Share News

Space Exploration: 75 టన్నుల పేలోడ్‌ను రోదసిలో ప్రవేశపెట్టేందుకు 40 అంతస్తులంత ఎత్తైన రాకెట్‌ నిర్మిస్తున్నాం

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:24 AM

దాదాపు 75 వేల కిలోల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టడం కోసం.. 40 అంతస్తులంత ఎత్తైన రాకెట్‌ను నిర్మిస్తున్నామని ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ తెలిపారు.

Space Exploration: 75 టన్నుల పేలోడ్‌ను రోదసిలో ప్రవేశపెట్టేందుకు 40 అంతస్తులంత ఎత్తైన రాకెట్‌ నిర్మిస్తున్నాం

  • ఓయూ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): దాదాపు 75 వేల కిలోల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టడం కోసం.. 40 అంతస్తులంత ఎత్తైన రాకెట్‌ను నిర్మిస్తున్నామని ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ తెలిపారు. అలాగే.. 2035 నాటికి 52 టన్నుల అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నామని.. వీనస్‌ ఆర్బిటర్‌ మిషన్‌పై కూడా ఇస్రో కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. భారత అంతరిక్ష రంగ పరిశోధనలు అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా సాగుతున్నాయని తెలిపారు. భారతదేశపు తొలి ఉపగ్రహం ఆర్యభట్టను 1975లో ఇతర దేశాల సహకారంతో ప్రయోగించామని.. అప్పట్నుంచీ ఇప్పటిదాకా.. 6000 కిలోల హై-త్రూపుట్‌ జీశాట్‌-11 సహా 133 ఉపగ్రహాలను ప్రయోగించామని గుర్తుచేశారు. ఈ సందర్భంగానే ఆయన.. ఇస్రో ప్రస్తుతం తయారుచేస్తున్న భారీ రాకెట్‌ గురించి ప్రస్తావించారు. కలాం సమయంలో కేవలం 35 కేజీల శాటిలైట్‌ను దిగువ భూకక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు 17 టన్నుల రాకెట్‌ ప్రయోగించాల్సి వచ్చిందని.. నేడు 40 అంతస్తుల ఎత్తుతో, 75 టన్నుల పేలోడ్‌ను తీసుకువెళ్లగలిగే సామర్థ్యం కలిగిన రాకెట్‌ తయారుచేస్తున్నామని వెల్లడించారు.


దాంతోపాటు నావిక్‌ శాటిలైట్‌, ఎన్‌1 రాకెట్‌ ప్రయోగం తదితర పలు ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్టు తెలిపారు. మన రాకెట్లను వినియోగించి అమెరికాకు చెందిన 6500 కేజీల కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను పంపనున్నట్టు చెప్పారు. భారతీయ రక్షణ రంగ అవసరాల కోసం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ శాటిలైట్‌ (టీడీఎస్‌), మన నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారతీయ సైనిక సమాచార ఉపగ్రహం జీశాట్‌ -7 ఆర్‌ వంటివాటిని ఈ సంవత్సరం ప్రయోగించనున్నామన్నారు. ప్రస్తుతం భారతదేశానికి చెందిన 55 ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతున్నాయని తెలిపిన ఆయన.. మరో మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ సంఖ్య మూడు రెట్ల మేర పెరగనుందన్నారు. యాక్సియం-4 మిషన్‌ ద్వారా వాయుసేన పైలట్‌ శుభాన్షు శుక్లా సంపాదించిన అనుభవం.. మన గగన్‌యాన్‌ కార్యక్రమానికి ఎంతగానో తోడ్పడనుందని నారాయణన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కోరినట్లుగా భవిష్యత్‌లో 40-50 మంది వ్యోమగాములను తీర్చిదిద్దగలమని ఆయన పేర్కొన్నారు.


మార్గదర్శకులుగా ఉస్మానియన్లు

  • ఓయూ స్నాతకోత్సవంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

  • ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌కు గౌరవ డాక్టరేట్‌

  • డాక్టరేట్‌ అందుకున్న ఎమ్మెల్సీ దయాకర్‌

ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శకులుగా ఉన్నారని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కొనియాడారు. ఓయూ 84వ స్నాతకోత్సవం మంగళవారం వర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్‌ వీ నారాయణన్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్‌ అందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ పట్టాలు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 58 మంది విద్యార్థులకు, 2023-24కు 63 మందికి గవర్నర్‌, ఇస్రో చైర్మన్‌, వీసీ కుమార్‌ మొలుగరం బంగారు పతకాలు ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 1261 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు. 108 ఏళ్ల ఓయూ చరిత్రలో మొదటిసారిగా రాష్ట్ర గవర్నర్‌ పేరుతో గిరిజన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఆంగ్లంలో పీహెచ్‌డీ డిగ్రీని కొర్ర పాలెంకోకు అందజేశారు. కళాశాల విద్య కమిషనర్‌ దేవసేన తన తండ్రి ప్రొఫెసర్‌ సముద్రాల సత్యనారాయణమూర్తి స్మారక బంగారు పతకాన్ని ఎంబీఏ(ఫైనాన్స్‌)లో డాక్టర్‌ చిన్నారికి అందజేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిపాలన వ్యవహారాలు, వాస్తవ పరిస్థితులపై పరిశోధనకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ డాక్టరేట్‌ అందుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2025 | 04:24 AM