Share News

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:43 AM

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది దుర్మరణం పాలయ్యారు.

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

  • మరో 15 మంది కార్మికులు గల్లంతు

  • కాలిన తీవ్ర గాయాలతో 30 మంది ఆస్పత్రిలో.. వారిలో 16 మంది పరిస్థితి విషమం

  • సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోరం

  • డ్రయ్యర్‌ పేలడంతో ఎగిసిన అగ్నికీలలు.. 2 కిలోమీటర్ల మేర కంపించిన భూమి

  • కుప్పకూలిన పరిశ్రమ గెస్ట్‌ హౌస్‌.. అందులో ఉన్న జనరల్‌ మేనేజర్‌ మృతి

  • పేలుడు సమయంలో విధుల్లో 155 మంది.. ముద్దలుగా మృతదేహాలు

  • డీఎన్‌ఏ పరీక్షలకు చర్యలు.. రంగంలోకి దిగిన హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ బృందాలు

  • మృతులు, క్షతగాత్రులు బిహార్‌, ఒడిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాసులు

  • ఘటనాస్థలిని సందర్శించిన మంత్రులు దామోదర, వివేక్‌, మాజీ మంత్రి హరీశ్‌

  • సీఎస్‌ నేతృత్వంలో విచారణ కమిటీ.. ఘటనపై సీఎం దిగ్ర్భాంతి.. నేడు సందర్శన

సంగారెడ్డి ప్రతినిధి/రామచంద్రాపురం టౌన్‌/మియాపూర్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, ముద్దలుగా కనిపించాయి. అగ్నికీలలు, పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనం కూలిపోవడం, పార్క్‌ చేసిన వాహనాలకు నిప్పంటుకోవడంతో.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 15 మంది కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. రాత్రి కడపటి వార్తలందేసరికి కూడా పరిశ్రమలో శిథిలాల వెలికితీత కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 155 మంది ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఎయిర్‌వాక్స్‌ పేలినట్లు పేర్కొన్నారు. సాయంత్రానికి అది డయ్యర్‌ పేలుడు అయ్యి ఉండొచ్చని, రియాక్టర్‌ కాకపోవచ్చని వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ శివార్లలోని పాశమైలారంలో కొనసాగుతున్న సిగాచి పరిశ్రమలో.. ఉదయం షిఫ్ట్‌లో 6 గంటలకు పలువురు కార్మికులు విధులకు హాజరయ్యారు. జనరల్‌ షిఫ్ట్‌లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి పలువురు కార్మికులు, సూపర్‌వైజర్లు, అడ్మినిస్ట్రేటివ్‌ సిబ్బంది, అధికారులు లోనికి వచ్చారు. సరిగ్గా 9.10 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతతో 2 కిలోమీటర్ల వరకు భూమి కంపించింది.

1 copy.jpg


భారీ శబ్దం వినబడింది. పరిసర పరిశ్రమల్లోని కార్మికులు భూకంపం వచ్చిందంటూ బయటకు పరుగులు పెట్టారు. రోడ్డుపైన, పరిశ్రమల్లో పార్క్‌ చేసిన పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమలో 155 మంది ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదంలో హాజరు రికార్డు కూడా బుగ్గిపాలైందని తెలిసింది. పేలుడు సంభవించగానే.. అగ్నికీలలు వేగంగా వ్యాప్తిచెందాయి. పరిశ్రమలోని పార్కింగ్‌లో ఉన్న వాహనాలకు సైతం నిప్పంటుకోవడాన్ని బట్టి, తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ వెంటనే పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో అక్కడున్నవారికి ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అనేది అర్థం కాలేదు. లోపల బాధితుల హాహాకారాలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లుతున్నా.. లోనికి వెళ్లలేనంతగా పొగ వ్యాప్తి చెందింది. దీంతో స్థానికులు డయల్‌-100కు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులతోపాటు.. రిజర్వ్‌ బలగాలు, 11 ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా లోపల ఏంజరిగింది? కార్మికుల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు బయటకు రాలేదు. నాలుగు మృతదేహాలను గుర్తించామని పోలీసులు పేర్కొన్నా.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మృతుల సంఖ్య 12.. రాత్రి 9 గంటలకు.. 15కు చేరినట్లు ప్రకటించారు. అర్ధరాత్రికి మృతుల సంఖ్యను 19గా నిర్ధారించారు. పేలుడు ధాటికి మూడంతస్తుల గెస్ట్‌హౌస్‌ భవనం కూలిపోవడంతో.. అందులో ఉన్న జనరల్‌ మేనేజర్‌ ఎలాన్‌గోపన్‌ దుర్మరణంపాలయ్యారు. రాత్రి కడపటి వార్తలందేసరికి.. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. వర్షం అడ్డంకిగా మారినట్లు అధికారులు చెబుతున్నారు.


తమిళనాడు నుంచి వచ్చిన రోజే మృతి

ఈ ప్రమాదంలో మృతిచెందిన సిగాచి పరిశ్రమ జనరల్‌ మేనేజర్‌ ఎలాన్‌గోపన్‌ అనారోగ్యంతో బాధపడుతూ.. తన స్వరాష్ట్రమైన తమిళనాడులో నెలరోజులపాటు చికిత్స పొందారు. సోమవారమే ఆయన తిరిగి విధుల్లో చేరారు. ప్రమాదంలో పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కుప్పకూలగా.. ఆ భవనం మొదటి అంతస్తులో ఉన్న ఎలాన్‌గోపన్‌ దుర్మరణం పాలయ్యారు. కారిడార్‌లో పార్క్‌ చేసిన ఆయన కారు కూడా శిథిలాల కింద పడి నుజ్జునుజ్జయింది.


భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డాం

నేను జనరల్‌ షిఫ్ట్‌లో పరిశ్రమకు వచ్చాను. ఈ-మెయిల్స్‌ను పరిశీలిస్తతండగా.. పెద్దగా పేలుడు శబ్దం వినిపించింది. అంతా ఉలిక్కిపడ్డాం. అంతలోనే మంటలు ఎగిసిపడ్డాయి. నేనున్న భవనానికి బీటలు రావడంతో.. పక్కనే విరిగిపోయిన ఉన్న పిల్లర్‌ను ఆసరాగా చేసుకుని, బయటకు దూకాను. అంతలోనే పక్కనే ఉన్న భవనం కుప్పకూలిపోయింది. అంతే.. ఏం జరిగిందో గుర్తులేదు. కళ్లు తెరిచేసరికి అంబులెన్స్‌లో ఉన్నా.

- రాజశేఖర్‌రెడ్డి, హెచ్‌ఆర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌

ఏ జరిగిందో అర్థం కాలేదు

నేను ఉదయం షిఫ్ట్‌లో వచ్చాను. స్టోర్‌లో సామగ్రిని సర్దుతుండగా పెద్ద శబ్దం వినిపించింది. అంతలోనే కళ్ల ముందు దట్టమైన మంటలు.. పొగ కనిపించాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. నాతో ఉన్న నలుగురు కార్మికులను అప్రమత్తం చేసి, బయటకు పరుగులు తీశాను. నా కళ్ల ముందే.. తోటి కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడలేక.. కుప్పకూలిపోయాను. - యశ్వంత్‌, కార్మికుడు


ఆస్పత్రుల్లో హాహాకారాలు

క్షతగాత్రుల్లో 40-80 శాతం కాలిన గాయాలైన వారిని ఇస్నాపూర్‌ ఆస్పత్రి, 80శాతానికి పైగా కాలిన గాయాలైన వారిని తొలుత పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రి.. ఆ తర్వాత చందానగర్‌, మియాపూర్‌లలోని ప్రైవేటు ఆస్పత్రులకు, అపోలోకు తరలించారు. ఇప్పటి వరకు గుర్తించిన క్షతగాత్రుల్లో ఒడిసాకు చెందిన నాక్నాజిత్‌ బారి(20), రామ్‌సింగ్‌(50), సంజయ్‌కుమార్‌ యాదవ్‌(28), బిహార్‌కు చెందిన రాంరాజ్‌(25), సంజయ్‌ముఖయా(25), ధన్‌బీర్‌ కుమార్‌దాస్‌(28), నీలాంబర్‌(19), గణేశ్‌కుమార్‌(26), దేవ్‌చంద్‌(30), యశ్వంత్‌(30), అభిషేక్‌కుమార్‌, నాగజిత్‌ తివారీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి(40)గా గుర్తించారు. నాక్నాజిత్‌, అభిషేక్‌లు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రుల ప్రాంగణాలు క్షతగాత్రుల హాహాకారాలతో మార్మోగిపోయాయి. కాలిన గాయాలతో మంటలకు తాళలేక వారు బోరున విలపించారు. పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి వద్ద తగినన్ని ఫ్రీజర్లు లేకపోవడంతో.. మృతదేహాలను నేలపైనే పెట్టడం గమనార్హం..!

డ్రయ్యర్‌ పేలుడే కారణమా?

ప్రమాదానికి ఎయిర్‌వాక్స్‌ పేలుడే కారణమని చెబుతున్న అధికారులు.. డ్రయ్యర్‌ పేలి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే.. పేలుడుకు కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. సెల్యులోజ్‌ పౌడర్‌ తయారీకి ఇటీవలే ఈ పరిశ్రమలో డయ్యర్లను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో టన్నుకు పైగా సెల్యులోజ్‌ పౌడర్‌ ఉత్పత్తి అవుతుందని సమాచారం. ఇందులో వేడి తీవ్రతను స్థిరంగా ఉంచేందుకు ఫర్నెస్‌ ఆయిల్‌ను వాడుతారు. సెల్యులోజ్‌ పౌడర్‌ డ్రైయింగ్‌ సమయంలో ‘డస్ట్‌ కాంపాక్ట్‌’ కారణంగా వేడి తీవ్రమై.. వెంటిలేషన్‌ లోపంతో పేలుడు జరిగి ఉంటుందని పారిశ్రామిక నిపుణులు అనుమానిస్తున్నారు.


బూడిద దొరకడం కూడా కష్టమే..

చనిపోయిన వారి సంఖ్యపై అస్పష్టత నెలకొంది. ఇటు నిర్వాహకులు, అటు అధికారుల నుంచి సరైన ప్రకటన రావడం లేదు. ఫ్యాక్టరీలో ఇప్పటి వరకు మంటల్లో చిక్కుకొని చనిపోయినవారు కొందరైతే.. పేలుడు ధాటికి గోడలు కూలి మృతిచెందినవారు ఇంకొందరు. అయితే పేలిన ఎయిర్‌వాక్స్‌/డయ్యర్‌ సమీపంలో విధులు నిర్వహించేవారు చనిపోతే.. వారి బూడిద కూడా దొరకదని అధికారులు అంచనా వేస్తున్నారు. పేలుడు ధాటికి ఎముకలతో సహా సజీవ దహనం అవుతారని చెప్పుకొస్తున్నారు.

మంత్రుల పరామర్శ

ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ సైతం అక్కడే ఉన్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, ఐజీ సత్యనారాయణ కూడా సహాయక చర్యలను పర్యవేక్షించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీహెచ్‌ ప్రభాకర్‌, మాణిక్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మంత్రులు వివేక్‌, దామోదర.. ఆయా ఆస్పత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించారు.


మృతులంతా ఇతర రాష్ట్రాల వారే..

ఇప్పటి వరకు 19 మంది మృతిచెందినట్లు పేర్కొన్న అధికారులు.. వీరిలో ఎక్కువగా బిహార్‌, ఒడిసా, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు, క్షతగాత్రులంతా ఉదయం షిఫ్టులో పనికి వచ్చిన వారేనని వెల్లడించారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతులను గుర్తించినట్లు వెల్లడించారు.

డీఎన్‌ఏ పరీక్షలతోనే గుర్తించాలి..

ప్రమాద తీవ్రతకు కార్మికుల మృతదేహాలు కాలిన ముద్దలుగా మారాయి. పలు మృతదేహాల విషయంలో కనీస ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. ఒంటిపైన దుస్తులు పూర్తిగా కాలిపోయి.. చేతులు, కాళ్లు, తల, పొట్టభాగం ఉడికించినట్లుగా మారిపోయాయి. డీఎన్‌ఏ పరీక్షతోనే మృతులను గుర్తించాల్సి ఉంటుందని పోలీసులు వివరించారు. పరిశ్రమలోని హాజరు రిజిస్టర్‌ కూడా అగ్నికి ఆహుతైంది. దీంతో.. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరెవరున్నారు? అనేది తెలుసుకోవడం కష్టంగా ఉందని చెబుతున్నారు. అయితే.. పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఎక్సల్‌ షీట్‌ను విడుదల చేశారు. దాన్ని బట్టి.. ప్రమాదం జరిగినప్పుడు 163 మంది ఆ పరిశ్రమలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ లెక్కన.. 19 మంది మృతిచెందగా.. 30 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 114 మంది జాడ తెలియరావడం లేదు. పలువురు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. వారిని మినహాయిస్తే.. శిథిలాల కింద మరో 15 మంది వరకు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగిస్తోందని రెస్క్యూ బృందాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి.


3 నెలలు యూనిట్‌ మూసివేత

పాశమైలారంలోని తమ యూనిట్‌లో 90 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు, ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు సిగాచి కెమికల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. 90 రోజుల తర్వాత ఉత్పత్తిని పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది. తమ పరిశ్రమకు పూర్తిస్థాయిలో బీమా ఉందని, మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ఆర్థిక సాయం అందుతుందని పేర్కొంది. క్లెయిమ్‌ల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. తమ పరిశ్రమలో మైక్రోక్రిస్టలీన్‌ సెల్యులోజ్‌(ఎంసీసీ) ఉత్పత్తి అవుతుందని వివరించింది. దేశవ్యాప్తంగా ఉన్న మూడు యూనిట్లలో తాము ఏడాదికి 21,700 మెట్రిక్‌ టన్నుల(ఎంటీపీఏ) ఎంసీసీని ఉత్పత్తి చేస్తుండగా.. పాశమైలారంలోని పరిశ్రమలో 6 వేల ఎంటీపీఏల సెల్యులోజ్‌ తయారవుతుందని వెల్లడించింది.

బస్సు ఆలస్యం.. బతికించింది!

సిగాచి పరిశ్రమ కార్మికులను తీసుకువచ్చే బస్సు సోమవారం 10 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. 20 మంది కార్మికులతో వచ్చిన ఆ బస్సు పరిశ్రమలోకి ప్రవేశిస్తుండగా.. పేలుడు సంభవించింది. ఆ ధాటికి బస్సు అద్దాలు ధ్వంసమై.. 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి. దాంతో డ్రైవర్‌ బస్సును వెనక్కి రివర్స్‌లో తీసుకెళ్లి, సురక్షిత ప్రాంతంలో పార్క్‌ చేశారు. గాయపడ్డ ఎనిమిది మందికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు.


మా వాళ్లు ఎలా ఉన్నారు?

1 copy.jpg

ప్రమాదం వార్తను తెలుసుకున్న కార్మికుల బంధుమిత్రులు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. చనిపోయిన వారు.. క్షతగాత్రుల్లో తమ వారు కనిపించడం లేదంటూ.. వారు కన్నీరుమున్నీరుగా విలపించడం కనిపించింది. పరిశ్రమ నిర్వాహకులు, పోలీసులు ఎలాంటి వివరాలను అందజేయకపోవడంతో.. తమ వారి జాడ కోసం కనిపించిన వారందరినీ అడుగుతుండడం చూసేవారిని కలిచివేసింది. శిథిలాల కింద మృతదేహం దొరికిందని తెలియగానే.. తమ వారేనా? అని గుర్తించేందుకు పరుగెత్తే ప్రయత్నం చేశారు. మృతులు, క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో తరలిస్తుండగా.. కిటికీల్లోంచి చూసేందుకు ఆ వాహనాల వెంట పరుగులు తీశారు. కార్మికుల బంధుమిత్రులకు పరిశ్రమ యాజమాన్య ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో.. వారు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనాస్థలికి నేడు సీఎం..

సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రమాదం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై మంత్రులు వివేక్‌, దామోదర రాజనర్సింహలతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నట్లు వివరించారు. ప్రమాదం జరిగిన తీరు, తగిన కారణాలపై సీఎస్‌ రామకృష్ణరావు అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీలో విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, అగ్నిమాపక శాఖ డీజీ సభ్యులుగా ఉంటారు. మంగళవారం సీఎం రేవంత్‌ ఘటనాస్థలిని పరిశీలించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 01 , 2025 | 03:43 AM