Jubilee Hills by-election: సెన్సార్ పూర్తి... రిలీజ్‌కు రెడీ
ABN , Publish Date - Nov 13 , 2025 | 08:22 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక సినిమా షూటింగ్ ముగిసిందనే భావనను రేకెత్తించింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రధాన తారాగణంలా ప్రచారంలో దుమ్మురేపారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు.. కథలో మలుపు తిప్పే పాత్రలను పోషించారనే భావనను ప్రచారం ద్వారా కల్గించారు.
- సినిమా షూటింగ్‌ను తలపించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
- అభ్యర్థుల విస్తృత ప్రచారం.. రెట్టింపు ఉత్సాహం నింపిన అతిథులు
- రేపు తేలనున్న భవితవ్యం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ఒక సినిమా షూటింగ్ ముగిసిందనే భావనను రేకెత్తించింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రధాన తారాగణంలా ప్రచారంలో దుమ్మురేపారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు.. కథలో మలుపు తిప్పే పాత్రలను పోషించారనే భావనను ప్రచారం ద్వారా కల్గించారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, సీనియర్ నాయకులు మాత్రం అతిథి నటులు లాగానే వచ్చి వెళ్లారు. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది డైరెక్షన్ గురించి..
ఈ పాత్రలో ఎన్నికల సంఘం ఒదిగిపోయింది. ఓటెత్తడానికి జనం తరలివస్తారనుకుంటే సగం మందే వచ్చి ఉసురుమన్పించారు. కాని నిర్మాత పాత్రను పోలియున్న అభ్యర్థులు రూ. 80 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారని టాక్. 11న సెన్సార్ (పోలింగ్ ముగిసింది.) పనులు పూర్తయ్యాయి. ఇక రిలీజ్ డేట్.. అంటే ఉప ఎన్నిక ఫలితం.. ఈనెల14వ తేదీ. కథంతా ఓటరు చుట్టూ తిరిగింది. ఇందులో ఆసక్తికర ట్విస్టూ ఉంది.. ఇది తెలుసుకోవాలంటే రిలీజ్ డేట్ వచ్చే వరకు వేచిచూడాలి.

ఇక విషయానికొస్తే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీ కార్యకర్త నుంచి ప్రముఖ నేతల వరకు ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు భారీ డైలాగులతో, హామీలతో శతవిధాతి ప్రయత్నాలు చేశారు. శీతాకాలం చలి కంటే ఉప ఎన్నిక వేడే తీవ్ర స్థాయికి చేరింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఎన్నిక తప్పనిసరి కాగా ఈ సీటును మరొక్కసారి దక్కించుకోవాలని సిట్టింగ్ పార్టీ, ఎలాగైనా ఖర్చీఫ్ వేసేయాలని అధికార పార్టీ.. తదతర పార్టీలు ప్రచారంలో అస్త్రశాస్త్రాలను ప్రయోగించాయి. కాని భారీగా పోలింగ్ జరిగేందుకు తీసుకొన్న ప్రణాళికలు సత్ఫలితం రాబట్టలేదు.
సాంకేతిక విభాగం పనితీరు
సినిమాలో సాంకేతిక విభాగం పోలిన పాత్ర ఎన్నికల కమిషనర్, సిబ్బందిది. వారు తమ భుజాన వేసుకొని ఈ ఉప ఎన్నికకు చేసిన ఏర్పాట్లు అదిరిపోయాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విజయవంతంగా తమ పరిధి మేరకు వారివారి పాత్రలను రక్తికట్టించారు.
భారీ బడ్జెట్....
ఎన్నికల ప్రచారం సినిమా రెగ్యులర్ షూట్‌లా అనిపించింది. నామినేషన్‌లకు భారీ ర్యాలీ.. పెద్ద నాయకులు వస్తే మంది మార్బలం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఈ హడావిడికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారట.
ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News