Warangal: మావోయిస్టుల కోటలో ‘ఆపరేషన్ ప్రస్థాన్’!
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:03 AM
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేయడం అంటేనే ఐపీఎస్ అధికారులకు సవాలు లాంటిది. అలాంటిచోట విధి నిర్వహణ కత్తి మీద సాము లాంటిదే.

యువతకు నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ, ఉపాధి.. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీల నిర్వహణ
6వేల మందితో యావత్మాల్‌లో క్రీడా పోటీలు
యువకులతో గ్రామ రక్షక్ దళాలు
మహారాష్ట్రలో తెలుగు ఐపీఎస్ చర్యలు
ఎస్పీ చింత కుమార్‌కు ఫడణవీస్ ప్రశంసలు
వరంగల్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేయడం అంటేనే ఐపీఎస్ అధికారులకు సవాలు లాంటిది. అలాంటిచోట విధి నిర్వహణ కత్తి మీద సాము లాంటిదే. కానీ, అక్కడ కూడా తన బాధ్యతలు చక్కగా నెరవేర్చడమేగాక.. యువత నక్సలిజం వైపు మొగ్గు చూపకుండా అనేక కార్యక్రమాలు చేపట్టారో తెలుగు ఐపీఎస్ అధికారి! ఆయనే మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఎస్పీ చింత కుమార్! యువతలోని నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా పనిచేసిన ఆయన.. గ్రామాల్లో ఉపాధి లేకుండా ఎవరూ ఖాళీగా ఉండొద్దని భావించారు. నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పించారు. గ్రామస్థాయి, డివిజన్, జిల్లా స్థాయిలోనూ క్రీడలు నిర్వహించారు. యావత్మాల్‌లో 6 వేల మందితో స్పోర్ట్స్ నిర్వహించి ‘శభాష్ పోలీస్’ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రశంసలందుకున్నారు.
గ్రామీణ నేపథ్యంతోనే అవగాహన..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామమానికి చెందిన చింత రాములు, శ్యామల దంపతుల కుమారుడు కుమార్. ఆయన భార్య దివ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా.. పిల్లలు ధృవయన్, విహాన్ ఉన్నారు. కుమార్ 2017లో ఐపీఎ్‌సగా ఎంపికయ్యారు. 2019 వరకు హైదరాబాద్‌లో శిక్షణ పొందిన అనంతరం మహారాష్ట్రలోని జల్గావ్ ఏఎస్పీగా విధుల్లో చేరారు. 2022లో గడ్చిరోలి జిల్లా అదనపు ఎస్పీగా నియమితులయ్యారు. అక్కడ యువత నక్సలిజం వైపు ఆకర్షితులవకుండా అనేక కార్యక్రమాలు చేపట్టారు. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో ఉన్న యావత్మాల్ జిల్లా ఎస్పీగా కుమార్‌ను బదిలీ చేశారు. అక్కడా నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువే. ‘ఆపరేషన్ ప్రస్థాన్’ పేరుతో యువత కోసం కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో ఖాళీగా ఉన్న, పేదరికంలో ఉన్న యువత జాబితాను సేకరించారు. వీరికి నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. కోర్సులు పూర్తి చేసిన వారు స్వయం ఉపాధితో స్థిరపడుతున్నారు. బయట ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఎస్పీ కుమార్ స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారు. యావత్మాల్ జిల్లాలో 31 పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో యువతకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. వాటిలో గెలిచిన జట్లకు డివిజినల్, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఈ క్రీడల్లో 6,050 మంది పాల్గొన్నారు. ఈ పోటీలు మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామ రక్షక్ దళాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి అనేక కార్యక్రమాలతో యావత్మాల్ జిల్లా ఎస్పీ కుమార్ మహారాష్ట్ర పోలీస్ శాఖలో ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కుమార్‌కు సమస్యలపై అవగాహన ఉండడంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్ సేవలపై మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ప్రశంసలు కురిపించారు. ‘‘ఆపరేషన్ ప్రస్థాన్ కార్యక్రమాన్ని చేపట్టిన యావత్మాల్ పోలీసులకు అభినందనలు. యువతకు 45 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించారు. అలాగే క్రీడా పోటీలూ నిర్వహించారు’’ అని అభినందించారు.
యువతను దారిలో పెట్టాలనే.. చింత కుమార్, యావత్మాల్ ఎస్పీ
‘‘ఉపాధి అవకాశాలు లేక.. ప్రోత్సహించేవారు లేక యువత చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారు. వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి, 45 రోజుల పాటు స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చాం. గ్రామస్థులు, పోలీసుల మధ్య సమన్వయం కోసం గ్రామ రక్షక్ దళాలను ఏర్పాటు చేశాం. నేనూ గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. యువత ఇబ్బందులు తెలుసు. యువతరాన్ని గాడిలో పెట్టాలనే ‘ఆపరేషన్ ప్రస్థాన్’ చేపట్టా’’ అని ఎస్సీ చింత కుమార్ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు.
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి