ప్రస్తుతం త్రిపుర సీజేగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ అపరేశ్ సింగ్
న్యాయమూర్తుల కుటుంబ నేపథ్యం
ఆయన తాత బీపీ సిన్హా ఆరో సీజేఐ
హైదరాబాద్, న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అపరేశ్ కుమార్ సింగ్(ఏకే సింగ్) నియామకం కానున్నారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే బాంబే హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా బదిలీ అయినప్పటి నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్ సేవలు అందిస్తున్నారు. ఆయన్ను కోల్‌కతా హైకోర్టు జడ్జిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో నాలుగో సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయాలను ఈ నెల 26నే తీసుకున్నా నోటిఫికేషన్లు మాత్రం తాజాగా బుధవారం వెలువడ్డాయి. అలాగే ఇప్పటికే తెలంగాణ హైకోర్టు నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ అయిన జస్టిస్ సి. సుమలత, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డి మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం వెలువడింది. కాగా త్రిపురకు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు(మాతృ హైకోర్టు తెలంగాణ), రాజస్థాన్‌కు జస్టిస్ కేఆర్ శ్రీరామ్‌ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
న్యాయకోవిదుల కుటుంబం నుంచి
న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ 1965 జూలై 7న డాక్టర్ రాంగోపాల్‌సింగ్, డాక్టర్ శ్రద్ధసింగ్ దంపతులకు జన్మించారు. ఆయన కుటుంబానికి చెందిన తాత జస్టిస్ బీపీ సిన్హా సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తిగా.. మరో తాత అయిన జస్టిస్ శంభుప్రసాద్ సింగ్ పట్నా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టి్‌సగా బాధ్యతలు నిర్వర్తించారు. బంధువులు జస్టిస్ బిశ్వేశ్వర్ ప్రసాద్, జస్టిస్ శివకీర్తి సింగ్ సుప్రీంకోర్టు జడ్జిలుగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందిన ఏకే సింగ్ 1990లో ఉమ్మడి పట్నా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1990 నుంచి 2000 వరకు పట్నా హైకోర్టులో, 2001 నుంచి 2012 వరకు జార్ఖండ్ హైకోర్టు న్యాయవాదిగా పలు కీలక కేసులు వాదించారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2014లో శాశ్వత న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2022లో జార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టి్‌సగా సేవలు అందించి.. 2023 ఏప్రిల్ 14న త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. తాజాగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీపై రానున్నారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..