Jagga Reddy: సంజయ్, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:44 AM
ప్రజల కోసం తాను రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌కోసం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌పై ఏడాదిగా ఒత్తిడి పెడుతున్నానని చెప్పారు.

బీజేపీ నేతలు ఐటీఐఆర్ తీసుకువచ్చి మాట్లాడాలి
ఐటీఐఆర్ వచ్చేవరకు పోరాటం చేస్తా
నేనేంటో, నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, రాహుల్, ఏఐసీసీ నేతలకు తెలుసు
నా అవసరం ఉందనుకుంటే పదవి ఇస్తారు
పదవి ఉన్నాలేకున్నా పార్టీ కోసం పని చేస్తా
కవితా..పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు
వరంగల్ రావాలంటే రాహుల్ భయపడతడా
కన్యాకుమారి - కశ్మీర్ పాదయాత్ర చేశాడు
కేసిఆర్ 10 కిమీ పాదయాత్ర చేయగలడా?
టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ప్రజల కోసం తాను రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌కోసం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌పై ఏడాదిగా ఒత్తిడి పెడుతున్నానని చెప్పారు. ఐటీఐఆర్ మంజూరయ్యే వరకు గుర్తు చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఐటీఐఆర్ వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి దొరుకుందన్నారు. గాంఽధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డి కౌన్సిలర్, మునిసిపల్ చైర్మన్, ఎమ్మెల్యేగా జిల్లా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నట్లు ఆయన చెప్పారు. కౌన్సిలర్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నట్టు చెప్పారు. రాష్ర్టానికి ఐటీఐఆర్ వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను సంగారెడ్డికి ఐఐటీ తెచ్చినట్టు గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడిచిందన్నారు. రాష్ట్రం నుంచి 8మంది ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులుగా ఉన్నా హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను తీసుకువచ్చేందుకు ప్రధానితో ఎందుకు మాట్లాడటంలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
కోతలు కోయడం తప్ప రాష్ట్రానికి డబ్బులు తెచ్చింది లేదన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డిలను ఆయన కోతల రాయుళ్లుగా అభివర్ణించారు. పింక్‌బుక్ అంటూ సీఎం రేవంత్‌ను ఎందుకు రెచ్చగొడతారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను జగ్గారెడ్డి ప్రశ్నించారు. రేవంత్ ఏదైనా అంటే మళ్లీ బాధపడాల్సింది మీరే కదా అని అన్నారు. ఆమె జైలులో పడిన ఇబ్బందులు చూసి తాముకూడా బాధపడ్డామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర రాజకీయాలు అవసరమా? అని కవితను ప్రశ్నించారు. కాగా, కేసీఆర్ చేసిన పనుల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని జగ్గారెడ్డి అన్నారు. ప్రస్తుతం నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ, వరంగల్ రావడానికి భయపడతారా అని ఆయన అన్నారు. కేసిఆర్ కనీసం 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? అని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పదవులు ఉన్నా..లేకున్నా రాహుల్ ఏ పని చెబితే ఆ పని చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తానేంటో, తన పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, రాహుల్ గాంధీకి, ఏఐసీసీ నేతలకు తెలుసునని ఆయన చెప్పారు. తన అవసరం ఉందనుకుంటే వారే పదవి ఇస్తారని వ్యాఖ్యానించారు.